జిల్లాలో మద్యం కొరత మళ్లీ మొదలైంది. వేల కేసుల మద్యం నిల్వలు రోజుల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి.
జిల్లాలో మద్యం కొరత
మూతపడిన డిపోలు
వ్యాపారుల వద్ద తగ్గిన నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు
మరో రెండు రోజులకు సరిపడా మాత్రమే స్టాక్
సమీక్షిస్తున్న అధికారులు
విజయవాడ : జిల్లాలో మద్యం కొరత మళ్లీ మొదలైంది. వేల కేసుల మద్యం నిల్వలు రోజుల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి. జిల్లాలో నిత్యం సుమారు ఎనిమిదివేల కేసులకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు మద్యం సరఫరా జరిగే రెండు డిపోలకు తాళాలు పడటంతో ఉన్న కొద్దిపాటి నిల్వలను ఎక్కువ ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. రెండు రోజులుగా ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా రూ.20 ధరను అధికంగా చేర్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. అయితే, ఇది ప్రభుత్వం వైఫల్యం వల్ల ఏర్పడిన కొరత కావటంతో వ్యాపారులు దీనిని సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉన్న నిల్వలు సోమవారం నాటికి పూర్తిస్థాయిలో అయిపోయే అవకాశం ఉంది.
కోర్టు ఉత్తర్వులతో క్లోజ్
జిల్లాలో నెలకు సగటున వందకోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. వీటిలో నెలకు సుమారు 2.3 లక్షల కేసుల మద్యం, ఆరు లక్షల కేసుల బీరు విక్రయాలు జరుగుతాయి. రోజుకు ఏడు వేల కేసుల మద్యం, నాలుగు వేల కేసుల బీరు విక్రయిస్తారు. ప్రస్తుతం డిపోలు మూతపడటంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవటంతో అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనెల 3 నుంచి జిల్లాలో మద్యం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడ డివిజన్‌కు గొల్లపూడి మద్యం డిపో నుంచి, మచిలీపట్నం డివిజన్‌కు గుడివాడ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఈ క్రమంలో రెండు డిపోలు ఆదాయపన్నుల శాఖకు దాదాపు పదేళ్లుగా పన్ను చెల్లించకుండా మొండిబకాయిదారులుగా మిగిలిపోయాయి. 2013 వరకు రెండు డిపోలు కలిపి రూ.77 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆదాయ పన్నుల శాఖ నోటీసులకు డిపోలు స్పందించకపోవటంతో కోర్టులో కేసులు దాఖలు చేయగా, బకాయిలు చెల్లించే వరకు లావాదేవీలు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేసిన క్రమంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించారు. అయితే, సాంకేతిక కారణాలతో ఉత్తర్వులు రాకపోవటంతో డిపోలు ఇంకా మూతపడే ఉన్నాయి. డిపోల్లో ప్రస్తుతం సుమారు 70 వేల కేసుల మద్యం నిల్వలు ఉన్నాయి. వ్యాపారులంతా ఈనెల మద్యం కోటాను గతనెల 21 నుంచే కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. దీంతో కొరత రాకుండా ఉన్న నిల్వలతోనే ఐదు రోజులుగా వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లాలో వ్యాపారుల వద్ద ఇంకా 30వేల కేసుల మద్యం నిల్వలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారుల అంచనా. దీంతో ఈ నిల్వలు సోమవారం వరకే సరిపోతాయి. ఈలోపు కోర్టు ఉత్తర్వులు అంది డిపోలు తెరుచుకుంటే ఇబ్బందులు ఉండవు. లేనిపక్షంలో కొన్ని వైన్‌షాపులు తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే కొందరు సిండికేట్ వ్యాపారులు దీనిని సాకుగా చూపి పుల్ బాటిల్ ధరపై అదనంగా 50 నుంచి 100 వరకు వసూలు చేస్తున్నారు. నందిగామ, నూజివీడు ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.
అధికారుల సమీక్ష
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ జి.జోసఫ్ జిల్లాలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిపోల్లోని అధికారులతో మాట్లాడటం, జిల్లాలో ఎక్కడ ఎమ్మార్పీ ఉల్లంఘన లేకుండా ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షించటం చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ బాబు.ఎ కూడా శనివారం జిల్లాలో మద్యం నిల్వల పరిస్థితిపై ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఉన్న నిల్వలన్నీ పూర్తిస్థాయిలో విక్రయించే పనిలో వ్యాపారులు నిమగ్నమయ్యారు. దీంతో సోమవారం నుంచి మద్యం కొరత కనిపించే అవకాశం ఉంది.