సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలిలో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎంత అండగా నిలిచారో తెలీదు గానీ వెతికిన చోటల్లా అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు భూములకు సంబంధించి ఆయన హయాంలో సృష్టించిన ఫేక్ వన్‌బీ, అడంగల్ బయటపడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేసిన బాగోతాలు వెలుగు చూశాయి.
నకిలీ పట్టాలతో బ్యాంకు రుణాలు కాజేసిన వ్యవహారాలూ బయటకొచ్చాయి. భూరికార్డులను తారుమారు చేసి కబ్జా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టెక్కలి పంచాయతీలో నకిలీ బిల్లులతో ఆస్తి పన్నుల ఆదాయాన్ని కొల్లగొట్టిన బండారం బయటపడింది. ఇందులో టెక్కలి బిల్లు కలెక్టర్‌గా పనిచేసిన సీహెచ్ కైసును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినా మరో ఇద్దరు దీని వెనుక ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి రిటైరైనా అప్పటి నేతల అండతో అక్కడే తిష్టవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
సొంతంగా నోటీసులు..
టెక్కలిలో నకిలీ డిమాండ్ నోటీసులు సృష్టించారు. నకిలీ రశీదు పుస్తకాలు సొంతంగా తయారు చేయించారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారికి తొలుత ఆ నకిలీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పబ్లిక్‌కు ఆ విషయం తెలియక జారీ చేసిన డిమాండ్ నోటీసుకు తగ్గట్టుగా ఆస్తి పన్ను చెల్లింపులు చేశారు. ఇలా నకిలీలతో వసూలు చేసిన పన్నుల సొమ్మును వారు తమ జేబులోకి వేసుకున్నారు. అనుమానం రాకుండా కొంత మొత్తం మేర మాత్రం అధికారికంగా చూపించారు. ఇలా టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు రూ.16 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్ను సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా బిల్ కలెక్టర్ చేతివాటం చూపించారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి, రిటైరైన ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది.
టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు 9 వేల పై చిలుకు ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే 2018– 19 సంవత్స రం నుంచి సుమారు మూడేళ్లుగా వసూళ్లు చేసిన ఇంటి పన్ను సొమ్ములో కొంత భాగాన్ని పంచాయతీ ఖాతాకు మళ్లిస్తూ మిగిలిన సొమ్మును స్వాహా చేశారు. గత కొద్ది రోజుల కిందట ఈ బాగోతం బయట పడడంతో, ప్రస్తుత పంచాయతీ ఈఓ తన స్థాయి మేరకు విచారణ జరిపి, రూ.16.46లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగొచ్చు. దీంతో ఈఓ అజయ్‌బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇన్‌చార్జి డీఎల్ పీఓ ఎస్.హరిహరరావు వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. 2018–19లో రూ. 7,67,999, 2019–20లో రూ.4,22,416, 2020– 21లో రూ.4,55,787 స్వాహా చేశారు. ఈ మూడేళ్ల లో సుమారు రూ.16,46,202 మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా తేల్చారు. పూర్తి అవినీతి బయటపడాలంటే సమగ్ర విచారణ అవసరమని గుర్తించారు. ఆ మేరకు విచారణకు కూడా ఆదేశించారు.
బిల్ కలెక్టర్ సస్పెన్షన్..
పన్నుల వసూలులో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ రశీదులు జారీ చేయడం వంటి అంశాలు బయట పడటంతో పాటు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో బిల్ కలెక్టర్ సీహెచ్ కైసును జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా టెక్కలి వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment