
ప్రభుత్వ విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కట్టాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం వాడే విద్యుత్ బిల్లులు ప్రతి నెలా కచ్చితంగా చెల్లించేలా ఆయా శాఖలకు, కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకిచ్చే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో పాటు ఇతర రాయతీల కింద విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు.