ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్ అండ్ టేలర్ కంపెనీ లిక్విడేషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నిలిపేసింది. రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు మాత్రమేనని, లిక్విడేషన్ చేపడితే రుణ దాతలకేమీ రాదని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత, అధిక ధరలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఘానికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. కంపెనీలో మొత్తం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైసూర్‌లో ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు జేమ్స్‌బాండ్ పాత్రధారి పియర్స్ బ్రాస్నన్, అమితాబ్ బచ్చన్‌లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించారు.
ఎడెల్‌వీస్ వ్యాజ్యంతో ఎన్‌సీఎల్‌టీకి
కస్లివాల్ కుటుంబానికి చెందిన ఎస్ .కుమార్ గ్రూప్ రీడ్ అండ్ టేలర్ ఇండియా కంపెనీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఖరీదైన సూట్లు, జాకెట్లు, ట్రౌజర్లు, షర్ట్‌లు, టి–షర్ట్‌లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ బ్యాంక్‌లకు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.4,100 కోట్ల మేర బకాయిలు పడటంతో వీటి వసూళ్లకు గాను ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎడెల్‌వీజ్ ఏఆర్‌సీ ఎన్‌సీఎల్‌టీలో ఒక కేసు వేసింది. ఎనిమిది కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలను సమర్పించినప్పటికీ, అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో రుణదాతల కమిటీ లిక్విడేషన్‌కు సిఫార్సు చేసింది.
ఫైన్‌క్వెస్ట్‌కే అధిక భారం...
రీడ్ అండ్ టేలర్ కంపెనీ నుంచి ఫైన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీకి అధికంగా రూ.800 కోట్ల మేర రావలసి ఉంది. యూనియన్ బ్యాంక్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తదితర సంస్థలకు ఈ సంస్థ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment