మొబైల్ ఫోన్ సర్వీసులు మరింత ప్రియం
న్యూఢిల్లీ: దేశంలో నానాటికి దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానంటూ మాటలను వల్లెవేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్నుల మీద పన్నులు విధిస్తూ ఈ ఏడాదిని పన్నుల సీజన్‌గా మార్చి వేశారు. ఇప్పటికే ఈ ఏడాది వివిధ రకాల సెస్‌లు, సర్‌చార్జీల పేరిట వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ప్రజలపై భారం విధిస్తూ వచ్చిన ఆర్థిక మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం ఆ కార్యక్రమం పేరిట 0.5 శాతం సెస్ విధించారు.
ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండానే ప్రజలపై మరో వెయ్యి కోట్ల రూపాయల భారం మోపారు. వాస్తవానికి స్వచ్ఛభారత్ కోసం రెండు శాతం సెస్ విధించాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో చివరి నిమిషంలో ప్రతిపాదిత సెస్‌లో ఒకటిన్నర శాతం తగ్గించారు. అంటే సమీప భవిష్యత్‌లో అదను చూసుకొని ఆ మిగతా సెస్ శాతం భారాన్ని ప్రజలపైవేసే అవకాశం ఉంది.
స్వచ్ఛభారత్ సెస్ వల్ల టెలిఫోన్ నుంచి రైలు ప్రయాణం వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు, మంచినీళ్ల నుంచి మద్యం వరకు, రెస్టారెంట్లలో టిఫిన్ నుంచి భోజనం వరకు భారం కానున్నాయి. టెలిఫోన్ సర్వీసులపై ఇప్పటికే 14 శాతం సర్వీసు టాక్స్‌ను వసూలు చేస్తుండగా దానికి 0.5 శాతం ఈ కొత్త సెస్ యాడ్ అయింది. అంటే...ప్రతి వెయ్యి రూపాయల టెలిఫోన్ బిల్లుపై ఇప్పుడు ఐదు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
సర్వీస్ టాక్స్ వర్తించే అన్ని సేవలపై స్వచ్ఛ భారత్ సెస్‌ను వసూలు చేస్తారు. ప్రతి వంద రూపాయలకు 50 రూపాయల చొప్పున సెస్ పడుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఏసీ సౌకర్యంగల మెస్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలు, లిక్కర్, బ్రేవరీస్‌ల నుంచి పంపిణీ జరిగే మద్యంపై ఈ సెస్ విధిస్తారు. ఖరీదైన భవనాలకు, వివిధ పనుల కాంట్రాక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. విమానయాన ట్రావెల్ ఏజెంట్లు, లాటరీ ఏజెంట్లు, లాటరీ డిస్ట్రిబ్యూటర్లు, జీవిత భీమా సంస్థలు అందించే సర్వీసులకు కూడా ఈ సెస్ వర్తిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మార్పిడిలో కూడా సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగంపై కూడా ఆర్థిక భారం పడుతుంది.
నవంబర్ 15వ తేదీకి ముందే ఇన్‌వాయిస్‌లు రూపొందించి సరకు సరఫరాకాని వారికి నవంబర్ 29 వరకు సెస్ మినహాయింపును ఇచ్చారు. ఆ తర్వాత సర్వీసు టాక్స్ పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపై సెస్ విధిస్తారు. 2006 నాటి సర్వీస్ టాక్స్ నిబంధనల ప్రకారమే సర్వీసు విలువను లెక్కేసే సెస్‌ను అంచనా వేస్తారు. ఈ సెస్ కింద వసూలయ్యే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు.