Fake receipts
-
Tekkali: మరో నకిలీ బాగోతం: రశీదు అబద్ధం.. దోపిడీ నిజం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలిలో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎంత అండగా నిలిచారో తెలీదు గానీ వెతికిన చోటల్లా అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు భూములకు సంబంధించి ఆయన హయాంలో సృష్టించిన ఫేక్ వన్‌బీ, అడంగల్ బయటపడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేసిన బాగోతాలు వెలుగు చూశాయి. నకిలీ పట్టాలతో బ్యాంకు రుణాలు కాజేసిన వ్యవహారాలూ బయటకొచ్చాయి. భూరికార్డులను తారుమారు చేసి కబ్జా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టెక్కలి పంచాయతీలో నకిలీ బిల్లులతో ఆస్తి పన్నుల ఆదాయాన్ని కొల్లగొట్టిన బండారం బయటపడింది. ఇందులో టెక్కలి బిల్లు కలెక్టర్‌గా పనిచేసిన సీహెచ్ కైసును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినా మరో ఇద్దరు దీని వెనుక ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి రిటైరైనా అప్పటి నేతల అండతో అక్కడే తిష్టవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సొంతంగా నోటీసులు.. టెక్కలిలో నకిలీ డిమాండ్ నోటీసులు సృష్టించారు. నకిలీ రశీదు పుస్తకాలు సొంతంగా తయారు చేయించారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారికి తొలుత ఆ నకిలీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పబ్లిక్కు ఆ విషయం తెలియక జారీ చేసిన డిమాండ్ నోటీసుకు తగ్గట్టుగా ఆస్తి పన్ను చెల్లింపులు చేశారు. ఇలా నకిలీలతో వసూలు చేసిన పన్నుల సొమ్మును వారు తమ జేబులోకి వేసుకున్నారు. అనుమానం రాకుండా కొంత మొత్తం మేర మాత్రం అధికారికంగా చూపించారు. ఇలా టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు రూ.16 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్ను సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా బిల్ కలెక్టర్ చేతివాటం చూపించారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి, రిటైరైన ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు 9 వేల పై చిలుకు ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే 2018– 19 సంవత్స రం నుంచి సుమారు మూడేళ్లుగా వసూళ్లు చేసిన ఇంటి పన్ను సొమ్ములో కొంత భాగాన్ని పంచాయతీ ఖాతాకు మళ్లిస్తూ మిగిలిన సొమ్మును స్వాహా చేశారు. గత కొద్ది రోజుల కిందట ఈ బాగోతం బయట పడడంతో, ప్రస్తుత పంచాయతీ ఈఓ తన స్థాయి మేరకు విచారణ జరిపి, రూ.16.46లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగొచ్చు. దీంతో ఈఓ అజయ్‌బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇన్చార్జి డీఎల్ పీఓ ఎస్.హరిహరరావు వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. 2018–19లో రూ. 7,67,999, 2019–20లో రూ.4,22,416, 2020– 21లో రూ.4,55,787 స్వాహా చేశారు. ఈ మూడేళ్ల లో సుమారు రూ.16,46,202 మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా తేల్చారు. పూర్తి అవినీతి బయటపడాలంటే సమగ్ర విచారణ అవసరమని గుర్తించారు. ఆ మేరకు విచారణకు కూడా ఆదేశించారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. పన్నుల వసూలులో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ రశీదులు జారీ చేయడం వంటి అంశాలు బయట పడటంతో పాటు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో బిల్ కలెక్టర్ సీహెచ్ కైసును జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా టెక్కలి వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
ఇంటిదొంగలు
1970 తర్వాత భద్రాచలం వచ్చిన గిరిజనేతరులకు ఇక్కడి ఆస్తులపై ఎటువంటి హక్కులేదు. అయినప్పటికీ ఇంటి పన్నులు విధిస్తూ నకిలీ రశీదులు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 1/70 చట్టాన్ని అడ్డుపెట్టుకొని కొందరు దండుకుంటున్నట్లు తెలియవస్తోంది. గిరిజనేతరులకు యథేచ్ఛగా అనుమతులు, ఇంటిపన్నుల రశీదులు ఇస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. లక్షలు చేతులు మారుతున్న వైనంపై పంచాయతీ పాలకమండలి దృష్టి సారించింది. నకిలీ ఇంటిపన్నుల రశీదులు పదుల సంఖ్యలో బయటపడ్డాయి. దీనిపై పంచాయతీ పాలకవర్గం సీరియస్‌గా విచారణ నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. భద్రాచలం : ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో కొంతమంది అధికారులు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులు ఎటువంటి క్రయవిక్రయాలు జరపకూడదు. 