మంత్రుల పేషీలకు ఫోన్ కట్
రూ.కోటి వరకు బకాయిలు
మూడు రోజులుగా మూగబోయిన ఫోన్లు
బెంగళూరు: తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకునే వారు, అధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని నేతలు, ఇక పైరవీలు చేసే చోటామోటా నాయకులు వీరందరి ఎడతెరిపి లేని ఫోన్‌కాల్స్‌తో ఎప్పుడూ మారుమోగి పోయే మంత్రుల పేషీలు స్తబ్దుగా మారిపోయాయి. గత మూడు రోజులుగా విధానసౌధలోని మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్‌ఫోన్లేవీ పనిచేయడం లేదు. దీంతో తమ సమస్యలను నేరుగా మంత్రివర్యుల దృష్టికి తీసుకొద్దామని భావించే సామాన్యులకు ‘ఈ నంబర్ తాత్కాలికంగా పనిచేయడం లేదు’ అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల పేషీల్లో ఫోన్లు పనిచేయక పోవడానికి బీబీఎంపీ ఎన్నికలో లేదంటే తాంత్రిక పరమైన లోపమో కారణం కాదండోయ్! మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులు కట్టకపోవడమే ఇందుకు కారణం.
విధానసౌధలో ఉన్న మంత్రుల పేషీల్లోని ల్యాండ్ ఫోన్లకు సంబంధించిన బిల్లులు రూ.కోటి రూపాయలు దాటేశాయి. అయినా కూడా సంబంధిత అధికారులు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ మంత్రుల పేషీల ఫోన్ కనెక్షన్‌లను తాత్కాలికంగా తొలగించింది. దీంతో గత మూడురోజులుగా మంత్రుల పేషీల్లోని ఫోన్‌లన్నీ మూగబోయాయి. మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులే చెల్లించకపోతే ఇక సామాన్యుల సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం ఆసక్తి చూపుతారో అర్థమవుతోందని సామాన్యులు వాపోతున్నారు.