ఏడాది ముందు చెల్లిస్తే 5 శాతం రాయితీ
మున్సిపాలిటీలకు అందిన ఉత్తర్వులు
పన్నుల వసూలు వేగవంతం చేసేందుకే ఈ నెల 30 లోపు చెల్లిస్తేనే వర్తింపు
నెల 1 నుంచి 2017 మార్చి 31 వరకు ఆస్తిపన్నుకే అమలు
పాత బాకీకి పెనాల్టీలు తప్పవు
గుడివాడ : మున్సిపాలిటీల్లో కొండలా పేరుకుపోయిన పన్ను బకాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు అర్ధ సంవత్సరాల ఆస్తి పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఒకేసారి వసూలు చేయటం కోసం ఇంటిపన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖ ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఏడాది ఆస్తి పన్నును ఈ నెల 30 లోపు చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని ఉత్తర్వులలో తెలిపారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల్లో ఆస్తిపన్ను వసూలు వేగవంతంగా ఉండాలనే నిర్ణయంతో ఈ రాయితీని ప్రకటించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతి ఏటా రెండు అర్ధ సంవత్సరాలలో రెండు విడతలుగా ఆస్తి పన్నులు చెల్లించేవారు.
ఒకేసారి చెల్లించటం వల్ల మున్సిపాలిటీలకు ఆదాయం పెరగటంతో పాటు ఎక్కువ శాతం వసూలయ్యే అవకాశముందని అధికారుల అంచనా. ఇప్పటికే పన్ను బకాయిలు ఉన్నవారు మాత్రం పాత బకాయిని తప్పనిసరిగా వడ్డీతోనే చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని ఒక్క గుడివాడ మున్సిపాలిటీలోనే ఏడాదికి రూ.6 కోట్ల పన్ను వసూళ్లు కావాల్సి ఉంది. వాటిలో ఎక్కువ మొత్తం ఈ రాయితీ ద్వారా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.