Interest business
-
30 ఏళ్లుగా మోసం.. రూ. 50 కోట్లతో రాత్రికి రాత్రే పరార్
మంగళగిరి: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు రూ. 50కోట్లతో ఓ వ్యాపారి రాత్రికి రాత్రే తన కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు శివకృష్ణ, శ్రీనివాస్ ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం పక్కన పెద్ద భవంతిలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు మంగళగిరి, తాడేపల్లికి చెందిన పలువురు వెంకటేశ్వరరావు వద్ద చిట్టీలు వేయడం, వడ్డీలకు డబ్బులు ఇచ్చి తీసుకునేవారు. ఈ క్రమంలో 30 ఏళ్లుగా వందలాది మంది వెంకటేశ్వరరావును నమ్మి కోట్లాది రూపాయలు ఇచ్చారు. వడ్డీలు నెలనెలా చెల్లించేవారు. చిట్టీలు సైతం రూ.20వేల నుంచి రూ.10లక్షల వరకు నిర్వహించే వారు. అయితే కొంతకాలంగా వడ్డీ చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో తమ డబ్బులను వెంటనే చెల్లించాలని వెంకటేశ్వరరావు కుటుంబంపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెంకటేశ్వరరావు కుటుంబం సెల్ఫోన్లు అన్నీ స్విచ్చాఫ్ చేసుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించి.. ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు సుమారు రూ. 50 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉన్నట్లు బాధితులు పేర్కొన్నారు. -
టెల్కో కొనుగోలుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: బాకీలపై వడ్డీని కంపెనీలో వాటాల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఏ టెల్కోనూ కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని భారీ బకాయిల భారంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) ఎండీ రవీందర్ టక్కర్ తెలిపారు. టెలికం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలైనా ఉండాలని, అవి మార్కెట్లో పోటీపడాలన్నదే కేంద్రం అభిప్రాయమని పేర్కొన్నారు. టెలికం సంస్కరణలను కేంద్రం ప్రకటించడానికి ముందు తాను ప్రభుత్వంలోని వివిధ వర్గాలతో సంభాషించానని ఆయన చెప్పారు. ఏ టెలికం కంపెనీని కొనుగోలు చేయాలని గానీ నిర్వహించాలని గానీ ప్రభుత్వానికి ఉద్దేశమేదీ లేదని ఆయా సమావేశాల్లో స్పష్టమైందని టక్కర్ తెలిపారు. -
కారుపై పెట్రోలు పోసి.. ముగ్గురిపై హత్యాయత్నం
సాక్షి, అమరావతి బ్యూరో: స్నేహితుల మధ్య వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం.. ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి కారణమైంది. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డి స్నేహితులు. వీరంతా కలిసి వడ్డీ వ్యాపారంతోపాటు రియల్ఎస్టేట్, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో గంగాధర్, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్ రెడ్డి రూ.2.5 కోట్లు అప్పు ఇచ్చాడు. తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వేణుగోపాల్‌రెడ్డి వారిద్దరిపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగాధర్‌కు చెందిన స్థలాన్ని విక్రయించి సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒక రియల్ఎస్టేట్ వ్యాపారిని కలుద్దామని చెప్పి గంగాధర్, కృష్ణారెడ్డిలను సోమవారం సాయంత్రం నోవాటెల్ హోటల్ వద్దకు రప్పించాడు. వీరిద్దరితో పాటు గంగాధర్ భార్య నాగవల్లి కూడా కారులో వచ్చి నోవాటెల్ హోటల్ సమీపంలోని కెనరా బ్యాంక్ ముందు ఆపారు. వారితో కారులో కూర్చొని డబ్బు విషయంలో చర్చలు జరుపుతూనే హఠాత్తుగా బయటకొచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, తనతోపాటు తెచ్చుకున్నపెట్రోలును కారుపై పోసి నిప్పంటించి పారిపోయాడు. వేణుగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా నిప్పంటించడం చూసిన బాధితులు వెంటనే తేరుకొని కారు అద్దాలు పగలగొట్టి డోర్ తీసుకుని బయటకు వచ్చారు. వీరికి స్థానికులు కూడా సాయం అందించారు. కృష్ణారెడ్డికి తీవ్రంగా.. గంగాధర్, నాగవల్లిలకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా కాలిపోయింది. డీసీపీ హర్షవర్ధన్‌రాజు, ప్రమాదస్థలికి చేరుకుని ఘటనపై విచారించారు. ముగ్గురు బాధితులను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. -
వడ్డీ జలగలు..!
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్. అనంతపురంలోని రాణినగర్లో భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అవసరాల నిమిత్తం శివ అనే వ్యక్తి దగ్గర రూ.1.20లక్షలు అప్పు చేశాడు. ఏడాదిగా తిరిగి చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకూ రూ.లక్ష చెల్లించగా.. ఇంకా రూ.20వేలు మాత్రమే బకాయి ఉంది. కానీ మరో రూ.లక్ష దాకా చెల్లించాలని శుక్రవారం రాత్రి గుత్తిరోడ్డులోని ఓ దాబా ఎదుటనున్న కార్యాలయానికి పిలిపించుకున్న వడ్డీ వ్యాపారస్తుడు తన అనుచరులతో కలిసి రాడ్లతో దాడి చేయించాడు. తీవ్ర గాయాలపాలైన వినోద్ ప్రస్తుతం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాక్షి, అనంతపురం సెంట్రల్: వడ్డీ వ్యాపారుల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అవసరాలను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం వడ్డీ వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం తాగుతున్నారు. అసలును మించి వడ్డీ చెల్లించినా.. ఇంకా మిగిలే ఉందంటూ దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జిల్లా కేంద్రం అనంతపురంలో కోకొల్లలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. గత శుక్రవారం రాత్రి ఆటోడ్రైవర్ వినోద్‌కుమార్‌పై చోటు చేసుకున్న దాడితో వడ్డీ వ్యాపారం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో రకరకాల పేర్లతో వడ్డీ వ్యాపారులు లావాదేవీలు సాగిస్తున్నారు. గతంలో ఏడాదికి వడ్డీ, అసలు చొప్పున చెల్లించాలనే నిబంధన ఉండేది. అది కూడా రూ.2ల వడ్డీ అంటే అబ్బో అనుకునేవాళ్లు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. వారం వడ్డీ.. రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. అంటే రూ.లక్ష అప్పుగా తీసుకుంటే వారానికి రూ.10వేలు వడ్డీగా చెల్లించాలి. ఒక వారం చెల్లించకపోతే దానికీ వడ్డీ పడుతుంది. మరో వారం దాటితే ఇంటి మీద పడి గొడవ చేయడంతో పాటు దాడులకు తెగబడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిలో టీడీపీ నేతలు కూడా అధికంగా ఉన్నారు. కార్పొరేషన్లో చక్రం తిప్పిన ఓ నాయకుడు ఎప్పటి నుంచో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అనుచరులు కూడా ఈ దందా సాగిస్తున్నారు. రూ.10 నుంచి రూ.20 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద అప్పు తీసుకున్న వాళ్లు భయంతో వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తూ వీధిన పడుతున్నారు. ప్రస్తుతం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. పాతూరు, రాణినగర్, వినాయక్ నగర్, బుడ్డప్ప నగర్, తదితర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారమే వృత్తిగా ఎంతో మంది కోట్లకు పడగలెత్తడం గమనార్హం. పల్లెలకు విస్తరణ కేవలం పట్టణాల్లోనే కాకుండా వడ్డీ వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. మైక్రో ఫైనాన్స్ కంపెనీల పేరుతో కొంతమంది గ్రామాలకు వచ్చి అప్పులిస్తున్నారు. అయితే మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వడ్డీకి అప్పుగా ఇస్తున్నారు. వారం వారం గ్రామాలకు వచ్చి అప్పు వసూలు చేస్తున్నారు. మహిళలు కూలి పనులకు వెళ్లి సంపాదించిన మొత్తాన్ని వారం తిరిగేసరికి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మూటకట్టుకుని వెళ్తున్నాయి. గతంలో ఇలాంటి కంపెనీలు కోకొల్లలు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిదెబ్బకు తాళలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడటంతో అప్పట్లో నిషేధం విధించారు. అయితే పలు కంపెనీలు తిరిగి గ్రామాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ► నగరంలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వడ్డీ వ్యాపారస్తుని అవతారమెత్తాడు. ఉద్యోగులకు రూ.10 నుంచి రూ.20ల వరకు వడ్డీతో అప్పులు ఇస్తున్నాడు. వారి నుంచి పూచీకత్తుగా ఏటీఎంలు, ఖాళీ చెక్కులను తీసుకోవడం ఈయన ప్రత్యేకత. ఎక్కడైనా తేడా వస్తే కోర్టుకు లాగుతుంటాడు. ఖాళీ చెక్కులు తీసుకోవడంతో రూ.లక్ష బాకీ ఉన్నా రూ.5 లక్షలకు కోర్టులో కేసు వేస్తానంటూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. ► నగరంలోని కమలానగర్లో క్యాంటీన్ నిర్వహిస్తున్న యువకులకు వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి రూ.1.50లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ యువకులు వడ్డీతో కలిపి రూ.3లక్షలకు పైగా చెల్లించారు. తనకు ఇంకా రూ.లక్ష రావాలని, కట్టకపోతే క్యాంటీన్ మూసేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై బాధితులు ‘స్పందన’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేశారు. ► వడ్డీ వ్యాపారంలో ఇదో సరికొత్త ఆధ్యాయం. రోజు.. వారం.. నెల.. సంవత్సరం.. ఇలాంటి వడ్డీలు అందరికీ తెలిసిందే. కానీ అనంతపురం నగరంలో ముఖ వడ్డీ తెరపైకి వచ్చింది. అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడ కనిపిస్తే అక్కడ వడ్డీ చెల్లించాలి. ఒక రోజులో ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లూ వడ్డీ కట్టాల్సిందే. ఓ వ్యక్తి రూ.10వేలు అప్పు తీసుకున్నాడనుకుంటే, రూ.2ల వడ్డీ చొప్పున కనిపించినప్పుడల్లా ఇచ్చుకోవాల్సిందే. ఈ కారణంగా అప్పు తీసుకున్న వ్యక్తి ముఖం చాటేయాల్సి వస్తోంది. ఎంతటి వారినైనా ఉపేక్షించం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆటోడ్రైవర్ వినోద్‌పై దాడి ఘటనకు సంబంధించి నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించబోం. బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం. – పీఎన్ బాబు, డీఎస్పీ, అనంతపురం -
‘వడ్డీ’.. నడ్డి విరిచి..!
జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్టీలు, వడ్డీ వ్యాపారం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. దీంతో ఆయా వ్యాపారాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. శుక్రవారం జిల్లాలోని 31 మండలాలు, ప్రధాన పట్టణాల్లో పోలీస్‌లు, నిఘా విభాగం అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున నగదు, విలువైన డాక్యుమెంట్లు, ముందస్తు సంతకాలు చేసిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్థిరాస్తి డాక్యుమెంట్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు రెండు రోజులుగా దాడులు నిర్వహించి 51 మందిపై కేసులు నమోదు చేశారు. చెక్కులు, ఏటీఎంలు, ప్రామిసరీ నోట్లు, బాండ్పత్రాల్లో మొత్తం 51,203మంది బాధితుల జీవితాలు బంధీగా ఉన్నాయని ప్రాథమికంగా తేలినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. నల్లగొండ క్రైం : నగదు వ్యాపారం చేస్తూ చిరు వ్యాపారులు, అత్యవసరానికి డబ్బు తీసుకున్న ఇతరులనుంచి అత్యధిక వడ్డీలను వసూలు చేస్తున్న వారి నడ్డిని పోలీసులు విరగ్గొడుతున్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా అమాయక ప్రజలను జలగల్లా పీడిస్తున్న వారి కోరలు పీకుతున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీవ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రధానంగా దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ లాంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో సాగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారంపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. నగదు దందా ఇలా.. చిరు వ్యాపారుల జీవన విధానాన్ని సొమ్ము చేసుకునేందుకు వడ్డీ వ్యాపారులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఆటోఫైనాన్స్లు నెల వారి చిట్టీలు, లక్కీ డ్రాలతో అనేకమంది ప్రజలను నట్టే ట ముంచుతున్నారు. డబ్బులు ఇవ్వడం ఆలస్యమైతే వారి కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా అవమానించడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఓ కిరాణవ్యాపారి కుటుంబం, మిర్యాలగూడలో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముందస్తుగా బాండ్లు చెక్కులు.... వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా రుణం తీసుకునేవారి నుంచి సంతకంతో కూడిన ఖాళీ చెక్కులను తీసుకుంటారు. అదే విధంగా ప్రామిసరీ నోట్లు, స్థిరాస్తులకు సంబంధించిన బాండ్ పేపర్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో రుణం తీసుకున్నవారు వడ్డీ వ్యాపారస్తుల చేతులో కీలు బొమ్మగా మారుతున్నారు. వారికి సంపాదించి పెట్టే కూలీలవుతున్నారు. చివరికు వారి కుటుంబ పోషణను దీనంగా నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు.. వడ్డీ వ్యాపారాలపై వరుస ఫిర్యాదులతో జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో 51 మంది వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు. దేవరకొండ డివిజన్లో 18 మందిపై కేసు నమోదు చేయగా రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డివిజన్లో 14 మందిపై, నల్లగొండ డివిజన్లో 19 మందిపై కేసు నమోదు చేశారు. మొత్తంగా 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విలువైన పత్రాలు స్వాధీనం... జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో 10 వేల ప్రామీసరీ నోట్లు, 3500 చెక్కులు, 1000 ఏటీఎం కార్డులు, 2,300 బాండు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అ«ధికార వర్గాల సమాచారం. మొత్తం స్వాధీనం చేసుకున్న పత్రాల్లో 50 వేల కుటుంబాలకు పైగా వడ్డీ వ్యాపారుల చేతుల్లో బంధీలుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. భారీ ఎత్తున నివురుగప్పిన నిప్పులా సాగుతున్న ఆర్థిక వ్యాపారాన్ని పోలీసులు మిర్యాలగూడ, నల్లగొండ ఆత్మహత్య సంఘటనతో కూపీలాగి కట్టడి చేసేందుకు వ్యూహం పన్నారు. మీటర్ కటింగ్ అంటే.. లక్ష రూపాయలు మీటర్ కటింగ్ (ఎంసీ) తీసుకున్న చిరు వ్యాపారి మూడు నెలల్లో (వంద రోజులు) రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం చెల్లించినా మొదట తీసుకున్న లక్షల రూపాయలు అలాగే ఉండటం వల్ల వాటిని ఒకేసారి చెల్లించాలి. అంటే లక్ష రూపాయలకు రోజు వడ్డీ వెయ్యి రూపాయలు వసూలు చేస్తారన్నమాట. బారా కటింగ్ అంటే.. బారా కటింగ్ (బీసీ)కింద లక్ష రూపాయలు తీసుకున్న వ్యాపారి మూడు నెలల్లో (వంద రోజులు) రోజూ వెయ్యి చెల్లించాలి. దానికి సంబంధించి వడ్డీ మొదట్లోనే కట్ చేసుకుంటాడు. అంటే లక్ష రూపాయల బీసీ తీసుకుంటే 85 వేల రూపాయలు మాత్రమే ఇస్తారు. వంద రోజుల్లో చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తారు. అక్రమ వడ్డీ వ్యాపారం సహిచం.. జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనం గడపని చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు ఆత్మహత్యల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు తమ భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలను దృష్టిలో పెట్టుకుని చిట్టీల వ్యాపారుల దాచి పెట్టుకుంటున్నారు. ఆర్థిక నేరగాళ్లు రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయడంతో దాచిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇక అవసరానికి డబ్బు తీసుకుంటే మందస్తుగా విలువైన పత్రాలు తీసుకుంటున్నారు. ఇక డబ్బు చెల్లించలేని పరిస్థితి వస్తే వ్యాపారుల తీరుతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్రమ వ్యాపారాలను కట్టడి చేస్తాం. స్వా«ధీనం చేసుకున్న డాక్యుమెంట్ ఆధారంగా 50 వేల కుటుంబాలు వడ్డీ వ్యాపారుల చేతుల్లో ఉన్నట్లు భావిస్తున్నాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్పీ రంగనాథ్ -
కాల్ 'నాగులు'
ఏలూరు అమీనాపేటకు చెందిన వెంకట కృష్ణవేణిఒక వడ్డీ వ్యాపారి వద్ద 2014లో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.30 వేలు అప్పుగా తీసుకుంది. భర్త చనిపోవటంతో కూలిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. బాకీని నెలనెలా కొంతమొత్తంగా చెల్లిస్తోంది. 2015 నాటికి బాకీ రూ.2 వేలు మిగిలింది. ఇదే సమయంలో కాల్‌మనీ వివాదంతో వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు కావటంతో సొమ్ము తీసుకునేందుకు ఆమె వద్దకు ఎవరూ రాలేదు. అనంతరం బాకీ విషయంలో సదరు వడ్డీ వ్యాపారి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తాజాగాఆమె తమకు రూ.2 లక్షలు బకాయి ఉందని, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ చెక్కుల ఆధారంగా బినామీలతో కోర్టులో కేసు వేశాడు. ఇప్పటికేతీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెనువడ్డీ వ్యాపారి కోర్టు కేసు పేరుతో వేధిస్తూ..బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏలూరు టౌన్ : జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. ఒక్క ఏలూరు నగరంలోనే ఇలా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారులు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరు రూ.కోట్లలో వ్యాపారాలు సాగిస్తున్నారు. రోడ్ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల నుంచి మధ్య తరగతి వర్గాల వరకూ వేలసంఖ్యలో వ్యక్తులకు అప్పులు ఇస్తూ ఉంటారు. ధర్మ వడ్డీకి అప్పు ఇచ్చే పరిస్థితులు పోయి.. చక్రవడ్డీలు, ఎస్టీడీ వడ్డీల పేరుతో జనాలను దోచేస్తున్నారు. రోజంతా కూలీనాలీ చేసుకునే పేద వర్గాలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఈ కాల్‌మనీ జలగల ఉచ్చులో పడి దోపిడీకి గురవుతున్నారు. ఏలూరు అశోక్‌నగర్‌లోనే ఇద్దరు, ముగ్గురు వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచక దందాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ‘కాల్‌మనీ’ కేటుగాళ్లు డబ్బు వాసన రుచిమరిగి పేట్రేగిపోతున్నారు. అవసరాల కోసం అప్పు తీసుకుంటున్న పేద, మధ్య తరగతి వర్గాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలు, వితంతువులు, వృద్ధులు, పేదలు, ఆదరణలేని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటూ అప్పులు ఇస్తున్నారు. తీసుకున్న అప్పునకు ఎస్టీడీ వడ్డీ వేసి రెట్టింపు కట్టించుకున్నాక, వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. రెండు, మూడేళ్లు ఆగిన అనంతరం అప్పు తీసుకున్న వ్యక్తుల చెక్కులతో కోర్టులో మరోసారి భారీ మొత్తానికి కేసులు వేస్తున్నారు. సెటిల్మెంట్ చేసుకునే వరకూ వేధింపులకు గురి చేస్తున్నారు. పోనీ పోలీస్స్టేషన్లకు వెళదామా అంటే అక్కడ తమ అనుచర వర్గాన్ని పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడడం కాల్‌మనీ కేటుగాళ్ల స్టైల్. బినామీలతో చెక్కులను కోర్టుల్లో వేయిస్తూ నోటీసులు పంపిస్తారు. నగరంలో ఇదే తరహాలో వేధింపులకు గురవుతున్న బాధితులు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారు. హత్యానేరాల్లో నిందితులతో బలవంతపు వసూళ్లు ఏలూరు నగరానికి చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి ఇక్కడే పాతుకుపోయిన కొందరు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రూ.వేలల్లో సొమ్ములు ఇస్తూ.. రోజువారీ, వారం, పక్షం రోజులు, నెలరోజులు ఇలా వసూలు చేస్తుంటారు. రూ.వెయ్యి అప్పుగా ఇవ్వాలంటే ముందుగానే రూ.200 మినహాయించుకుని రూ.800 ఇస్తుంటారు. ఈ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెప్పిన రోజుకు చెల్లించాలి. ఒక్కరోజు దాటితే అదనంగా పెనాల్టీ పడుతుంది. ఇక తీసుకున్న అప్పు వసూళ్ల బాధ్యతను నగరంలోని హత్యా నేరాల్లో నిందితులు, రౌడీషీటర్లకు అప్పగిస్తారు. ఈ వ్యక్తులు రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి డబ్బు వసూళ్లకు బెదిరింపులు చేస్తుంటారు. ఒక వేళ సొమ్ములు చెల్లించలేని పక్షంలో మహిళలను లైంగికం గానూ వేధింపులకు గురిచేస్తూ తమదైన శైలిలో వసూలు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. బాధితులు పోలీస్స్టేషన్లకు వెళ్లే అవకాశం లేకుండా స్టేషన్లలో సైతం తమ అనుచరులను ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన ఎస్కే రియాజుద్దీన్ ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. నెలనెలా వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి సొమ్ము చెల్లించేలా నిర్ణయించారు. తీసుకున్న రుణానికి మూడు రెట్లు రూ.1.50 లక్షలు ఎస్టీడీ (వందకు నెలకు రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తారు) వడ్డీతో వసూలు చేశారు. కానీ అంతటితో వ్యాపారి ఆగిపోలేదు. అదనంగా మరో రూ.50 వేలు చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు దిగాడు. తన సొమ్ము ఇప్పించాలంటూ బినామీలతో రియాజుద్దీన్ ఇచ్చిన చెక్కులతో కోర్టులో కేసు వేశాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన ఆతను వడ్డీ వ్యాపారి వేధింపులకు తాళలేక 2017లో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. వృద్ధులు, వితంతువులు, ఆదరణలేనివారే టార్గెట్ కుటుంబ అవసరాలో.. వ్యక్తిగత సమస్యలతోనో.. వడ్డీలకు అప్పులు తీసుకున్నారో ఇక అప్పు తీసుకున్న వ్యక్తుల జీవితాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే. ఈ వ్యాపారులు ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వరు. సమాజంలో ఆదరణలేనివారు, పేదవర్గాలు, బంధువర్గం లేనివాళ్ళు, మహిళలు, వృద్ధులు, వితంతువులు ఇలా కొన్ని వర్గాల ప్రజలను మాత్రమే వారు టార్గెట్‌గా చేసుకుంటారు. వ్యాపారుల కనుసన్నల్లో నడిచే వ్యక్తుల విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డబ్బులు అప్పులుగా ఇస్తుంటారు. వేధింపులకు గురిచేసినా ఎవరూ అండలేకుండా చేయటం, పోలీస్స్టేషన్లకు వెళ్ళలేని నిస్సహాయులను ఏరికోరి వారికే అప్పులు ఇవ్వటం వారి స్పెషల్. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుంటూ వేధింపులకు పాల్పడితే సహించేదిలేదు. బలవంతంగా ఎవరితోనైనా సంతకాలు చేయించి, నిబంధనలు మీరితే చర్యలు తప్పవు. ఎవరైనా వడ్డీ వ్యాపారం పేరుతో వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. విచారణ చేపట్టి బాధితుల ఫిర్యాదు మేరకు కాల్‌మనీ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పేదలు, మహిళలు, వితంతువులు, ఇలా ఎవరిపైన అయినా దాడులు, వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయితే తప్పకుండా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారి పట్ల ప్రజలూ జాగ్రత్తలు పాటించాలి. – ఎం.రవిప్రకాష్, ఎస్పీ -
మిస్టరీ వీడింది..
తూర్పుగోదావరి , (పెద్దాపురం): నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పెద్దాపురం మండలం గుడివాడ గ్రామ వడ్డీ వ్యాపారి పోతంశెట్టి విష్ణు ఈశ్వరులు అలియాస్ వాసుదేవ(50) హత్యకు గురయ్యాడు. గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో మాంసం వ్యాపారి షేక్ వల్లీకి చెందిన ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలో అతడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 23న ఫైనాన్స్ సొమ్ము వసూలు నిమిత్తం తిరుమలాయపాలెం వచ్చిన విష్ణు ఈశ్వరులును షేక్ వల్లీ హత్య చేసినట్టు తెలిసింది. నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి పిలిచిన వల్లీ కత్తితో విష్ణు ఈశ్వరులను తలపై నరికి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ గోతిలో పూడ్చి ఎవరికీ అనుమానం రాకుండా మూత వేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడి ఇంటి మిద్దెపై, మృతుడి ఫైనాన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని బాత్రూమ్పై పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని ఇంట్లోంచి గోతి వరకు ఈడ్చుకెళ్లిన రక్తపు మరకలు, గోడపై ఉన్న రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ గోతిలోంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై జి.ఉమామహేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ వీరయ్యగౌడ్ సైతం సిబ్బందితో అక్కడకు చేరుకుని సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం కోరుకొండ సీఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సైను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, గుడివాడకు చెందిన అధిక సంఖ్యలో గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని తీవ్రంగా విలపించారు. సంఘటన వార్త గ్రామంలో వ్యాపించడంతో భారీ ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఇదిలా ఉండగా సంఘటనపై ఎవరు కేసు నమోదు చేయాలనే అంశంపై ఇటు గోకవరం, అటు పెద్దాపురం పోలీసుల తర్జనభర్జన పడ్డారు. దీంతో రాత్రయినా శవాన్ని బయటకు తీయలేకపోయారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండటం, రాత్రి సమయం కావడంతో బయటకు తీయడానికి గ్రామస్తులు వెనుకంజ వేశారు. దీంతో శనివారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యకు కేవలం నగదు లావాదేవీలేనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై స్థానికులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బైక్ జగ్గంపేట మండలం రాజపూడి శివారున పుష్కర కాలువ గట్టు వద్ద లభించడంతో నిందితుడు షేక్ వల్లీ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానమే నిజమైంది విష్ణు ఈశ్వరులు అదృశ్యమైనప్పటి నుంచి కుటుంబ సభ్యులు తిరుమలాపాలెంలో ఓ వ్యక్తి మధ్య ఘర్షణ జరిగిందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలుమార్లు కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు తిరుమలాయపాలెం వచ్చి షేక్ వల్లీ ఇంటి చుట్టూ గాలించారు. శుక్రవారం ఇంటి ఆవరణ నుంచి దుర్వాసన వెలువడడంతో ఈ ఘాతుకం బయటపడింది. -
వడ్డీ వ్యాపారానికి లైసెన్సు తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వడ్డీ వ్యాపారం చేయాలంటే ఇకపై తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీకే అప్పులు ఇవ్వాలి. అధిక వడ్డీలు వసూలు చేసినా, అక్రమాలకు పాల్పడినా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు ఏపీ వడ్డీ వ్యాపారుల చట్టం (క్రమబద్ధీకరణ) సంబంధిత బిల్లును ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిరోధించేందుకు 2000 సంవత్సరంలోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ చట్టంగా రూపుదిద్దుకోలేదు. ఆ తరువాత 2015లో వడ్డీ వ్యాపారుల బిల్లును శాసనసభ అమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా బిల్లును తిరిగి పరిశీలించాలంటూ రాష్ట్రానికి తిప్పి పంపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకురావడానికి వీలుగా బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అయితే ఒకపక్క చట్టం తీసుకువస్తూనే మరోపక్క.. ప్రభుత్వం కావాలనుకున్న వడ్డీ వ్యాపారులకు సదరు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే వెసులుబాటును ఇదే బిల్లులో కల్పించడం గమనార్హం. బిల్లులోని మరికొన్ని అంశాలు.. వడ్డీ వ్యాపారానికి లైసెన్సు కావాలంటే ఆ వ్యాపారం స్థాయి ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోపల సంబందిత అధికారి లైసెన్సు మంజూరు చేయవచ్చు లేదా దరఖాస్తును నిరాకరించవచ్చు. దరఖాస్తుదారు మోసం చేసే దురుద్దేశంతో ఉన్నాడని భావిస్తే లైసెన్సును నిరా>కరించవచ్చు. లైసెన్సు కాలవ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. ప్రతి వడ్డీ వ్యాపారి తన దుకాణం లేదా వ్యాపార స్థలంలో.. వడ్డీ వ్యాపారిగా తన పేరును ప్రాంతీయ భాషలో ప్రదర్శించాలి. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు గరిష్ట వడ్డీ రేటును వ్యాపారి వసూలు చేసుకోవచ్చు. వడ్డీ వ్యాపారి తాను ఇచ్చిన అప్పునకు సంబంధించి రావలసిన డబ్బును లేదా ఆస్తిని పూర్తిగా లేదా పాక్షికంగా స్వీకరించేందుకు నిరాకరించినప్పుడు, రుణ గ్రహీత సదరు అప్పును లేదా ఆస్తిని అధీకృత న్యాయస్థానంలో డిపాజిట్ చేయవచ్చు. హామీ గల, హామీ లేని అప్పులకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ధారిస్తుంది. నిర్ధారించిన వడ్డీ రేట్లను ఆవరణలో ప్రముఖంగా కన్పించేలా ప్రదర్శించాలి. వడ్డీ వ్యాపారి ఏదేని అప్పునకు సంబంధించి అసలు మొత్తానికి మించి వడ్డీ రూపంలో వసూలు చేయరాదు. అసలు అప్పునకు సమానంగా లేదా దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్లయితే ఆ అప్పును తీర్చినట్లుగానే భావించాలి. ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ వ్యాపారి అప్పు తీసుకున్న వారికి తిరిగి చెల్లించాలి. వడ్డీ వ్యాపారి ఖాతా పుస్తకాలను నిర్వహించాలి. లైసెన్సింగ్ అధికారుల తనిఖీ నిమిత్తం వాటిని అందుబాటులో ఉంచాలి. ఖాతాలను సంవత్సరానికి కనీసం ఒకసారి ఆడిట్ చేయించాలి. అధిక వడ్డీ వసూలు చేస్తే జైలు నిర్ధారిత వడ్డీ రేట్లను కాకుండా వ్యాపారులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తే ఏడాది లేదా గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు లేదా వాటికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు వీలుగా న్యాయస్థానానికి ప్రత్యేక హోదా కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో అధిసూచన ద్వారా, తాము ఉచితమని భావించిన వడ్డీ వ్యాపారులకు షరతులకు లోబడి ఈ చట్టానికి చెందిన అన్ని లేదా ఏవైనా కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. డిపాజిట్ వివరాలు... ఏడాదిలో లక్ష రూపాయలకు మించని మొత్తాన్ని అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. రూ.లక్షకు మించి రూ.5 లక్షల లోపు అప్పులిచ్చే పక్షంలో రూ.10 వేలు, రూ.5 లక్షలకు మించి రూ.10 లక్షల లోపు మొత్తమైతే రూ.50 వేలు డిపాజిట్ చేయాలి. ఏడాదిలో రూ.10 లక్షలకు మించి రూ.25 లక్షల లోపు అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.లక్ష, రూ.25 లక్షలకు మించి రూ.50 లక్షలకు లోపు మొత్తమైతే రూ.1.5 లక్షలు, రూ.50 లక్షలకు మించి అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రైవేటు వడ్డీ
ఒంగోలు టౌన్ : ప్రైవేట్ వడ్డీలు ఓ బడుగుజీవి ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవనోపాధి కోసం తీసుకున్న అప్పునకు అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా చెల్లించాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తుండటంతో తన గోడు అధికారులకు చెప్పుకుందామని అర్జీ చేతపట్టుకుని కలెక్టరేట్‌కు వెళ్లాడు. కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో కాకర్ల మోషె కుర్చీలకు వైర్లు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదాయం తగ్గిపోవడానికి తోడు మోషె అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో ఒంగోలుకు చెందిన రాపూరి వాసు అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. నెలకు నూటికి ఆరు రూపాయల వడ్డీ చొప్పున రోజువారీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. డబ్బులు మొత్తం వడ్డీతో సహా రూ.4 లక్షలు చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, వంద రూపాయల స్టాంపు పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాడు. రెక్కాడితేగాని డొక్కాడని తనకు అప్పు ఇచ్చిన వారికి వడ్డీ సహా చెల్లిస్తే ఇంకా చెల్లించాలంటూ బెదిరిస్తుండటంతో మోషె తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఒకవైపు వడ్డీ వేధింపులు, ఇంకోవైపు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేక పోయాడు. తన సమస్యలను అర్జీ రూపంలో రాసుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కొద్ది సేపు మెట్ల మీద కూర్చున్న మోషె వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోషేను, పక్కన పురుగుల మందు డబ్బాను గమనించి అక్కడున్నవారు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు 48 గంటల పాటుఅబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. చంపుతానని బెదిరిస్తున్నాడు.. తాను తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ రాపూరి వాసు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని మోషె వాపోయాడు. ప్రామ్సరీ నోట్లు, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకోవడంతోపాటు డబ్బు చెలించకుంటే చంపుతానంటూ ఇంటికి వచ్చి బెదిరించాడన్నాడు. దీంతో తనకు మరణమే శరణ్యమని పురుగులమందు తాగినట్లు చెప్పాడు. తన గోడు జిల్లా కలెక్టర్‌కు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టరేట్‌కు వెళ్లినట్లు తెలిపాడు. తనను, తన కుటుంబాన్ని వాసు బారి నుంచి కాపాడాలని వేడుకున్నాడు. -
ప్రాణం తీసిన వడ్డీ వ్యాపారం
♦ నగల కోసం మహిళ హత్య ♦ పోలీసుల అదుపులో నిందితుడు చిత్తూరు అర్బన్ : అధిక వడ్డీలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో వివాహిత మంగళవారం హత్యకు గురైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన రాజలక్ష్మి (44) నికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో నగరంలోని శంకరయ్యగుంటకు చెందిన జయకుమార్ అనే వ్యక్తితో రాజలక్ష్మికి పరిచయమైంది. వ్యాపార నిమిత్తం జయకుమార్ ఐదేళ్ల క్రితం రూ.2 లక్షలను రాజలక్ష్మి వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను తన ఇల్లు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాడు. అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో రాజ్యలక్ష్మి చట్ట ప్రకారం జయకుమార్ ఇంటిని, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సోమవారం రాత్రి రాజలక్ష్మి ఇంటికి వెళ్లిన జయకుమార్ ‘అధిక వడ్డీకి ఇంటిని స్వాధీనం చేసుకున్నావ్.. కనీసం నా భార్య నగలైనా ఇచ్చేయ్’ అని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. భార్యతో కలిసి ఓ వివాహానికి వెళ్లాలని, బంగారు నగలు ఓ సారి ఇస్తే మళ్లీ ఇచ్చేస్తానని చెప్పినా ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం అతను మళ్లీ ఆమె వద్దకు వెళ్లి రాజలక్ష్మితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న లారీ బోల్టులు తీసే రాడ్‌తో రాజలక్ష్మి తలపై కొట్టి చంపేశాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన జయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, టూటౌన్ సీఐ వెంకటప్ప వేలిముద్రల సేకరణ విభాగపు సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారం దందా మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరి వివరాలు సేకరించింది. ఆయనకు తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వాటి క్రయ విక్రయాలు జరుపవద్దని తాజాగా సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని అధికారులను కోరింది. దీంతోపాటు, 2006లో మోహన్‌రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో మోహన్‌రెడ్డికి సంబంధించినవే నాలుగు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు శాఖ ఏఎస్పీ నుంచి హోంగార్డు స్థాయి వరకు 12 మందిపై వేటువేసింది. మరో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోహన్‌రెడ్డిపై పోలీసులు ఇప్పటికే 20కిపైగా కేసులు నమోదు చేశారు. మరోపక్క, మోహన్ రెడ్డి కేసులో ఆరుగురుని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ తో జైలుకు తరలించారు. -
వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం
తిరుపతి: ఆమె పేరు వనజాక్షి. తిరుపతిలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కాలనీలోని పారిశుధ్య కార్మికులకు రూ.100కు రూ.12 వడ్డీ ఒప్పందం ప్రకారం డబ్బులు అప్పుగా ఇచ్చింది. వారికి సంబంధించిన ఏటీఎం కార్డులన్నీ తన వద్దే ఉంచుకుంది. ఇదేంటని ప్రశ్నించిన వారిని తన మనుషులతో దాడి చేయిస్తోంది. బాధితులు సమీపంలోని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వనజాక్షిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వేతనాలతో వడ్డీ వ్యాపారం
* ఏపీ సర్కారు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం * రాష్ట్రంలో 4.30 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు * ఇప్పటికి సీఎఫ్ఎంఎస్లో లెక్కకట్టింది ఐదుగురి వేతనాలే * వరుసగా మూడో నెలా పెరిగిన వేతనాలు ఉద్యోగులకు రావు * నెలకు రూ. 500 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.1500 కోట్లు ఆదా * ఆ రూ.1500 కోట్లపై సర్కారుకు రూ.40 కోట్ల వడ్డీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెరిగిన వేతనాలు వరుసగా మూడో నెలకూడా రాని పరిస్థితి నెలకొంది. పదవ పీఆర్సీ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే ఆ చెల్లింపులను వీలైనన్ని నెలలు జాప్యం చేయడం ద్వారా ఆ వేతనాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అం దులో భాగంగానే పెరిగిన వేతనాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారానే లెక్క కట్టడం, చెల్లింపు చేయడం చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోలో మెలిక పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 4.30 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఇప్పటికి కేవలం ప్రణాళిక శాఖలోని ఐదుగురు ఉద్యోగుల వేతనాలను మాత్రం సీఎఫ్ఎంఎస్లో లెక్క కట్టగలిగారు. కానీ వేతనాల చెల్లింపు మాత్రం తిరిగి ట్రెజరీ సాఫ్ట్వేర్ ద్వారానే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఏప్రిల్ నెలలో పెరిగిన వేతనాలు మే 1వ తేదీన ఉద్యోగులకు రావాల్సి ఉంది. అలాగే ఏప్రిల్‌లో రానందున ఆ నెలతోపాటు మే నెలకు సంబంధించి పెరిగిన వేతనాలు జూన్ 1వ తేదీన ఉద్యోగులకు రావాల్సి ఉంది. అయినప్పటికీ పెరిగిన వేతనాలు ఉద్యోగులకు అందలేదు. ఇందుకు ప్రధాన కారణం సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ పనిచేయకపోవడమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను ఇప్పటివరకు పరీక్షించలేదు. ఇటువంటి వ్యవస్థ పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఉంది. అయితే పరీక్షించని వ్యవస్ధ ద్వారా ప్రయోగం చేసి ఉద్యోగుల పెరిగిన వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం తగదనే భావనతో తెలంగాణ సర్కారు ట్రెజరీ సాఫ్ట్వేర్ ద్వారానే ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను 2.65 లక్షల ఉద్యోగులకు చెల్లించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వీలైనన్ని నెలలు పెరిగిన వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్కో నెల పెరిగిన వేతనాలకు 500 కోట్ల రూపాయలను చెల్లిం చాల్సి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పెరిగిన వేతనాలను చెల్లించలేదు. ఇప్పుడు జూన్ నెల వేతనాలను కూడా వచ్చే నెల 1వ తేదీన చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాలో 1500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. తద్వారా 8 శాతం వడ్డీ వేసుకుంటే 40 కోట్ల రూపాయలు వస్తోందని, అందుకే మరిన్ని నెలలు జాప్యం చేయాలని సర్కారు చూస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖలో పనిచేసే 167 మంది ఉద్యోగుల వివరాలను, పెరిగిన వేతన వివరాలను సీఎఫ్‌ఎంస్‌లో నమోదు చేసినప్పటికీ తప్పులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ సీఎఫ్ఎంఎస్ ద్వారానే పెరిగిన ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని పట్టుపట్టడంతో జాప్యం తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ పెరిగిన వేతనాలను గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు ట్రెజరీ సాఫ్ట్వేర్ ద్వారా ఇస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే భావన కలుగుతోందని విమర్శిస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.8 కోట్లకు టోపీ
