మైండ్ బ్లాంక్ | ghmc aggressive property tax collection | Sakshi
Sakshi News home page

మైండ్ బ్లాంక్

Published Sat, Jan 31 2015 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

మైండ్ బ్లాంక్ - Sakshi

మైండ్ బ్లాంక్

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ దూకుడు
బ్లాంక్‌చెక్‌లు ఇవ్వాలని వేధింపులు
లబోదిబోమంటున్న భవన యజమానులు
 

 జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు చూస్తే ఎవరికైనా మైండ్ ‘బ్లాంక్’ అయిపోవాల్సిందే. ఇంతవరకూ ఇళ్లు... వాహనాల రుణాలకే పరిమితమైన ‘బ్లాంక్ చెక్’ పద్ధతిని వారు ఆస్తిపన్ను వసూలుకు వర్తింపజేస్తున్నారు. భారీ ఎత్తున బకాయిలు చూపుతూ... ‘మీరు పన్ను కట్టండి... లేదా బ్లాంక్ చెక్ ఇవ్వండి’ అంటూ ఇళ్ల ముందర భీష్మించుకు కూర్చుంటున్నారు. చెక్‌లు వినియోగిస్తున్న వారైతే
 ఒత్తిడికి తలొగ్గి ఇచ్చేస్తున్నారు. సమస్యంతా చెక్‌లు లేనివాళ్లతోనే. అధికారుల వ్యవహార శైలితో అలాంటి వారు మనస్తాపానికి గురవుతున్నారు.
 
సిటీబ్యూరో: సికింద్రాబాద్ సర్కిల్‌లోని ఓ చిరు వ్యాపారి గత ఏడాది వరకు రూ.3వేల వంతున ఆస్తిపన్నుగా చెల్లించేవారు. ఇంటి ముందు భాగంలో చిన్న దుకాణం.. వెనుక వైపు గదుల్లో నివాసం ఉన్నందుకు కొన్నేళ్లుగా ఆయన చెల్లిస్తున్న మొత్తమది. ఇటీవల ఏకంగా రూ. 2.70 లక్షలు ఆస్తిపన్నుగా చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఇంటికి వచ్చారు. వెంటనే చెల్లించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగదు చేతిలో లేకుంటే బ్లాంక్ చెక్ అయినా ఇవ్వాల్సిందేనని పీడించి మరీ చెక్ తీసుకున్నారు. దిగువ స్థాయి ఉద్యోగుల జులుం... తనను వేధించిన విధానాన్ని వివరిస్తూ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారి వద్ద ఆ వ్యక్తి వాపోయారు. ఆ అధికారి ఆయనకు నచ్చజెప్పి పంపించారు... ఇది ఆస్తిపన్ను వసూలులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీరుకు మచ్చుతునక. గతంలో చెల్లిస్తున్న దానికి మూడింతలు... ఐదింతలు అధికంగా ఆస్తిపన్ను వస్తోందని... వెంటనే చెల్లించాలని వేధిస్తున్నారని వివిధ సర్కిళ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే...  వ్యాపారాలు (నాన్ రెసిడెన్షియల్) నిర్వహిస్తున్న వారు ఇంతకాలం ఆ విషయం దాచిపెట్టి నివాస గృహాలుగా మాత్రమే ఆస్తిపన్ను చెల్లించారని.. దీని వల్ల పెనాల్టీలతో భారీ మొత్తం కనిపిస్తోందని చెబుతున్నారు. అది నిజమేననుకున్నా... జులుం ప్రదర్శించడమేమిటని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ స్థాయి ఉద్యోగులు తమకు నచ్చినట్టుగా పన్ను విధించారని వారు ఆరోపిస్తున్నారు. ఒక భవనంలో ఒక షట్టర్‌ను మాత్రం అద్దెకిస్తే నెలకు రూ.10 వేల వంతున... ఏడాదికి రూ.1.20 లక్షలు అద్దె వస్తుందనుకుంటే... దానికి విధించిన ఆస్తిపన్ను రూ.2.50 లక్షలు. ఒక యజమాని తనకు వచ్చే ఆదాయానికంటే దాదాపు రెండింతలు అధికంగా చెల్లించాల్సిన దుస్థితి.
 
విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా...

ఆదాయం పెంచుకునే క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాపార కేటగిరీలోని విద్యుత్ కనెక్షన్ల వివరాలను ఆ శాఖ నుంచి సేకరించారు. నాలుగు లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్టు గుర్తించారు. వాటి ఆధారంగానే భవనాలన్నింటికీ వాణిజ్య విభాగంలో ఆస్తిపన్ను విధించారు. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు వినియోగాన్ని తప్పుగా చూపించిన వారికి రెండున్నరేళ్ల నుంచి పెనాల్టీ విధించే అవకాశం ఉంది. ఆ విషయం వివరించడంలో విఫలమయ్యారు. అదే సమస్యగా మారింది.

టార్గెట్ సాధించాలని...

ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.2500 కోట్లు ఆస్తిపన్ను వసూలు చేయాలనేది జీహెచ్‌ఎంసీ అధికారుల లక్ష్యం. అంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే కనీసం రూ.1500 కోట్లయినా వస్తాయనేది అంచనా. ఇప్పటి వరకు వసూలైంది రూ.561 కోట్లు. మరో రెండు నెలల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు కావాలి. దీంతో అన్ని విభాగాలకూ ఈ పనినే అప్పగించారు. బిల్‌కలెక్టర్ల నుంచి అడిషనల్ కమిషనర్ల వరకూ వివిధ రూపాల్లో ఈ బాధ్యతలు అప్పగించారు. ఇంత చేసి వీరు సాధించినది చూస్తే... గత ఏడాది ఇదే రోజుకు వసూలైన ఆస్తిపన్ను కంటే కేవలం 7 శాతమే అధికం.
 
మామూళ్లే కారణమా?
 
వాణిజ్య భవనాన్ని నివాస భవనంగా యజమానులు చూపడానికి రెవె న్యూలోని క్షేత్ర స్థాయి సిబ్బంది ‘మామూళ్ల’ వ్యవహారమే కారణమన్నది బహిరంగ రహస్యం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కమిషనర్ వాస్తవ లెక్కల ఆధారంగా ఆస్తిపన్ను విధించాలని ఆదేశించారు. దీనివల్ల తమ ఆదాయానికి అడ్డుకట్ట పడుతుండడంతో ప్రజలను రెచ్చగొట్టేందుకు దిగువ స్థాయి సిబ్బందే ఎన్నో రెట్లు ఎక్కువగా పన్ను విధిస్తున్నారనే  ఆరోపణలూ ఉన్నాయి. వసూళ్లకు వెళుతున్న సిబ్బంది ‘పైనుంచి’ ఆదేశాలున్నాయంటూ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘టార్గెట్’ అస్త్రాన్ని వాడుతున్నారని జీహెచ్‌ఎంసీలోని కొందరు ఉద్యోగులే చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు చూసీచూడనట్లు ఉండాల్సిందిగా మౌఖిక ఆదేశాలు అందుతాయనే అంచనాతో వారు ఈ చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని వసూళ్ల లక్ష్యాన్ని వక్రమార్గం పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ చెడ్డపేరు మూటగట్టుకునే ప్రమాదం ఉందనేది కాదనలేని సత్యం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement