
న్యూఢిల్లీ: బాకీలపై వడ్డీని కంపెనీలో వాటాల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఏ టెల్కోనూ కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని భారీ బకాయిల భారంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) ఎండీ రవీందర్ టక్కర్ తెలిపారు. టెలికం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలైనా ఉండాలని, అవి మార్కెట్లో పోటీపడాలన్నదే కేంద్రం అభిప్రాయమని పేర్కొన్నారు. టెలికం సంస్కరణలను కేంద్రం ప్రకటించడానికి ముందు తాను ప్రభుత్వంలోని వివిధ వర్గాలతో సంభాషించానని ఆయన చెప్పారు. ఏ టెలికం కంపెనీని కొనుగోలు చేయాలని గానీ నిర్వహించాలని గానీ ప్రభుత్వానికి ఉద్దేశమేదీ లేదని ఆయా సమావేశాల్లో స్పష్టమైందని టక్కర్ తెలిపారు.