లబోదిబోమంటున్న బాధితులు ఒంగోలు క్రైం : దశరాజుపల్లికు చెందిన శేషయ్య అనే వ్యక్తి పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అనేక మందితో పరిచయాలు పెంచుకుని చిట్టీలు కట్టించాడు. ఏడాదిగా అతను చీటీ పాటల్లో సభ్యులుగా ఉన్నవారికి పాడిన సమయానికి సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. వడ్డీ వ్యాపారం పేరిట కూడా అనేక మందిని నిలువునా ముంచినట్లు తెలుస్తోంది. శుక్రవారం పెళ్లికి వెళ్లివస్తానని చెప్పి కుటుంబ సభ్యులతో సహా మాయమయ్యాడు. పదేళ్ల క్రితం అతను చిన్న చిన్న చీటీ పాటలతో మొదలుపెట్టిన వ్యాపారం ఒక్కసారిగా రూ.కోటి చీటీ వేసే స్థాయికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం రూ.కోటి వరకు చిట్టీలు రెండు, రూ.50 లక్షలవి ఆరు, రూ.25 లక్షలవి ఐదు చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది అతనికి కూడా బాకీ ఉన్నట్లు తేలింది. అయినా వ్యాపారాన్ని కొనసాగించడంలో భాగంగా రూ.10 వడ్డీకి కూడా అందినకాడికి అప్పు తీసుకున్నట్లు సమాచారం. తీరా కోట్లాది రూపాయలు వెనకేసుకుని తెచ్చిన అప్పులు, వడ్డీ కూడా ఇవ్వకుండా చిట్టీలు పాడిన వారికి డబ్బులు చెల్లించకుండా గ్రామం నుంచే ఉడాయించాడు. దీంతో అతని వద్ద చిట్టీలు వేసిన బాధితులు, వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు తలలు పట్టుకుంటున్నారు. అతని ఖాతాదారులందరూ ఒంగోలు నగరానికి చెందినవారు కావడమే విశేషం. స్థానిక బీవీఎస్ హాలు సమీపంలో న్యూడిల్స్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తికే రూ.40 లక్షలు ఎగనామం పెట్టినట్లు సమాచారం. స్థానిక కమ్మపాలేనికి చెందిన బాధితులు 100 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇంట్లోనే ఇద్దరు సోదరులకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. బాధితులు దశరాజుపల్లికి వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు. ఇదిలా ఉండగా చిట్టీల నిర్వాహకుడు కొంత మందికి న్యాయవాది ద్వారా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసినట్లు కూడా సమాచారం. దీంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. -
ఘరానా దొంగలు
సాక్షి, ముంబై : చోరీ సొత్తుతో జల్సాలు చేసే దొంగలను చూశాం.. ఇంకా ఎన్నో సంఘవిద్రోహక కార్యకలాపాలకు వినియోగించేవారి గురించి విన్నాం. కానీ ఈ దొంగలు మాత్రం అందుకు భిన్నం. ఇళ్లలోని విలువైన వస్తువులను లూటీ చేసి విక్రయించగా వచ్చిన సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తూ దర్జాగా నెలకు లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగర నేర విభాగం అధికారులు 20 కేసులకు పైబడి నమోదైన ఇద్దరు వ్యక్తులను ఇటీవలె అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి...ఈ ఇద్దరు చోరులను ముంబ్రాకు చెందిన పరుశురాం శేండ్గే (30), వర్సోవాకు చెందిన దీపక్ పటాన్కర్‌గా పోలీసులు గుర్తించారు (20). ఈ ఇద్దరు నగరంలో చాలా ఇళ్లను కొళ్లగొట్టారు. చోరీ చేసిన సొమ్మును వడ్డీకి ఇస్తుంటారు. ఇలా నెలకు కనీసం రూ. లక్షల వడ్డీని సంపాదిస్తున్నారు. అన్ క్లైమ్డ్ మెయిల్ బాక్సులు, ఇంటి ముందు న్యూస్ పేపర్లు పడి ఉండడాన్ని గమనించి సదరు ఇళ్లలో చోరీలకు పాల్పడడంలో ఈ చోరులు దిట్ట. ఇంట్లో ఎవ్వరూ లేనిది చూసి ఇంట్లోకి చొరబడి కేవలం 10 నిమిషాలలో ఇళ్లను ఖాళీ చేస్తారు. వీరు చాలా చలాకీగా వ్యవహరించడమే కాకుండా చోరీలు చేయడంలో ఎంతో నేర్పరితనం కలిగిన వారుగా పోలీసులు పేర్కొన్నారు. జైలు నండి విడుదలయ్యాక ముమ్మరం పరుశురాం 2005లో నేరం చేసిన కేసులో అరెస్టు కాగా, 2006లో విడుదల అయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన కొన్ని రోజుల వరకు చోరీలు చేయడాన్ని మానేశాడు. కానీ త్వరలోనే తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. డీసెంట్ అయిన దుస్తులు వేసుకొని కేబుల్ ఆపరేటర్‌గా లేదా ఎంటీఎన్ఎల్ ఉద్యోగిగా అందరిని నమ్మించేవాడు. ఇలా బిల్డింగ్‌లోపలికి వెళ్లి చోరీలు చేసేవాడని ముంబై క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. ప్రసన్న తెలిపారు. ఇద్దరూ కలిసి ఒక్కసారి భవనాలలోకి ప్రవేశించారంటే తమ లక్ష్యం నెరవేరాల్సిందే. చాలా రోజుల నుంచి పడి ఉన్న న్యూస్ పేపర్లు, పూల మొక్కలను బాగా పరిశీలించేవారు. తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేరని గ్రహించి ఇనుప చువ్వలను ఉపయోగించి తాళాలను పగులగొట్టేవారు. తర్వాత ఇంట్లోకి ప్రవేశించి కొన్ని నిమిషాలలో విలువైన వస్తువులను కాజేసేవారు. 2011 నుంచి సాంతక్రూజ్, జూహూ, ఖార్, బాంద్రాలలో ఇలా 40 ఇళ్లను కొల్లగొట్టినట్లు దుండగులు తెలిపారు. తాము ఇతర ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నామనీ, కానీ ఇప్పటి వరకు కేవలం 20 కేసులను మాత్రమే ఛేదించామని క్రైంబ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్ భోస్లే తెలిపారు. ఈ చోరులు కేవలం చోరీ చేయడమే కాకుండా దొంగిలించిన వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు, చోరీ చేసిన డబ్బును రెండు శాతం వడ్డీకి ఇతరులకు ఇస్తారని తెలిపారు. వీరు అరెస్టు అయిన సమయంలో రూ.50 లక్షలను చాలా మందికి రెండు శాతం వడ్డీ చొప్పున ఇచ్చారని తేలిందని ప్రఫుల్ భోస్లే తెలిపారు.