బకాయిలను రెండ్రోజుల్లో చెల్లిస్తామని సీఎం హామీ
చిత్తూరు షుగర్స్‌లో రూ.12.07 కోట్లు
ఎస్వీ షుగర్స్‌లో రూ.8.62 కోట్ల బకాయిలు
2013-14 క్రషింగ్ సీజన్‌కు రూ.9.83 కోట్ల మంజూరు
చిత్తూరు షుగర్స్ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10.60 కోట్లపై నోరుమెదపని ప్రభుత్వం
చెరకు రైతుల బకాయిలను రెండు రోజుల్లోగా చెల్లిస్తానని డిసెంబర్ 11న హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. 2013-14 క్రషింగ్ సీజన్ లో బకాయిలను మాత్రమే చెల్లించడానికి రూ.9.83 కోట్లను మాత్రమే మం జూరు చేశారు. 2011-12, 2012-13 క్రషింగ్ సీజన్‌లో రైతులకు బకాయిల చెల్లింపుపై నోరు మెదపడం లేదు. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ కార్మికులకు వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ బకాయిల రూపంలో చెల్లించాల్సిన రూ.10.60 కోట్లనూ విడుదల చేయలేదు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో వేరుశనగ తర్వాత చెరకు ప్రధాన వాణిజ్య పంట. 40 మండలాల పరిధి లో 54 వేల హెక్టార్లలో చెరకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. చెరకు పంటపై ఆధారపడి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం (ఎస్వీ షుగర్స్), చిత్తూ రు సహకార చక్కెర పరిశ్రమ (చిత్తూరు షుగర్స్), మరో మూడు ప్రైవేటు చక్కెర పరిశ్రమలు నెలకొల్పా రు. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్‌లలో టన్ను చెరకుకు రూ.2,160 (రూ.1860 చెరకు పరిశ్రమ చెల్లిస్తే.. రూ.300 ప్రభుత్వం చెల్లిస్తుంది)ను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. జిల్లాలో 2012-13లో ఎస్వీ షుగర్స్‌లో 1.46 టన్నులు, చిత్తూరు షుగర్స్‌లో 1.05 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌లో ఎస్వీ షుగర్స్‌లో 1.20 లక్షలు, చిత్తూరు షుగర్స్‌లో 48 వేల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. చెరకు సరఫరా చేసిన రైతులకు అప్పట్లోనే చిత్తూరు, ఎస్వీ షుగర్స్‌లు రూ.1860 వంతున చెల్లించాయి.
తక్కిన రూ.300 చొప్పున రైతులకు ప్రభుత్వం చెల్లించాలి. ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. చిత్తూరు షుగర్స్‌లో 2011-12 క్రషింగ్ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.1.42 కోట్లు.. 2012-13, 2013-14 సీజన్‌లో రైతులకు రూ.8.50 కోట్ల మేర బకాయిపడింది. రైతులకే రూ.20.69 కోట్లను ప్రభుత్వం చెల్లించాలి. చిత్తూరు షుగర్స్ కార్మికులకు 13 నెలల వేతనాల రూపంలో రూ.ఎనిమిది కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో రూ.2.60 కోట్లు వెరసి రూ.10.60 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. డిసెంబర్ 11న చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.31.29 కోట్ల నిధులను విడుదల చేస్తే రైతులు, కార్మికుల బకాయిలను చెల్లించవచ్చు. ఆ హామీకి చంద్రబాబు తూట్లు పొడించారు. కేవలం 2013-14 క్రషింగ్ సీజన్‌లో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రమే చెల్లించేందుకు రూ.9.83 కోట్లను విడుదల చేస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు షుగర్స్ రైతులకు రూ.5.41 కోట్లు, ఎస్వీ షుగర్స్ రైతులకు రూ.4.42 కోట్లను బకాయిలుగా చెల్లించేందుకు విడుదల చేశారు. 2011-12, 2012-13 క్రషింగ్ సీజన్‌లో బకాయిల సీజన్‌ల చెల్లింపుపై ప్రభుత్వం చేతులెత్తేసినట్లేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. చిత్తూరు షుగర్స్ కార్మికులకు బకాయిల చెల్లించకుండా ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించడంపై కర్షక, కార్మిక లోకం మండిపడుతోంది.
చెరకు రైతుకు శరాఘాతం
Published Thu, Jan 22 2015 2:09 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement