Phone bills
-
మొబైల్ ఫోన్ సర్వీసులు మరింత ప్రియం
న్యూఢిల్లీ: దేశంలో నానాటికి దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానంటూ మాటలను వల్లెవేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్నుల మీద పన్నులు విధిస్తూ ఈ ఏడాదిని పన్నుల సీజన్‌గా మార్చి వేశారు. ఇప్పటికే ఈ ఏడాది వివిధ రకాల సెస్‌లు, సర్‌చార్జీల పేరిట వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ప్రజలపై భారం విధిస్తూ వచ్చిన ఆర్థిక మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం ఆ కార్యక్రమం పేరిట 0.5 శాతం సెస్ విధించారు. ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండానే ప్రజలపై మరో వెయ్యి కోట్ల రూపాయల భారం మోపారు. వాస్తవానికి స్వచ్ఛభారత్ కోసం రెండు శాతం సెస్ విధించాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో చివరి నిమిషంలో ప్రతిపాదిత సెస్‌లో ఒకటిన్నర శాతం తగ్గించారు. అంటే సమీప భవిష్యత్‌లో అదను చూసుకొని ఆ మిగతా సెస్ శాతం భారాన్ని ప్రజలపైవేసే అవకాశం ఉంది. స్వచ్ఛభారత్ సెస్ వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు భారం కానున్నాయి. టెలిఫోన్ సర్వీసులపై ఇప్పటికే 14 శాతం సర్వీసు టాక్స్‌ను వసూలు చేస్తుండగా దానికి 0.5 శాతం ఈ కొత్త సెస్ యాడ్ అయింది. అంటే...ప్రతి వెయ్యి రూపాయల టెలిఫోన్ బిల్లుపై ఇప్పుడు ఐదు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ టాక్స్ వర్తించే అన్ని సేవలపై స్వచ్ఛ భారత్ సెస్‌ను వసూలు చేస్తారు. ప్రతి వంద రూపాయలకు 50 రూపాయల చొప్పున సెస్ పడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఏసీ సౌకర్యంగల మెస్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలు, లిక్కర్, బ్రేవరీస్‌ల నుంచి పంపిణీ జరిగే మద్యంపై ఈ సెస్ విధిస్తారు. ఖరీదైన భవనాలకు, వివిధ పనుల కాంట్రాక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. విమానయాన ట్రావెల్ ఏజెంట్లు, లాటరీ ఏజెంట్లు, లాటరీ డిస్ట్రిబ్యూటర్లు, జీవిత భీమా సంస్థలు అందించే సర్వీసులకు కూడా ఈ సెస్ వర్తిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మార్పిడిలో కూడా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగంపై కూడా ఆర్థిక భారం పడుతుంది. నవంబర్ 15వ తేదీకి ముందే ఇన్వాయిస్లు రూపొందించి సరకు సరఫరాకాని వారికి నవంబర్ 29 వరకు సెస్ మినహాయింపును ఇచ్చారు. ఆ తర్వాత సర్వీసు టాక్స్ పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపై సెస్ విధిస్తారు. 2006 నాటి సర్వీస్ టాక్స్ నిబంధనల ప్రకారమే సర్వీసు విలువను లెక్కేసే సెస్‌ను అంచనా వేస్తారు. ఈ సెస్ కింద వసూలయ్యే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు. -
మంత్రుల పేషీలకు ఫోన్ కట్
రూ.కోటి వరకు బకాయిలు మూడు రోజులుగా మూగబోయిన ఫోన్లు బెంగళూరు: తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకునే వారు, అధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని నేతలు, ఇక పైరవీలు చేసే చోటామోటా నాయకులు వీరందరి ఎడతెరిపి లేని ఫోన్‌కాల్స్‌తో ఎప్పుడూ మారుమోగి పోయే మంత్రుల పేషీలు స్తబ్దుగా మారిపోయాయి. గత మూడు రోజులుగా విధానసౌధలోని మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్‌ఫోన్లేవీ పనిచేయడం లేదు. దీంతో తమ సమస్యలను నేరుగా మంత్రివర్యుల దృష్టికి తీసుకొద్దామని భావించే సామాన్యులకు ‘ఈ నంబర్ తాత్కాలికంగా పనిచేయడం లేదు’ అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల పేషీల్లో ఫోన్లు పనిచేయక పోవడానికి బీబీఎంపీ ఎన్నికలో లేదంటే తాంత్రిక పరమైన లోపమో కారణం కాదండోయ్! మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులు కట్టకపోవడమే ఇందుకు కారణం. విధానసౌధలో ఉన్న మంత్రుల పేషీల్లోని ల్యాండ్ ఫోన్లకు సంబంధించిన బిల్లులు రూ.