1970 తరువాత ఇక్కడికి వచ్చిన గిరిజనేతరులకు భూములు, ఇతర ఆస్తులపై ఎటువంటి హక్కు లేదు. దీని అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు లక్షలు దండుకుంటున్నారు. నకిలీ ఇంటిపన్నులను విధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. పంచాయతీ ముద్ర, ఒరిజనల్స్‌ను పోలిన నకిలీ రశీదుల ఆధారంగా కొత్త ఇళ్లకు పన్నులు విధిస్తున్నారనే విషయం ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇంటి దొంగలెవరనేది తేల్చేందుకు పంచాయతీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటం పలు అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలం లో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న గిరిజనేతరులు కనీసం ఇంటిపన్ను తమ పేరుమీద ఉన్నా చాలని భావిస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ మీటర్ పొందాలన్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా భద్రాద్రి వాసిగా గుర్తింపు పొందాలన్నా...ఇంటిపన్ను ఉంటేనే సాధ్యమవుతుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన గిరిజనేతరులు అప్పోసప్పో చేసి, కొద్దిపాటి ఇంటిస్థలం కొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కానీ కొంతమంది బడాబాబులు యథేచ్ఛగా బహుళ అంతస్తుల మేడలు కడుతున్నారు. వీరందరికీ ప్రధానంగా కావాల్సింది ఇంటిపన్ను రశీదు. కానీ ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులకు ఇంటిపన్నులు విధించే పరిస్థితి లేదు. దీన్ని కొందరు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటిపన్ను విధించి రశీదు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయానికి వచ్చేవారి అవసరాన్ని గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అదనుగా నకిలీ రశీదులు కూడా అంటగడుతున్నారు. ఇలా సుమారు పదుల సంఖ్యలోనే నకిలీ ఇంటిపన్నులు వేసినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ అధికారులకు కూడా ఈ విషయం తెలియటంతో తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. పంచాయతీ ముద్ర వేసి, దర్జాగా ఇంటిపన్నులు వేస్తున్నవారెవురు..? వీరికి సిబ్బంది సహకారమేదైనా ఉందా..? లేకుంటే పంచాయతీ సిబ్బందే ఇలా చేస్తున్నారా..? అనే సవాలక్ష సందేహాల నడుమ నిజాన్ని ఎలా నిగ్గు తేల్చాలా అనే డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకిలా జరుగుతోంది.. 60 వేల జనాభా ఉన్న భద్రాచలంలో పంచాయతీ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం 7,490 ఇళ్లు ఉన్నాయి. వీటికి మాత్రమే పంచాయతీ ఇంటిపన్నులు విధించాలి. అనధికారిక లెక్కల ప్రకారం పదివేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. క్రమేపీ పట్టణం విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇళ్లు కట్టుకుంటున్నారు. అనుమతి కోసమని పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల ప్రకారం గిరిజనేతరులకు ఇంటి పన్నులు విధించే అవకాశం లేకపోయినా లక్షలు వసూలు చేసి నకిలీ ఇంటిపన్ను రశీదులను అంటగడుతున్నారు. ఇంటిదొంగలెవరు? భద్రాచలం పంచాయతీలో నకిలీ ఇంటిపన్నుల రశీదులు ఆరు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ నుంచి జారీ చేసిన ఒరిజనల్ రశీదు మాదిరే అవి ఉండటం గమనార్హం. పంచాయతీ స్టాంప్, సీరియల్ నంబర్‌తో సహా దానిపై ఇంటి నంబర్ కూడా వేసి ఇచ్చారు. బిల్ కలెక్టర్ , పంచాయతీ కార్యదర్శి అని ఉన్న చోట ఒక్కరే సంతకం చేసి రశీదులు ఇచ్చారు. ఇటువంటి రశీదులు చాలానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నకిలీ ఇంటిపన్ను రశీదుల వ్యవహారాన్ని పాలకమండలిలోని కొంతమంది సభ్యులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తేరుకున్న సదరు అధికారులు నకిలీ ఇంటిపన్ను రశీదులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంటి దొంగలెవరనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సిబ్బంది తీరుపై గుర్రుగా ఉన్న పాలకమండలి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పంచాయతీ సిబ్బందిపై పాలక మండలి సభ్యులు గుర్రుగా ఉన్నారు. తాజాగా నకిలీ ఇంటిపన్ను రశీదులు వెలుగులోకి రావటంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇటీవలనే పాలక మండలి సభ్యులంతా పీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల డివిజన్ పంచాయతీ అధికారిణి ఆశాలత విచారణ కూడా చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ ఇంటి పన్నుల రశీదుల వ్యవహారంతో పంచాయతీలో అవకతవకులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతోంది. నా దృష్టికి వచ్చింది: శ్రీమన్నారాయణ, ఈవో ఇంటిపన్నుల రశీదులు నకిలీవి ఇస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే వీటిని పంచాయతీ సిబ్బంది ఇచ్చారా..? లేక మరెవరైనా పంపిణీ చేస్తున్నారా? అనే దానిపై విచారణ చేస్తున్నాం. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం.