ఇంటిదొంగలు | fake receipts in bhadradri panchayat | Sakshi
Sakshi News home page

ఇంటిదొంగలు

Published Wed, Nov 12 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

fake receipts in bhadradri panchayat

1970 తర్వాత భద్రాచలం వచ్చిన గిరిజనేతరులకు ఇక్కడి ఆస్తులపై ఎటువంటి హక్కులేదు.
 అయినప్పటికీ ఇంటి పన్నులు విధిస్తూ నకిలీ రశీదులు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
1/70 చట్టాన్ని అడ్డుపెట్టుకొని కొందరు దండుకుంటున్నట్లు తెలియవస్తోంది.
 గిరిజనేతరులకు యథేచ్ఛగా అనుమతులు, ఇంటిపన్నుల రశీదులు ఇస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
 లక్షలు చేతులు మారుతున్న వైనంపై పంచాయతీ పాలకమండలి దృష్టి సారించింది.
 నకిలీ ఇంటిపన్నుల రశీదులు పదుల సంఖ్యలో బయటపడ్డాయి. దీనిపై పంచాయతీ పాలకవర్గం సీరియస్‌గా విచారణ నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది.


 భద్రాచలం : ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో కొంతమంది అధికారులు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులు ఎటువంటి క్రయవిక్రయాలు జరపకూడదు. 1970 తరువాత ఇక్కడికి వచ్చిన గిరిజనేతరులకు భూములు, ఇతర ఆస్తులపై ఎటువంటి హక్కు లేదు. దీని అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు లక్షలు దండుకుంటున్నారు.

నకిలీ ఇంటిపన్నులను విధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. పంచాయతీ ముద్ర, ఒరిజనల్స్‌ను పోలిన నకిలీ రశీదుల ఆధారంగా కొత్త ఇళ్లకు పన్నులు విధిస్తున్నారనే విషయం ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇంటి దొంగలెవరనేది తేల్చేందుకు పంచాయతీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటం పలు అనుమానాలకు తావిస్తోంది.

 భద్రాచలం లో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న గిరిజనేతరులు కనీసం ఇంటిపన్ను తమ పేరుమీద ఉన్నా చాలని భావిస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ మీటర్ పొందాలన్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా భద్రాద్రి వాసిగా గుర్తింపు పొందాలన్నా...ఇంటిపన్ను ఉంటేనే సాధ్యమవుతుంది.  వేర్వేరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన గిరిజనేతరులు అప్పోసప్పో చేసి, కొద్దిపాటి ఇంటిస్థలం కొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

 కానీ కొంతమంది బడాబాబులు యథేచ్ఛగా బహుళ అంతస్తుల మేడలు కడుతున్నారు. వీరందరికీ ప్రధానంగా కావాల్సింది ఇంటిపన్ను రశీదు. కానీ ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనేతరులకు ఇంటిపన్నులు విధించే పరిస్థితి లేదు. దీన్ని కొందరు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటిపన్ను విధించి రశీదు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయానికి వచ్చేవారి అవసరాన్ని గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అదనుగా నకిలీ రశీదులు కూడా అంటగడుతున్నారు. ఇలా సుమారు పదుల సంఖ్యలోనే నకిలీ ఇంటిపన్నులు వేసినట్లుగా తెలుస్తోంది.

 పంచాయతీ అధికారులకు కూడా ఈ విషయం తెలియటంతో తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. పంచాయతీ ముద్ర వేసి, దర్జాగా ఇంటిపన్నులు వేస్తున్నవారెవురు..? వీరికి సిబ్బంది సహకారమేదైనా ఉందా..? లేకుంటే పంచాయతీ సిబ్బందే ఇలా చేస్తున్నారా..? అనే సవాలక్ష సందేహాల నడుమ నిజాన్ని ఎలా నిగ్గు తేల్చాలా అనే డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు

 ఎందుకిలా జరుగుతోంది..
 60 వేల జనాభా ఉన్న భద్రాచలంలో పంచాయతీ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం 7,490 ఇళ్లు ఉన్నాయి. వీటికి మాత్రమే పంచాయతీ ఇంటిపన్నులు విధించాలి. అనధికారిక లెక్కల ప్రకారం పదివేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. క్రమేపీ పట్టణం విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇళ్లు కట్టుకుంటున్నారు. అనుమతి కోసమని పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల ప్రకారం గిరిజనేతరులకు ఇంటి పన్నులు విధించే అవకాశం లేకపోయినా లక్షలు వసూలు చేసి నకిలీ ఇంటిపన్ను రశీదులను అంటగడుతున్నారు.

 ఇంటిదొంగలెవరు?
 భద్రాచలం పంచాయతీలో నకిలీ ఇంటిపన్నుల రశీదులు ఆరు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ నుంచి జారీ చేసిన ఒరిజనల్ రశీదు మాదిరే అవి ఉండటం గమనార్హం. పంచాయతీ స్టాంప్, సీరియల్ నంబర్‌తో సహా దానిపై ఇంటి నంబర్ కూడా వేసి ఇచ్చారు. బిల్ కలెక్టర్ , పంచాయతీ కార్యదర్శి అని ఉన్న చోట ఒక్కరే సంతకం చేసి రశీదులు ఇచ్చారు.

ఇటువంటి రశీదులు చాలానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నకిలీ ఇంటిపన్ను రశీదుల వ్యవహారాన్ని పాలకమండలిలోని కొంతమంది సభ్యులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తేరుకున్న సదరు అధికారులు నకిలీ ఇంటిపన్ను రశీదులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంటి దొంగలెవరనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 సిబ్బంది తీరుపై గుర్రుగా ఉన్న పాలకమండలి
 ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పంచాయతీ సిబ్బందిపై పాలక మండలి సభ్యులు గుర్రుగా ఉన్నారు. తాజాగా నకిలీ ఇంటిపన్ను రశీదులు వెలుగులోకి రావటంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇటీవలనే పాలక మండలి సభ్యులంతా పీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల డివిజన్ పంచాయతీ అధికారిణి ఆశాలత విచారణ కూడా చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ ఇంటి పన్నుల రశీదుల వ్యవహారంతో పంచాయతీలో అవకతవకులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతోంది.
 
 నా దృష్టికి వచ్చింది:  శ్రీమన్నారాయణ, ఈవో
 ఇంటిపన్నుల రశీదులు నకిలీవి ఇస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే వీటిని పంచాయతీ సిబ్బంది ఇచ్చారా..? లేక మరెవరైనా పంపిణీ చేస్తున్నారా? అనే దానిపై విచారణ చేస్తున్నాం. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement