
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,840 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ బ్యాంక్ కేవలం రూ.21 కోట్ల నికర లాభాన్నే సాధించి ంది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయం కారణంగా ఇతర ఆదాయం భారీగా పెరగడం, నిర్వహణ లాభం కూడా పెరగడం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో పాటు రూ.720 కోట్ల ట్యాక్స్ రైట్‌బ్యాక్ కారణంగా నికర లాభం ఈ స్థాయిలో ఉందని ఎస్‌బీఐ తెలిపింది.
ఇక స్టాండ్ అలోన్ పరంగా చూస్తే నికర లాభం తగ్గిందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. గత క్యూ2లో రూ.2,538 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 38 శాతం క్షీణించి రూ.1,582 కోట్లకు తగ్గిందని వివరించారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన స్టాండోలోన్ నికర లాభం 21 శాతం క్షీణించిందని తెలిపారు. మొండి బకాయిలకు భారీ కేటాయింపులు కారణంగా నికర లాభం తగ్గిందని పేర్కొన్నారు.
నిర్వహణ లాభం 30 శాతం అప్...
గత క్యూ2లో రూ.50,743 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం(స్టాండోలోన్) ఈ క్యూ2లో రూ.65,430 కోట్లకు ఎగసిందని రజనీష్ తెలిపారు. మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ.72,918 కోట్ల నుంచి రూ.74,949 కోట్లకు పెరిగిందని వివరించారు.
ఇతర ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.10,580 కోట్లకు, నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.14,563 కోట్లకు ఎగసిందని, నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.18,586 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.789 కోట్ల పన్ను వ్యయాలు ఉండగా, ఈ క్యూ2లో రూ.720 కోట్ల ట్యాక్స్ రైట్‌బ్యాక్ ఉందని వివరించారు. ఎస్‌బీఐ లైఫ్ వాటా విక్రయం వల్ల రూ.5,436 కోట్లు వచ్చాయని వివరించారు.
మెరుగుపడిన రుణ నాణ్యత..
గత క్యూ2లో రూ.1,05,783 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1,86,115 కోట్లకు పెరిగాయని రజనీష్ కుమార్ పేర్కొన్నారు. అలాగే నికర మొండి బకాయిలు రూ.60,013 కోట్ల నుంచి రూ.97,896 కోట్లకు పెరిగాయని వివరించారు.
శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 7.14 శాతం నుంచి 9.83 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 4.19 శాతం నుంచి 5.43 శాతానికి పెరిగాయని వెల్లడించారు. అయితే సీక్వెన్షియల్ పరంగా చూస్తే మొండి బకాయిలు తగ్గాయని, రుణ నాణ్యత మెరుగుపడిందని రజనీష్ వివరించారు. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 9.97 శాతంగా ఉండగా, ఈ క్యూ2లో 9.83 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 5.97 శాతం నుంచి 5.43 శాతానికి తగ్గాయి.
‘మొండి’ కేటాయింపులు రెట్టింపు...
మొండి బకాయిలకు కేటాయింపులు రెట్టింపయ్యాయని రజనీష్ కుమార్ చెప్పారు. గత క్యూ2లో రూ.7,670 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో 16,715 కోట్లకు ఎగిశాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 38 శాతం, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 118 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు.
మొండి బకాయిలతో పాటు ఇతర అంశాలను కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు142 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే 114 శాతం) వృద్ధితో రూ.19,137 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఈ క్యూ2లో రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, రుణాలు 1 శాతం వృద్ధితో రూ.18.92 లక్షల కోట్లకు, డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ.26.23 లక్షల కోట్లకు ఎగిశాయని వివరించారు.
ఎస్‌బీఐ షేర్ 6 శాతం అప్
కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా పెరగడం, సీక్వెన్షియల్‌గా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్‌ఈలో శుక్రవారం ఎస్‌బీఐ షేర్ జోరుగా పెరిగింది. 6.2 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.231గా, గరిష్ట స్థాయి రూ.352గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment