Self-help group
-
మన్‌కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..
డిల్లీలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 24 ఏళ్ల పూనమ్ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్ భర్త ప్రమోద్ కుమార్ చెప్పారు. సదరు మహిళ పూనమ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం. ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్ లఖింపూర్ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్ సంగతన్ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ ఎపిసోడ్లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గుజరాత్ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్ కునుకు.. ఆ కమిట్మెంట్కు ఫలితంగా..) -
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
భరోసా ఇవ్వని ‘అభయహస్తం’
సాక్షి, హైదరాబాద్: పేరుకే అభయహస్తం. కానీ, అది ఎక్కడా కానరావడంలేదు. ఆ పథకం నిధుల విడుదల ఆగిపోయింది. దీంతో 8 నెలలుగా లబ్ధిదారులకు సాయం అందడంలేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఆ పథకానికే భరోసా లేకుండా పోయింది. 1.08 లక్షలమందికి రూ.65 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అభయ హస్తం పథకాన్ని ఎత్తివేయాలని తొలుత భావించిన సర్కారు తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతానికి 30 శాతం మంది మహిళలకే ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతోంది. దాన్ని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలందరికీ వర్తింపజేయాలని, వారి జీవిత భాగస్వాములకు కూడా బీమా ప్రయోజనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అభయహస్తం పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల విడుదల ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. అభయహస్తం ఇలా... మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు ఈ పథ కం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ పథకంలో సభ్యురాలిగా చేరేందుకు అర్హత కల్పించారు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేల జీవిత బీమా లభిస్తుంది. సభ్యురాలు చెల్లించినదానికి సమానంగా ప్రభుత్వం కూడా జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తుంది. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున నాలుగేళ్లపాటు( 9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్ఐసీ నుంచి ఉపకారవేతనం కూడా లభిస్తుంది. సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను కూడా వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణించినా, శాశ్వత అంగవైక్యలం కలిగినా రూ.75 వేల బీమా అందుతుంది. సహజ మరణానికి కూడా రూ.30 వేల బీమా బాధిత కుటుంబానికి లభిస్తుంది.