దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది.
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఏడాది సెప్టెం బర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 25 శాతం దూసుకెళ్లి రూ.3,879 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,100 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 12 శాతం వృద్ధితో రూ.41,833 కోట్ల నుంచి రూ.46,854 కోట్లకు ఎగబాకింది. ముఖ్యంగా మొండిబకాయిలపై కేటాయింపులు(ప్రొవిజనింగ్) తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ ఆదా యం, ఇతర ఆదాయాలు పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేశాయి. మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో ఎస్‌బీఐ సగటున రూ.3,580 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు.
కన్సాలిడేటెడ్‌గా ఇలా...
అనుబంధ సంస్థలన్నింటితో కలిపి(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఎస్‌బీఐ క్యూ2లో రూ.4,992 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,024 కోట్లతో పోలిస్తే 25% ఎగసింది. మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ. 61,099 కోట్ల నుంచి రూ.66,586 కోట్లకు చేరింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 3.86 శాతం లాభపడి రూ.243 వద్ద స్థిరపడింది.