ఖతార్‌లో భారతీయుల అష్టకష్టాలు
ఖతార్‌లో భారతీయుల అష్టకష్టాలు
Published Fri, Sep 23 2016 1:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
దోహ : ఖతార్ లోని భారత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ ఎలక్ర్టికల్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడలేదు. అబుదాబికి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 400 మంది భారత కార్మికులకు గత నాలుగు నెలలుగా సదరు కంపెనీ జీతాలు చెల్లించలేదని ఖతార్ లోని భారత్ కు చెందిన ఓ చారిటీ ప్రతినిధి అర్విన్ పాటిల్ తెలిపారు. ఒకరో ఇద్దరో అయితే తామే డబ్బులు ఇచ్చేవారమని, కానీ 400 మందికి సాయం చేయడం చాలా కష్షతరమని అర్విన్ పేర్కొన్నారు.
అయితే వారి సమస్యను పరిష్కరించే విషయంలో తమ వంతు సాయం చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్మికులంతా వచ్చే రెండు మూడు వారాల్లో ఖతార్ లోని భారత రాయబారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోనున్నారని తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వారికే కాకుండా ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నవారికి కూడా సదరు కంపెనీ జీతాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికులకు ఎలక్ర్టానిక్ పద్ధతిలో వేతనాలు చెల్లించేలా గతేడాది ‘వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‘ తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘించిన కంపెనీల యజమానులు జరిమానాలు లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఖతార్ లో పనిచేసే ఇతర దేశాల కార్మికుల్లో భారత్ కు చెందినవారే ఎక్కువ. దాదాపు 25 లక్షల మంది జనాభా కలిగిన ఖతార్ లో ఏకంగా 5.45 లక్షల మంది భారత కార్మికులు పనిచేస్తున్నారు. చమురు, సహజవాయువు ధరలు పడిపోవడంతో ఖతార్ ఆర్థికంగా సతమతమవుతోంది. అందువల్లే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోందని అధికారులు అంటున్నారు. కాగా 2022లో ఖతార్ సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అందుకుగాను స్టేడియాలను ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ సమయంలో కూలీలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల సంస్థలు ఎలుగెత్తుతున్నాయి. దీనిపై మాత్రం ఖతార్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు.
Advertisement