బకాయిలు రూ. 100 కోట్లు
అధికారుల నిర్లక్ష్యం
రెవెన్యూలో అవినీతి తిమింగలాలు
ఎస్టేట్స్, టౌన్‌ప్లానింగ్‌లో జోరుగా అక్రమాలు
కార్పొరేషన్ ఆదాయానికి గండి
నగరపాలక సంస్థ ఆదాయానికి అధికారుల నిర్లక్ష్యంతో గండి పడుతోంది. వివిధ పన్నుల రూపంలో వసూలు కావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కోర్టు కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయి. పాత బకాయిలను రాబట్టి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉన్నా అధికారులు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది.
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అక్రమార్కుల కాసుల కక్కుర్తి ఆదాయానికి గండికొడుతోంది. రెవెన్యూ, ఎస్టేట్స్, టౌన్‌ప్లానింగ్ విభాగాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ అరకొరగానే జమ అవుతోంది. ఏటా మామూళ్ల రూపంలో కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఖాళీ స్థలాల పన్నుల రూపంలో ఏడాదికి రూ.8.48 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, సగం కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.58.20 కోట్ల మేర ఖాళీ స్థలాల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.22.34 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎస్టేట్స్ విభాగంలో మ్యుటేషన్ (పేరు మార్పు) ద్వారా రూ.11 కోట్లు రావాల్సి ఉందని అంచనా.
గాడితప్పిన రెవెన్యూ
రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్ను ద్వారా ఏడాదికి రూ.82.58 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. తొలి అర్ధ సంవత్సరానికి గాను రూ.41.29 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.35 కోట్లు వసూలు చేశారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటానని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. రెవెన్యూ విభాగం అవినీతికి కేరాఫ్‌గా మారిందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. పైసలివ్వనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లెక్కలేదు...
ఎస్టేట్స్ విభాగం గ‘లీజు’లకు లెక్కే లేదు. నగరపాలక సంస్థకు చెందిన 69 షాపింగ్ కాంప్లెక్స్‌లలో 3,396 షాపులు ఉన్నాయి. ఇందులో 700 షాపులు సబ్ లీజుల్లో ఉన్నాయని సర్వేలో తేలింది. మ్యుటేషన్ వసూలు చేయడం ద్వారా సుమారు రూ.11 కోట్లు వసూలవుతోందని అంచనా. 25 సంవత్సరాలు నిండిన షాపు యజమానులు కోర్టుకు వెళ్లి ఇంజంక్షన్ ఆర్డర్ తేవడంతో బకాయిల వసూలు కష్టంగా మారింది. వివిధ విభాగాలకు సంబంధించి 636 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూ.12.82 కోట్లు వసూలవుతుంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్ని గుర్తించడంలో సంబంధిత అధికారులు విలఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
దోచేస్తున్నారు...
నగరంలో 240 చదరపు గజాలలోపు మార్ట్‌గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు అనుమతి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఇంతవరకు జీవో మంజూరు కాలేదు. అనధికారిక కట్టడాల పేరుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గృహ యజమానులను దోచేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 గృహ నిర్మాణాలకు అనుమతి ఇస్తోంది. 240 గజాల లోపు భవనాలు ఇందులో 65 శాతం వరకు ఉంటాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు మార్ట్‌గేజ్‌ను బూచిగా చూపడంతో గృహ యజమానులు బెంబేలెత్తి ఆమ్యామ్యాలు సమర్పించుకొంటున్నారన్నది బహిరంగ రహస్యం. బిల్డింగ్ లెసైన్స్ ఫీజులు, ఇతర ఫీజుల రూపంలో ఏడాదికి రూ.33.50 కోట్లు వసూలవుతోంది. 240 గజాల లోపు మార్ట్‌గేజ్ లేకుండా జీ ప్లస్ 2కు ప్రభుత్వం అనుమతిస్తే సుమారు రూ.15 కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా.