భరోసా ఇవ్వని ‘అభయహస్తం’
సాక్షి, హైదరాబాద్: పేరుకే అభయహస్తం. కానీ, అది ఎక్కడా కానరావడంలేదు. ఆ పథకం నిధుల విడుదల ఆగిపోయింది. దీంతో 8 నెలలుగా లబ్ధిదారులకు సాయం అందడంలేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఆ పథకానికే భరోసా లేకుండా పోయింది. 1.08 లక్షలమందికి రూ.65 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అభయ హస్తం పథకాన్ని ఎత్తివేయాలని తొలుత భావించిన సర్కారు తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతానికి 30 శాతం మంది మహిళలకే ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతోంది. దాన్ని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలందరికీ వర్తింపజేయాలని, వారి జీవిత భాగస్వాములకు కూడా బీమా ప్రయోజనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ మేరకు అభయహస్తం పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల విడుదల ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.
అభయహస్తం ఇలా...
మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు ఈ పథ కం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ పథకంలో సభ్యురాలిగా చేరేందుకు అర్హత కల్పించారు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేల జీవిత బీమా లభిస్తుంది. సభ్యురాలు చెల్లించినదానికి సమానంగా ప్రభుత్వం కూడా జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తుంది.
సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున నాలుగేళ్లపాటు( 9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్‌ఐసీ నుంచి ఉపకారవేతనం కూడా లభిస్తుంది. సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను కూడా వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణించినా, శాశ్వత అంగవైక్యలం కలిగినా రూ.75 వేల బీమా అందుతుంది. సహజ మరణానికి కూడా రూ.30 వేల బీమా బాధిత కుటుంబానికి లభిస్తుంది.