పంచాయతీల కరెంటు బిల్లు రూ.16 కోట్లు
♦ రాబట్టేందుకు రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ
♦ శంషాబాద్ మండలంలో వీధి దీపాల కనెక్షన్ల తొలగింపు
వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించిన కరెంటు కనెక్షన్ల బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 16.67 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు నడుం బిగించారు. వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. -శంషాబాద్
శంషాబాద్ ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని ఎయిర్‌పోర్టు కాలనీ, నర్కూడ, బహదూర్‌గూడ, చెర్లగూడ, హమీదుల్లానగర్ , దొడ్డి, కాచారం, కవ్వగూడ, కొత్వాల్‌గూడ, పోశెట్టిగూడ, రాళ్లగూడ, రషీద్‌గూడ, రాయన్నగూడ, సంఘీగూడ, శంషాబాద్, శంకరాపురం, సుల్తాన్‌పల్లిలో వీధిదీపాల బకాయిలు రూ. 4.77 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన బకాయిలు రూ. 6.98 కోట్లు పేరుకుపోయాయి. మొత్తం కలిపి రూ. 11. 75 కోట్లు డివిజన్ పరిధిలో చెల్లించాల్సి ఉంది.
పెద్దషాపూర్ డివిజన్ పరిధిలోని బోటిగూడ, గండిగూడ, ఘాంసిమీయాగూడ, జుకల్, కవేలిగూడ, కిషన్‌గూడ, మదన్‌పల్లి, మల్కారం, ముచ్చింతల్, ననాజీపూర్, పాలమాకుల, పెద్దతూప్ర, పిల్లోనిగూడ, రామాంజపూర్, పెద్దషాపూర్, తొండుపల్లి, ఊట్‌పల్లి తదితర గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. 1.58 కోట్లు ఉండగా పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన మొత్తం రూ. 3.33 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా ఇటీవల సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందనరాలేదు. దీంతో ఎలాగైనా విద్యుత్ బిల్లులు రాబట్టేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
రెండురోజుల క్రితం టీఎస్ పీడీసీఎస్ ప్రత్యేకాధికారి తిరుపతయ్యగౌడ్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. విద్యుత్ బకాయిలను రాబట్టేందుకు ఆయా గ్రామ సర్పంచ్‌లను కలిసి పరిస్థితి వివరించారు. బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించారు. దీంతో బకాయిలు వసూలయ్యేంత వరకు గ్రామాల్లో చీకట్లు కమ్ముకునే పరిస్థిలు నెలకొనడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు తీరు సరికాదని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలు చెల్లించాల్సిందే: రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి
వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్‌కు సంబంధించి పంచాయతీలు వినియోగించిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ మండల పరిధిలో మొత్తం రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా బిల్లులను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. బకాయిలు చెల్లించని కారణంగానే వీధి దీపాల కనెక్షన్లు తొలగిస్తున్నాం.