కోటి రూపాయలు దాటేశాయి. అయినా కూడా సంబంధిత అధికారులు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బీఎస్ఎన్ఎల్ సంస్థ మంత్రుల పేషీల ఫోన్ కనెక్షన్లను తాత్కాలికంగా తొలగించింది. దీంతో గత మూడురోజులుగా మంత్రుల పేషీల్లోని ఫోన్లన్నీ మూగబోయాయి. మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులే చెల్లించకపోతే ఇక సామాన్యుల సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం ఆసక్తి చూపుతారో అర్థమవుతోందని సామాన్యులు వాపోతున్నారు. -
అంతా ఆన్లైన్
ఖమ్మం అర్బన్ : ఏదైనా వస్తువు కొనాలంటే అనేక షాపులు తిరగాల్సిన పనిలేదు. మోడల్స్ నచ్చకపోతే నిస్తేజంగా ఇంటిముఖం పట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లోనే కూర్చు ని మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఏయే వస్తువు ఏయే మోడళ్లలో లభ్యమవుతున్నాయి.. ధర ఎంత.. నాణ్యతా ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు తెలుసుకుని ఒక్క క్లిక్ చేస్తే చాలు. మనకు కావాల్సిన వస్తువు ఇంటి ముందు వాలిపోతున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్‌పై నెటిజన్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ తదితర మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఖమ్మం నగరం, కొత్తగూడెం పట్టణానికి కూడా పాకింది. ఆన్లైన్లో అంగడి మనం షాపుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ముందుగా మనకు ఆ వస్తువు గురించి అన్ని వివరాలు తెలియాలి. వస్తువు మన్నిక, మోడల్, దానికి అంత ఖరీదు పెట్టొచ్చా... అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వస్తువు కొనుగోలు చేయడానికి ఇంటర్నెట్ ఎంతో సహాయపడుతోంది. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించిన వెబ్సైట్లలోకి వెళ్లి పరిశీలిస్తే మనకు కావాల్సిన వస్తువు వివరాలన్నీ దర్శనమిస్తాయి. ఏ వస్తువుకు ఏయే ఆఫర్లు ఉన్నాయనే విషయాలూ తెలుసుకోచ్చు. ఆ తర్వాత ఆర్డర్ చేసి డోర్ డెలివరీ పద్ధతిన ఇంటికి తెప్పించుకోవచ్చు. నేరుగా షాపింగ్ గతంలో ఫోన్ బిల్లులు, బస్ టికెట్లు తదితర విషయాల కోసమే ఎక్కువగా ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించే వారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో అమ్మకాలు చేసేందుకు మార్కెట్లోకి పలు కంపెనీలు దూసుకొచ్చాయి. అమెజాన్, స్నాప్‌డీల్ డాట్ కామ్, ఓఎల్ఎక్స్, ఫ్లిక్డాట్ కామ్ తదితర కంపెనీలు ఆన్లైన్లో వస్తువులను అమ్మకాలకు పెడుతున్నాయి. ప్రముఖ కంపెనీల నుంచి ఈ ఆన్లైన్ కంపెనీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నేరుగా వినియోగదారులకు అందించడంతో మార్కెట్ సాధారణ ధరకంటే తక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌పై మోజు క్రమేణా పెరుగుతోంది. వస్తువలు కొనడానికే కాకుండా విక్రయించేందుకు సైతం ‘ఓఎల్ఎక్స్’ వంటి ఆన్లైన్ కంపెనీలు ఉపయోగపడుతున్నాయి. ఇష్టమైన వారికి బహుమతులు ఈ ఆన్లైన్ విధానం ద్వారా తమకు ఇష్టమైన వ్యక్తులకు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్లి ఎవరికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నామో వారి పేరుపై గిఫ్ట్‌ను పంపించి సర్ప్రైజ్ చేయొచ్చు. ‘స్నాప్ డీల్ డాట్ కామ్’ ద్వారా ఇలాంటి అవకాశం ఉంది.