
పంచాయతీలకు ‘షాక్’
మొండి బకాయిలపై విద్యుత్ శాఖ దృష్టి
8 970 పంచాయతీలు.. రూ.56 కోట్ల బకాయి
8 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2.6 కోట్ల చెల్లింపు
విజయవాడ/ గుడ్లవల్లేరు : జిల్లా విద్యుత్ శాఖ మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించింది. దాదాపు వేల సంఖ్యలో మొండి బకాయిదారులు విద్యుత్ శాఖ జాబితాలో ఉన్నారు. అలాగే జిల్లాలో 40కుపైగా ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని పంచాయతీల నుంచి కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. దీంతో పంచాయతీలకు ఇటీవల మంజూరైన 13వ ఆర్థిక సంఘం నిధులపై దృష్టి సారించి కొంత వసూళ్లు చేశారు. ఫలితంగా పది రోజుల వ్యవధిలో జిల్లాలోని పంచాయతీల నుంచి రూ.2.6 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. ఇటీవల జిల్లాకు 13వ ఆర్థికసంఘం మూడో త్రైమాసిక నిధులు రూ.12.96 కోట్లు మంజూరయ్యాయి. వాస్తవానికి ఈ నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీరోడ్ల నిర్మాణం, డైయిన్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి అవసరాల కోసం వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. అయితే గడచిన మూడేళ్లుగా జిల్లాలోని పంచాయతీల నుంచి విద్యుత్ బకాయిలు వసూలు కావడం లేదు. ఈ క్రమంలో మొండి బకాయిలపై విద్యుత్ శాఖ కొంత సీరియస్‌గా స్పందించింది.
దీంతో బకాయిలు చెల్లించాలని పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారులకు వరుస లేఖలు పంపారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అయితే విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేశారు. జిల్లాలో మొత్తం 970 పంచాయతీలున్నాయి. వీటిలో 720 మైనర్ పంచాయతీలు కాగా, 150 మేజర్ ఉన్నాయి. వీటిలో మైనర్ పంచాయతీల బకాయిలే అధికం. ఈ క్రమంలో పంచాయతీలకు మంజూరైన 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు కొంత చెల్లించాలని కోరారు. జిల్లా అధికారులు ఈవిషయంపై కలెక్టర్, ఇతర అధికారులతో చర్చలు జరిపి బకాయిలు చెల్లింపునకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతానికి 13 ఆర్థిక సంఘం నిధులతో బకాయిలు చెల్లించటానికి అంగీకారం రావడంతో కొన్ని పంచాయతీలు బకాయిలు చెల్లించాయి. మేజర్ పంచాయతీల్లో 60 శాతం బకాయిలు సక్రమంగానే చెల్లింపులున్నాయి. అదికూడా ప్రతినెలా కాకుండా ఏడాదికి ఒకసారి విద్యుత్ బిల్లు, పాత బకాయిలు చెల్లిస్తున్నారు. గడచిన ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగడం , నూతన పాలక వర్గాలు కొలువు తీరడంతో బకాయిల కోసం వరుస లేఖలు రాశారు. ఫలితంగా రూ.2.6 కోట్లు బకాయిలు రాబట్ట గలిగారు. ఈ నెలాఖరు నాటికి మరికొంత వసూలు అయ్యే అవకాశం ఉంది.
రూ. 56 కోట్ల బకాయి!
జిల్లాలో పంచాయతీల బకాయి రూ. 56 కోట్లు ఉంది. గడిచిన మూడేళ్ళుగా మైనర్ పంచాయితీలు 90 శాతం వరకు మేజర్ పంచాయితీలు 40 శాతం వరకు బకాయిలు చెల్లించలేదు. జిల్లాలో 720 మైనర్ పంచాయతీలు 40 కోట్లు బకాయిలు ఉన్నాయి. 150 మేజర్ పంచాయతీలు 16 కోట్లు బకాయిల రావాల్సి ఉంది. వీటిలో గడిచిన నెలలో మేజర్ పంచాయతీల నుంచి రూ.2.3 కోట్లు , మైనర్ పంచాయతీల నుంచి రూ.40 లక్షలు వసూలయ్యాయి. అసలు జిల్లాలో ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించని పంచాయతీల నుంచి కనీసం కొంతమొత్తం అయినా వసూళ్లు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరోమారు అన్ని పంచాయతీలకు నోటీసులు పంపాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ మోహనకృష్ణ సాక్షితో మాట్లాడుతూ బకాయిలు రూ.56 కోట్లు ఉంటే కేవలం రూ.2.6 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని, మిగిలిన బకాయిల వసూళ్లకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నెలాఖరు నాటికి మరికొంత బకాయి వసూలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.