నెలాఖరులోగా బకాయిలు ఇవ్వకుంటే ఆందోళన
మంత్రుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
చోడవరం: చెరకు రైతులకు ఈనెలాఖరులోగా బకాయిలు ఫ్యాక్టరీలు చెల్లించకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగుతుందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ ప్రతినిధి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఇక్కడ మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందస్థాయి వరకు అంతా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గోవాడ ఫ్యాక్టరీని రూ.25 కోట్లు లాభాల్లో ఉంచితే ఇప్పుడు పూర్తిగా నష్టాల్లోకి తెచ్చి చివరికి రైతులకు సకాలంలో పేమెంట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి తేవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. టన్నుకు రూ.175చొప్పున ఇవ్వాల్సిన బకాయి పేమెంట్ ఈనెల 31లోగా ఇవ్వకపోతే వచ్చే నెలలో జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగుతుందని, ఈ విషయమై శాసనసభలో కూడా పార్టీ తరపున ప్రస్తావిస్తామని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఇది పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి మాట అని బొత్స చెప్పారు. గతంలో కూడా ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిందని, అయితే ఎవరైనా అర్హులు పథకాలకు ఉండిపోతే సూచించడానికే ఆ కమిటీ పరిమితమయ్యేదని గుర్తుచేశారు. కాని ఇప్పుడు జన్మభూమి కమిటీలు అర్హులైన వారిని కూడా తీసేయడంతోపాటు దోపిడీలకు పాల్పడతున్నాయని ఆరోపించారు.
అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టారాజ్యం: రాష్ర్ట శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు. శాసనభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయమని, అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు మంత్రులు అడ్డుపడి ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పది మంది మంత్రులు ఒకేసారి మాటల దాడికి దిగడం అధికార పార్టీ దౌర్జన్యపూరిత విధానాలకు అద్దంపడుతోందన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రజలు చూస్తున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులతో సహా అధికార పార్టీ తీరు, వారు వాడుతున్న పదజాలం చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రసుత్త శాసనసభకు వెళ్లకపోవడమే మంచిదని కొందరు సీనియర్ నేతలు అనుకునే స్థాయిలో సభ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రాజధాని నిర్మించినా తమ పార్టీకి అభ్యంతరం లేదని, అయితే రాజధాని పేరుతో జరుగుతున్న భూదందా,దోపిడీలకు వ్యతిరేకంగానే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని బొత్స స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందు మంత్రులకు, తన సన్నిహితులకు సీఎం చెప్పి రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకొని, వారికి పంట దక్కకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ భూ దోపిడీపై విచారణ చేయించాలని బొత్స డిమాండ్ చేశారు. తమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి శాసనసభలో మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు.
ప్రజాసమస్యలపై పోరాటం: జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ పార్టీ కమిటీలు నెలకు ఒకసారి సమావేశాలు నిర్వహించుకొని గ్రామస్థాయి ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. విశాఖకు రైల్వేజోన్‌ను ఏప్రిల్ 14లోగా ఇవ్వకపోతే ఆమరణదీక్షకు దిగుతానని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు పరిశీలిస్తున్నారని, టీడీపీకి త్వరలోనే బుద్ధిచెబుతారన్నారు.
సమస్యలు
గాలికొదిలేసిన ఎమ్మెల్యే: నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గం అనేక మంది అర్హులకు పింఛన్లు సైతం ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు వదిలేసి మూడు క్వారీలు, ఆరు క్రషర్లుగా సొంత పనులు చేసుకోవడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. గోవాడ సుగర్స్‌లో రైతుల సొమ్ముతో ఎమ్మెల్యే, సుగర్స్ చైర్మన్ పేరుతో విరాళాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, మాజీలు ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు, తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, తిప్పలనాగిరెడ్డి , కర్రి సీతారాం, పార్టీ నాయకులు జాన్ వెస్లీ, సత్తిరామకృష్ణారెడ్డి, వీసం రామకృష్ణ, బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చెరకు రైతుకు అండ
Published Tue, Mar 15 2016 11:57 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement