బకాయిలు చెల్లించాలంటూ పీఏసీఎస్ ఒత్తిడి
550 మంది రైతులకు నోటీసులు
రుణ మాఫీ ఎందుకు వర్తించలేదని ఆందోళన
అప్పు తీసుకోకున్నా నోటీసులిచ్చారని మరికొందరి ఆరోపణ
తక్షణం రుణ బకాయిలు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ పీఏసీఎస్ అధికారులు ఒక్క సారిగా రైతులకు నోటీసులివ్వడం కలకలం సృష్టించింది. ఎప్పుడో పదేళ్లు... పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పుడు నోటీసులేమిటని రైతులు మండి పడుతున్నారు. అసలు రుణమే తీసుకోలేదు.. అయినా నోటీసులు వచ్చాయని, ఇందులో ఏదోగోల్‌మాల్ జరిగిందని మరి కొందరు అంటున్నారు.
చీడికాడ: స్థానిక పీఏసీఎస్ పరిధిలోని 19 పంచాయతీలకు చెందిన 550 మంది రైతులకు రుణాలు చెల్లించాలంటూ పీఏసీఎస్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పీఏసీఎస్ పరిధిలో 1988 నుంచి 2006 మధ్య కాలంలో గొర్రెలు, మేకలు, ఆవులు, ఇసుక మేటల తొలగింపు కోసం తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు వడ్డీలతో తక్షణమే చెల్లించాలని వారం రోజుల క్రితం సిబ్బంది రైతులకు నోటీసులు అందించారు. ఎప్పుడో పది..పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పడు నోటీసులు రావడమేమిటని, తమకు మాఫీ వర్తించకుంకే అప్పుడే చెప్పాలి కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు తాము అప్పే తీసుకోలేదని, బకాయిలు చెల్లించమని నోటీసులు రావడమేమిటని మరికొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
మృతుల వారసులకు నోటీసులు
అప్పట్లో రుణాలు తీసుకున్న 550 మందిలో సుమారు 180 మంది వరకు మరణించారు. వారి వారసులకు ఇప్పుడు నోటీసుల రావడంతో వారు లబోదిబోమంటున్నారు. కాగా, తమ ఆస్తులు జప్తు చేస్తామంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని బాధిత రైతులు సోమవారం చీడికాడకు చెందిన అడ్వకేట్ యర్రా వెంకటరావుతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఇన్‌చార్జి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
ఇప్పుడు నోటీసులేమిటి?
ఈ సందర్భంగా రైతులు రెడ్డి కొండబాబు, బొడ్డు కన్నయ్య, రెడ్డి నాయుడు తదితరులు మాట్లాడుతూ పీఏసీఎస్ నుంచి ఏ రుణాలు తీసుకున్నా నిబంధనల ప్రకారం ఏడాది తరువాత రైతులకు నోటీసులు జారీ చేస్తారని పాతికేళ్ల తరువాత బకాయిలున్నాయంటు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. మొదటి విడత 2006లో రుణ మాఫీ జరిగిన పుడు.. మా రుణాలు మాఫీ కాకుంటే అప్పట్లో నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రుణాలే తీసుకోని తమ పేరిట బకాయిలున్నాయని నోటిసులిచ్చారని, పాలకవర్గం, సిబ్బందే తమ పేర్లుమీద బినామీ రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడి ఉంటారని రైతులు పాలకుర్తి సత్యనారాయణమ్మ, వంటాకు దేముడు ఆరోపించారు. 1988 నుంచి 2006 మధ్య కాలంలో లావాదేవీలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, రూరల్ ఎస్‌పీ, కో-ఆపరేటివ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు.
దీర్ఘకాలిక రుణాల రైతులకే నోటీసులు
1988 నుంచి 2006 మధ్య దీర్ఘకాలిక రుణాలు తీసుకుని పూర్తిస్థాయిలో చెల్లించని వారికే నోటిసులిచ్చాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1997 నుంచి 2007 మధ్య రుణాలకే మాఫీ వర్తింపచేశారు. రుణమాఫీకి ముందు తరువాత ఇన్‌స్టాల్‌మెంట్లు రైతే చెల్లించాలి, అటువంటి వారికే నోటీసులు ఇచ్చాం. అయితే చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీలో ఆ రుణాలు పోతాయని ఇప్పటివరకు చూశాం.. ఈ ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీచేసింది.. ఒక్క దీర్ఘకాలిక రుణం కూడా మాఫీకాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు నోటీసులిచ్చాం
-బత్తిన సత్యనారాయణ, పీఏసీఎస్ కార్యదర్శి
నోటీసుల కలకలం
Published Mon, Mar 14 2016 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
Advertisement
Advertisement