సాక్షి, న్యూఢిల్లీ : మొండి బకాయిలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మెగా బూస్ట్‌ను అందించింది. అనూహ్యంగా వచ్చే రెండేళ్లలో బ్యాంకులకి రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీన్ని అత్యంత కీలకమైన నిర్ణయంగా జైట్లీ అభివర్ణించారు. కేంద్రం బ్యాంకుల్లోకి చొప్పించనున్న రూ.2.11 లక్షల కోట్లలో బ్యాంకు రీక్యాప్ బాండ్ల ద్వారా రూ.1.35 లక్షల కోట్లు, బడ్జెటరీ సపోర్టు, మార్కెట్ రుణాల నుంచి రూ.76వేల కోట్లు ఇవ్వనున్నట్టు ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకింగ్ సవరణలను ప్రభుత్వం చేపడుతుందని జైట్లీ తెలిపారు. 2008-14 కాలంలో బ్యాంకులు తీవ్ర మొండిబకాయిలతో ఉన్నాయన్నారు. ఒక్కసారి బ్యాంకులు బలపడిన తర్వాత, మార్కెట్‌లో స్టాక్ మెరుగుపడుతుందన్నారు.
తాజా డేటా ప్రకారం 39 లిస్టెడ్ బ్యాంకుల్లో రూ.8.35 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులున్నాయి. ఆస్తుల బాధతో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్న బ్యాంకులకు, ప్రభుత్వ ప్రకటన ఫుల్ జోష్‌ను ఇవ్వనుందని అధికారిక వర్గాలంటున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న మూలధనంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అతి పెద్దగా, బలంగా రూపొదిద్దుకోవడానికి సాయపడతాయని రాజీవ్ కుమార్ చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలు మరింత విస్తరిస్తాయన్నారు. జూన్ ముగింపు వరకు దేశీయ బ్యాంకులు రూ.9.5 లక్షల కోట్ల రుణాలు అందించాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ సంఖ్య 2018 మార్చి వరకు రూ.11.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనావేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment