
డబ్బులు ఇవ్వరు..డాంబికాలు ఆపరు
∙నేటి నుంచి నియోజకవర్గాల్లో నివనిర్మాణ దీక్షలు
∙గతేడాది దీక్షల బకాయిలు చెల్లించని ప్రభుత్వం
ప్రొద్దుటూరు: ప్రభుత్వ తీరు డాంభికాలే తప్ప. డబ్బులు ఇవ్వరన్న విధంగా తయారైంది. గత ఏడాది నిర్వహించిన నవనిర్మాణ దీక్షలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గంలో సుమారు లక్ష రూపాయలు ఖర్చయింది. సంబంధిత అధికారులకు చేతి చమురు వదిలింది. మరికొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ ఏడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. గ్రామానికి రూ.5వేలు, మండల కేంద్రంలో వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, బహుమతుల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.25వేలు కలిపి ప్రతి మండలంలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు.
ఈ ప్రకారం జిల్లాలోని 50 మండలాలకు కలిపి సంక్రాంతి సంబరాలకుగా 50 లక్ష రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత నవనిర్మాణ దీక్షలకు మేము ఇస్తామని చెప్పలేదు కదా అని జిల్లా అధికారులు చెప్పినట్లు సమాచారం. సంక్రాంతి సంబరాల డబ్బును ఎప్పుడు ఇస్తారో ఇంకా అధికారులకే అంతు చిక్కకపోగా, ప్రస్తుతం నిర్వహించే నవనిర్మాణ దీక్షలకు కూడా ఎంత మొత్తంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తామన్న విషయాన్ని జిల్లా అధికారులు స్పష్టంగా చెప్పలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నేటి నుంచి నవనిర్మాణ దీక్షలను నిర్వహించాల్సి వస్తోంది. అధికారులను ఇలా అప్పుల ఊబిలోకి నెట్టి కార్యక్రమాలను నిర్వహించడం సమంజసమేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సందేశం ఇవ్వనున్నారు. మూడో తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజూ వివిధ అంశాలపై నియోజకవర్గ కేంద్రాల్లో సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మండల, గ్రామస్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా స్పెషల్ ఆïఫీసర్లను ఇందుకు బాధ్యులుగా నియమించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలును చర్చించకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల ఏ మాత్రం ఫలితం ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.