-ఉపాధి కూలీలకు తప్పని పాట్లు
- అందని వేతనాలు
- రూ.2.5 కోట్ల బకాయిలు
నెల్లూరు(బారకాసు) : జిల్లాలో ఉపాధి హామీ బకాయిలు పేరుకుపోయాయి. కూలీలకు పని కల్పించడమే తమ బాధ్యత అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవని కారణంగా ఉపాధి కూలీలకు చేతినిండా పని దొరికింది. సీజన్ ప్రారంభంలో రోజుకు 25 వేల పనిదినాలు కల్పించగా, క్రమేణా ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో సరాసరి రోజుకు 50 వేల నుంచి 60 వేల పనిదినాలు కల్పించారు. అడపాదడపా చినుకులు పడుతుండటంతో పనిదినాలు సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రోజుకు 30 వేల నుంచి 35 వేల పనిదినాలు కల్పిస్తున్నారు.
తలనొప్పిగా మారిన స్మార్ట్ కార్డు
జిల్లాలో 961 గ్రామాల పరిధిలోని కూలీలకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారానే వేతనాల చెల్లింపులు జరుపుతున్నారు. స్మార్ట్‌కార్డు ఉండి బయోమెట్రిక్ ద్వారానే వేతన చెల్లింపులు చేపడుతున్నారు. జిల్లాలో దాదాపు 23 వేల మందికి పైగా స్మార్ట్‌కార్డులు లేని వారున్నారు. వేతనాల చెల్లింపు స్మార్ట్‌కార్డులు అందక కొంత ఆలస్యమవుతుంటే.. సిబ్బంది కొరతను సాకుగా చూపి మరికొంత జాప్యం చేస్తున్నారు. చెల్లింపులో జాప్యం లేదని అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 20 శాతం మంది కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆయా కూలీలకు స్మార్ట్ కార్డులు లేకపోవడమే. వీటి జారీకి చర్యలు చేపట్టాల్సిన సంబంధిత శాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలానికి సుమారు 300 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో స్మార్ట్ కార్డు అందక ఇబ్బందులు పడుతున్న కూలీలున్నారు.
విడుదల కాని బకాయిలు
జిల్లాలో నెల రోజుల్లో జరిగిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.2.5 కోట్ల మేర వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సాకుగా చూపి వేతన బకాయిల విడుదలలో తీవ్ర జాప్యమైంది. గత రెండు నెలల్లో రూ.19 కోట్ల విలువైన పనులు జరిగితే, గత నెల నిలిచిన వేతనాలకు సంబంధించి మొత్తం రూ.6.5కోట్లు కాగా, రూ.4 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి. మిగి లిన బకాయిలు రూ.2.5 కోట్లు ఇంకా విడుదల కాలేదు. విడుదలైన బకాయిలను ఇప్పటికి 25 వేల మంది కూలీలకు అందచేయగా, 12 వేల మందికి అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగతా బకాయిలు కోసం 11 వేల మంది కూలీలు ఎదురు చూస్తున్నారు.
‘ఉపాధి’ సరే... వేతనమేది?
Published Mon, Aug 4 2014 4:31 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement