
మింగుడు పడని ముద్ద
మధ్యాహ్న భోజనం బకాయిల చెల్లింపుల్లో జాప్యం
ధరల పెరుగులతో భారంగా మారిన నిర్వహణ
విద్యార్థులకు అందని పౌష్టికాహారం
కష్టాల్లో నిర్వాహకులు
ప్రతి ఒక్కరికి విద్య అందాలనే లక్ష్యంతో.. చదువు విద్యార్థికి భారం కాకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఓ వైపు విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూనే, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా అక్షరాస్యత శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన. క్రమంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వ ల్ల ఈ పథకం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. దీనికి ధరల పెరుగుదల తోడై భోజనం పెట్టేవారికి.. తినే వారికి ముద్ద మింగుడుపడ్డం లేదు.
- విశాఖ ఎడ్యుకేషన్
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మహిళా సంఘాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరికి ఈ పథకం నిర్వహణ ద్వారా వచ్చే వెయ్యి రూపాయిల భృతి కోసం.. కుటుంబానికి ఓ ఆధారం, భరోసా దొరుకుతుందని వీటి నిర్వహణబాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించడంతో మొద ట్లో భాగానే నడిచింది. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలల కొద్ది బకాయిలు చెల్లించకుండా ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ నిర్వహకులపై తీవ్ర భారం మోపింది. అయితే పిల్లలకు భోజనం ఆగిపోకూడదనే ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో కిరాణా షాపుల వద్ద అరువు పెట్టి సరుకులు తీసుకొచ్చి ఒడ్డించి పెడుతున్నారు. కిరాణా సరుకులకు లక్షలు అయ్యే సమయంలో ఎవరివద్దనైనా అప్పు చేసి వారికి చెల్లించడం చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగానే జరుగుతుండటంతో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది.
10 నెలలుగా బకాయిలు..: గత 10 నెలల నుంచి మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన జీతాలు, సరుకుల బకాయిలు ప్రభుత్వం నిర్వాహకులకు అందించలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల జీతాలు వెయ్యి రూపాయిల చొప్పున మొత్తం రూ.4 కోట్లు, సరుకులకుగాను రూ.9 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని నాయకులు చెప్పిన మాట వాస్తవ రూపంలోకి మాత్రం రాలేదు. నిర్వాహకుల వేతనం ఇప్పటికే విడుదలైనప్పటికీ.. ఆ మొత్తం అందించడంలో కూడా అధికారులు జాప్యం చేస్తున్నారు.పెరిగిన ధరలతో అదనపు భారం..: మధ్యాహ్న భోజన పథక నిర్వహణలో భాగంగా 1 నుంచి 5 వ తరగతి విద్యార్థికి రూ.4.65, 6 నుంచి 10 విద్యార్థులకు రూ 6.10 చెల్లిస్తూ వస్తోంది.
దీంతో 5వ తరగతి వరకు విద్యార్థులకు 50 గ్రాముల బియ్యం, 10వ తరగతి వరకు విద్యార్ధులకు 100 గ్రాముల బియ్యం అందిస్తోంది. ప్రతి వారం మెనూలో అన్నంతో పాటు సాంబారు, పప్పు, కూరలు, వారానికి రెండు రోజులు గుడ్లు విద్యార్థులకు అందించాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో ఒక్కో గుడ్డు ఖరీదు రూ. 4.50. అలాగే కందిపప్పు ఖరీదు రూ. 60 నుంచి రూ. 130కు చేరింది. కూరగాయ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా మెనూ ప్రకారం పథకం నిర్వహించాలంటే తడిపిమోపుడవుతోంది. అదనంగా అరటిపండ్లు కూడా అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోవిద్యార్థిపై ఇది అదనపు ఖర్చు. ఏడాదికి ఆ ఏడాది ఖర్చులు పెరిగిపోతుంటే.. బడ్జెట్‌లో విద్య కోసం వెచ్చించే నిధులు మాత్రం తగ్గించుకుంటూ పోతోంది. గత ఏడాది రూ.13 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించింది.