బకాయిలు రూ.49 కోట్లు!
♦ జిల్లాలో నిలిచిన ‘ఆరోగ్యశ్రీ’ సేవలు
♦ ఏడాది కాలంగా ఆస్పత్రులకు అందని బిల్లులు
♦ వైద్యం నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆస్పత్రులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేదోడికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి గ్రహణం పట్టింది. ఏడాది కాలంగా ప్రభుత్వం ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కుప్పలుతెప్పలుగా బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రులు స్పష్టం చేశాయి. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్‌లోని ఆస్పత్రులు మినహా మిగతా అన్నిచోట్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆందోళనతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 450కిపైగా కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి.
అయితే వీటిలో 65 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోజుకు సగటున 150 మంది పేదలు సేవలు పొందుతున్నట్లు అంచనా. ఇవేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ పథకం కింద అదనంగా కొన్ని జబ్బులను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో రోగుల సంఖ్య సైతం పెరిగింది. అయితే సేవలందించిన ఆస్పత్రులకు నెలవారీగా బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. దాదాపు ఏడాది కాలంగా బిల్లుల చెల్లింపులు నిలిచినట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈక్రమంలో జిల్లాకు చెందిన ఆస్పత్రులకు గాను రూ.49కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
అయోమయం.. ఆగమ్యగోచరం
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రులకు వస్తున్న వారికి చేదుఅనుభవం ఎదురవుతోంది. ఆస్పత్రులు చికిత్సలను నిలిపివేయడంతో రోగులు అయోమయంలో పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రోగుల ప్రాణాలమీదకు వస్తోంది. అటు ఉచిత చికిత్స పొందక.. ఇటు ప్రైవేటు ఆస్పతుల్లో చికిత్స చేయించుకోలేక పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే బకాయిలు చెల్లించేవరకు సేవలందించలేమని పలు ఆస్పత్రులు తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పరిస్థితి ఆందోళనకర ంగా మారనుంది.