
బాప్‌రే.. బకాయిలు!
రిమ్స్ క్యాంపస్: జిల్లా కేంద్రం.. లక్షకుపైగా జనాభా.. దీనికితోడు రోజూ జిల్లా నలుమూలల నుంచి వివిధ పనులపై పెద్ద సంఖ్యలో వచ్చే జనాలు.. వీరందరికీ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలక సంఘానిదే. అంతేకాకుండా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను. దాన్ని సక్రమం గా వసూలు చేయగలిగితేనే ఏదైనా చేయడానికి అవకాశముంటుంది. కానీ శ్రీకాకుళం మున్సిపాలిటీలో అదే జరగడం లేదు. ఆస్తి పన్ను వసూళ్లు, బకాయిలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. గత నెల 31 నాటికి రూ.7.73 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.4.26 కోట్లు పాత బకాయిలే. ఇంతకాలం బకాయిల వసూలుపై మున్సిపల్ అధికారులు ఇంతకాలం శ్రద్ధ చూపలేదు.
తగ్గనున్న నిధుల లభ్యత
ఇంతకు ముందు పరిస్థితి వేరు. ఆస్తి పన్ను వసూళ్లు పెద్దగా జరక్కపోయినా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేవారు. రాష్ట్ర విభజనతో ఆ అవకాశాలు సన్నగిల్లాయి. కొత్త రాష్ట్రం లో పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఉన్నందున స్థానిక సంస్థలకు ఇంతకు ముందులా నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదు. సొంత ఆదాయ వనరులతోనే అభివృద్ధి పనులు, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలైతే తప్ప మున్సిపాలిటీ అవసరాలు తీరవు.
బకాయిలు.. ప్రస్తుత డిమాండ్
మున్సిపాలిటీలో ఆస్తి పన్ను డిమాండ్, బకాయిల పరిస్థితి పరిశీలిస్తే.. ఈ అర్ధ సంవత్సర పన్ను డిమాం డ్ కలుపుకొని రూ.7.73 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. మున్సిపాలిటీలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. మొత్తం 23,190 భవనాలు ఉన్నాయి. వీటికి సంబంధించి పాత బకాయిలే రూ.4.47 కోట్లు ఉండగా రూ.20.40 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.4.26 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయల బకాయిలే రూ.2.43 కోట్లు పేరుకుపోయాయి. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పన్ను బకాయిల వసూళ్లకు మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాం
మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి లు ఉన్న మాట వాస్తవమే. వీటిని వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. ఒక రెవెన్యూ అధికారితో పాటు, ఇద్దరు ఆర్‌ఐలు, 8 మంది బిల్లు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా బకాయి ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. వీలైనంత త్వరగా బకాయిలు వసూలు చేస్తాం. చెల్లించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనుకాడం.
-సీహెచ్ బాపిరాజు, మున్సిపల్ క మిషనర్