బ్యాంకులు బాగుపడితే వాటాల విక్రయం
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ
టోక్యో: మొండిబకాయిలతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కొంత మెరుగైన తర్వాత ప్రభుత్వం వాటిల్లో కొంత మేర వాటాలు విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునేలా రిజర్వ్ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు దక్కిన నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల సమస్యకు పరిష్కారమార్గం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకుల మూలధన అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే ఒక పథకం అమలవుతోందని, మరిన్ని నిధులు కావాల్సి వస్తే ఆ అంశమూ పరిశీలించగలమన్నారు.
‘అయితే, బ్యాంకుల పరిస్థితులు మెరుగుపడితే వాటిల్లో వాటాలను 52 శాతానికి తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించాము. ఈ రకంగా వచ్చే నిధులను బ్యాంకుల మూలధన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు’ అని సోమవారం జరిగిన సీఐఐ–కోటక్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. వసూలుకావాల్సిన మొండిబకాయిల్లో సింహభాగం మొత్తం .. కేవలం కొన్ని ఖాతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే పరిమాణం భారీగా ఉండటంతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.