unpaid
-
మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజూ బండెడు చాకిరీ.. పురుషులు మాత్రం!
అహ్మదాబాద్ : మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటిపనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్ యూజ్ డేటా : ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలిసీ అనాలిసిస్’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే , మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్ నమ్రత చందార్కర్ తెలిపారు. -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్‌మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. క్లిక్ చేయండి: పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా? తాజా మీడియా నివేదికల ప్రకారం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్ క్వార్టర్ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదరిపోయే ఆఫర్లు) కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. -
నో వ్యాక్సిన్.. నో శాలరీ.. నో జాబ్!
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్‌కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్‌ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్‌లైన్ విధించారు. ఇక వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్, ఇంటెల్ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్, మెటాలతో పాటు భారత్‌కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ! వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్‌కు ‘హై రిస్క్’ ట్యాగ్‌ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నారు. నో రిక్రూట్మెంట్ ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది. చాలా కంపెనీల్లో హెచ్ఆర్లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం. చదవండి: ఒమిక్రాన్ అలజడి! భారత్‌ను కుదిపేయనుందా? -
ఎయిరిండియా ఇంధన బకాయిలు బదిలీ
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్‌నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్పీవీకి బదిలీ చేయనుంది. డిసెంబర్‌లోగా బ్యాలెన్స్ షీట్... ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్‌షీట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ కానున్నాయి. సంస్కరణలకు సంకేతం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్‌ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు. -
ఖతార్‌లో భారతీయుల అష్టకష్టాలు
దోహ : ఖతార్ లోని భారత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ ఎలక్ర్టికల్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడలేదు. అబుదాబికి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మంది భారత కార్మికులకు గత నాలుగు నెలలుగా సదరు కంపెనీ జీతాలు చెల్లించలేదని ఖతార్ లోని భారత్ కు చెందిన ఓ చారిటీ ప్రతినిధి అర్విన్ పాటిల్ తెలిపారు. ఒకరో ఇద్దరో అయితే తామే డబ్బులు ఇచ్చేవారమని, కానీ 400 మందికి సాయం చేయడం చాలా కష్షతరమని అర్విన్ పేర్కొన్నారు. అయితే వారి సమస్యను పరిష్కరించే విషయంలో తమ వంతు సాయం చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్మికులంతా వచ్చే రెండు మూడు వారాల్లో ఖతార్ లోని భారత రాయబారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారని తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వారికే కాకుండా ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నవారికి కూడా సదరు కంపెనీ జీతాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికులకు ఎలక్ర్టానిక్ పద్ధతిలో వేతనాలు చెల్లించేలా గతేడాది ‘వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‘ తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘించిన కంపెనీల యజమానులు జరిమానాలు లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖతార్ లో పనిచేసే ఇతర దేశాల కార్మికుల్లో భారత్ కు చెందినవారే ఎక్కువ. దాదాపు 25 లక్షల మంది జనాభా కలిగిన ఖతార్ లో ఏకంగా 5.45 లక్షల మంది భారత కార్మికులు పనిచేస్తున్నారు. చమురు, సహజవాయువు ధరలు పడిపోవడంతో ఖతార్ ఆర్థికంగా సతమతమవుతోంది. అందువల్లే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోందని అధికారులు అంటున్నారు. కాగా 2022లో ఖతార్ సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అందుకుగాను స్టేడియాలను ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ సమయంలో కూలీలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల సంస్థలు ఎలుగెత్తుతున్నాయి. దీనిపై మాత్రం ఖతార్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు.