బిల్లులు బంద్
రూ. 13,000కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారు చెల్లించాల్సిన మొత్తం
♦ అదనంగా ఆరోగ్యశ్రీ, ‘ఫీజు’, ఇన్‌పుట్ సబ్సిడీల కింద మరో రూ.3 వేల కోట్ల బకాయిలు
♦ పెద్ద నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ
♦ చెల్లింపుల కోసం భారీగా అప్పుల సమీకరణ కోసం ప్రభుత్వ కసరత్తు.. నేడు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.1,500 కోట్ల సేకరణ
సాక్షి, హైదరాబాద్
గతేడాదితో పోలిస్తే ఆదాయ వృద్ధి పెరిగినా... నోట్ల రద్దు పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అన్ని శాఖల పరిధిలో గత మూడు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టింది. దీంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న పనులు, కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మొత్తంగా వివిధ శాఖలకు చెల్లించాల్సిన రూ.4,000 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయినట్లు అంచనా. ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న నీటి పారుదల విభాగంలో మూడు నెలలుగా రూ.3,000 కోట్ల బిల్లులు ఆగిపోయి.. సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకలా మారాయి. దీంతో పాటు ఆర్ అండ్ బీ, మిషన్ కాకతీయ, విద్యుత్ విభాగంలో చెల్లించే బిల్లులను సైతం ఆర్థిక శాఖ ఆపేసింది. అవన్నీ కలిపి మరో రూ.1,000 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు అంచనా.
ఆచితూచి వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ
నోట్ల రద్దుతో గత రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.800 కోట్ల మేర గండి పడింది. ఇలా రాబడి తగ్గడం, ఆర్థిక సంవత్సరం ముగిసే చివరి త్రైమాసికం కావడంతో ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపులపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో అన్ని శాఖల పరిధిలో పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు సైతం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దాదాపు రూ.2,000 కోట్లు బకాయిలున్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.420 కోట్లు చెల్లించాల్సి ఉంది. అసలు తక్షణ ప్రాధాన్యమైన ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు సర్దుబాటు చేసేందుకే గత నెలలో ఆర్థిక శాఖ ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో తక్షణావసరాల దృష్ట్యా తగినంత రుణ సేకరణ కోసం కసరత్తు చేస్తోంది. మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా సరిపడేంత రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో మంగళవారం జరిగే సెక్యూరిటీల వేలం ద్వారా రూ.1,500 కోట్ల మేరకు రుణం తీసుకోనుంది.
ఉదయ్‌తో మరింత అప్పు
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో చేరడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.9,000 కోట్లకు పైగా బాండ్ల ద్వారా సమకూర్చుకోవడం తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ‘ఉదయ్’పథకం నిబంధనల మేరకు డిస్కంలకు ఉన్న అప్పుల్లో 75 శాతాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం డిస్కంల అప్పుల్లో రూ.8,923 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి, అది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపే వాటిని తీర్చాల్సి ఉంది. అంతమేరకు బాండ్ల వేలం ద్వారా నిధుల సేకరణ తప్పనిసరి. అందుకే జనవరి చివరి వారంతో పాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరోమారు ఆర్‌బీఐ ద్వారా బాండ్లు వేలం వేసి భారీ మొత్తంలో రుణం స్వీకరించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇక గత నవంబర్ చివరి నాటికే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో బాండ్ల వేలం ద్వారా రూ.9,900 కోట్లు సమీకరించింది. మంగళవారం నాటి సెక్యూరిటీల వేలంలో మరో రూ.1,500 కోట్లు స్వీకరించనుండడంతో ఈ అప్పు రూ.11,400 కోట్లకు చేరుతోంది.
గృహ రుణాల తకరారు..!
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త హామీలు మరింత భారం కానున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు వివిధ పథకాల్లో పక్కా ఇళ్లను పొందిన లబ్ధిదారులు చెల్లించాల్సిన గృహ రుణాలను మాఫీ చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దాదాపు రూ.3,200 కోట్లు మాఫీ చేస్తామని, నెల రోజుల్లో బ్యాంకుల్లో పెట్టిన పట్టాలను ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఈ రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుందా.., ఎన్ని విడతల్లో చెల్లిస్తుందనే దానిపై గృహ నిర్మాణ విభాగం ఇంకా కసరత్తు చేయలేదు. ఆ శాఖ నుంచి ఎలాంటి సమాచారం తమకు అందలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.