
కొలిక్కిరాని ఫీజు బకాయిల వ్యవహారం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
పాలనాపరమైన మంజూరు లేక నిలిచిన ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలే దు. గతనెల 19న రెండేళ్ల ఫీజు బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (బీఆర్వోలు) ఇచ్చినా వాటికి పాలనాపరమైన మంజూరు రాలేదు. పదిహేను రోజులు గడిచినా తదుపరి ఉత్తర్వులు వెలువడక విద్యార్థులతోపాటు, కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోరుచుట్టపై రోకలి పోటులా పాలేరు ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ఫీజు బకాయిలు చెల్లించేందుకు అనుమతినివ్వాలంటూ బీసీ, ఎస్టీ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తులు పంపించారు.
బీసీ, ఎస్టీ శాఖలకు సంబంధించే రూ.2,300కోట్ల వరకు బకాయిలున్నా యి. అన్నింటినీ ఒకేసారి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడు పాత బకాయిలన్నీ మొత్తం తీరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. చెల్లింపునకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. 2014-15, 2015-16 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కింద ఎస్సీశాఖకు రూ.517.35 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.288.92 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ.1954.26 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖకు రూ.300.49కోట్లు, వికలాంగ సంక్షేమశాఖకు ఆర్‌టీఎఫ్ కింద రూ.68.88 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్వోలు ఇచ్చింది.