78% తగ్గిన ఎస్‌బీఐ నికర లాభం | SBI's net profit falls 78% | Sakshi
Sakshi News home page

78% తగ్గిన ఎస్‌బీఐ నికర లాభం

Published Sat, Aug 13 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

78% తగ్గిన ఎస్‌బీఐ నికర లాభం

78% తగ్గిన ఎస్‌బీఐ నికర లాభం

రూ.4,714 కోట్ల నుంచి రూ.1,046 కోట్లకు క్షీణత
రెండు రెట్లు పెరిగిన ‘మొండి’ కేటాయింపులు
ఫలితాల అనంతరం దూసుకుపోయిన షేర్
7 శాతం లాభంతో రూ.243 వద్ద ముగింపు


ముంబాయి: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని వణికిస్తున్న మొండి బకాయిల సమస్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మరీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ బ్యాంక్‌కు భారీగా మొండి బకాయిలుంటాయని మార్కెట్ వర్గాలు అంచనాలు వేయగా... వాటికన్నా తక్కువే నమోదయ్యాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపైనప్పటికీ, అంచనాల కంటే తక్కువగానే మొండి బకాయిలు నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి 78 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.4,714 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,046 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలకు కేటాయింపులు రెండు రెట్లు పెంచటంతో ఈ స్థాయిలో నికర లాభం క్షీణించిందని ఎస్‌బీఐ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.63,165 కోట్ల నుంచి రూ.69,415 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు.


మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,359 కోట్ల నుంచి రూ.6,340 కోట్లకు పెరిగాయని, మొత్తం కేటాయింపులు రూ.5,510 కోట్ల నుంచి 55 శాతం పెరిగి రూ.8,533 కోట్లకు చేరాయని తెలియజేశారు. స్థూల మొండి బకాయిలు 4.29 శాతం (రూ.56,421 కోట్లు ) నుంచి 6.49 శాతానికి(రూ.1,01,541 కోట్లు). నికర మొండి బకాయిలు 2.24 శాతం(రూ.28,669 కోట్లు) నుంచి 4.05(రూ.57,421 కోట్లు) శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 2.99 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గాయి. డిపాజిట్లు రూ.16,13,545 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.17,82,371 కోట్లకు, రుణాలు రూ.13,13,735 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.14,63,690 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి లక్ష్యమని అరుంధతి చెప్పారు. రెండు మూడేళ్లలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామన్నారు. ఇక స్టాండెలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.3,692 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.2,521 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.44,731 కోట్ల నుంచి రూ.48,929కోట్లకు ఎగసింది.

 
ముగిసిన అధ్వాన పరిస్థితులు..

మొండి బకాయిలుకు సంబంధించి అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అరుంధతి చెప్పారు. అయితే రికవరీ మందగమనంగా ఉందన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంక్‌లు విలీనం కానున్న నేపథ్యంలో ఈ అనుబంధ బ్యాంక్‌లు మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరిపాయని వివరించారు. గత క్వార్టర్‌లో పెరిగినట్లుగా మొండి బకాయిలు భవిష్యత్తు క్వార్టర్లో పెరిగే అవకాశాల్లేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

 

కళక ళలాడిన ఎస్‌బీఐ షేర్..
మొండి బకాయిలు అంచనాల కంటే తక్కువగా ఉండడం,  భవిష్యత్ అంచనాలు మార్కెట్ అంచనాలకనుగుణంగానే ఉండడంతో ఎస్‌బీఐ షేర్ ఫలితాలనంతరం దూసుకుపోయింది. ఇంట్రాడేలో 9 శాతం లాభంతో రూ.247.7కు చేరిన  ఈ షేర్ చివరకు 7.1 శాతం లాభఃతో రూ.243 వద్ద ముగిసింది. చాలా ఏళ్ల తర్వాత ఒక్క రోజులో ఎస్‌బీఐ ఈ స్థాయిలో కళకళలాడడం ఇదే మొదటిసారి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోలిస్తే మొండి బకాయిల విషయంలో ఎస్‌బీఐ మంచి పనితీరు కనబరిచిందని విశ్లేషణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement