సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వడ్డీ వ్యాపారం చేయాలంటే ఇకపై తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీకే అప్పులు ఇవ్వాలి. అధిక వడ్డీలు వసూలు చేసినా, అక్రమాలకు పాల్పడినా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు ఏపీ వడ్డీ వ్యాపారుల చట్టం (క్రమబద్ధీకరణ) సంబంధిత బిల్లును ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిరోధించేందుకు 2000 సంవత్సరంలోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ చట్టంగా రూపుదిద్దుకోలేదు.
ఆ తరువాత 2015లో వడ్డీ వ్యాపారుల బిల్లును శాసనసభ అమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా బిల్లును తిరిగి పరిశీలించాలంటూ రాష్ట్రానికి తిప్పి పంపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకురావడానికి వీలుగా బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అయితే ఒకపక్క చట్టం తీసుకువస్తూనే మరోపక్క.. ప్రభుత్వం కావాలనుకున్న వడ్డీ వ్యాపారులకు సదరు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే వెసులుబాటును ఇదే బిల్లులో కల్పించడం గమనార్హం.
బిల్లులోని మరికొన్ని అంశాలు..
వడ్డీ వ్యాపారానికి లైసెన్సు కావాలంటే ఆ వ్యాపారం స్థాయి ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోపల సంబందిత అధికారి లైసెన్సు మంజూరు చేయవచ్చు లేదా దరఖాస్తును నిరాకరించవచ్చు. దరఖాస్తుదారు మోసం చేసే దురుద్దేశంతో ఉన్నాడని భావిస్తే లైసెన్సును నిరా>కరించవచ్చు. లైసెన్సు కాలవ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. ప్రతి వడ్డీ వ్యాపారి తన దుకాణం లేదా వ్యాపార స్థలంలో.. వడ్డీ వ్యాపారిగా తన పేరును ప్రాంతీయ భాషలో ప్రదర్శించాలి. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు గరిష్ట వడ్డీ రేటును వ్యాపారి వసూలు చేసుకోవచ్చు. వడ్డీ వ్యాపారి తాను ఇచ్చిన అప్పునకు సంబంధించి రావలసిన డబ్బును లేదా ఆస్తిని పూర్తిగా లేదా పాక్షికంగా స్వీకరించేందుకు నిరాకరించినప్పుడు, రుణ గ్రహీత సదరు అప్పును లేదా ఆస్తిని అధీకృత న్యాయస్థానంలో డిపాజిట్ చేయవచ్చు.
హామీ గల, హామీ లేని అప్పులకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ధారిస్తుంది. నిర్ధారించిన వడ్డీ రేట్లను ఆవరణలో ప్రముఖంగా కన్పించేలా ప్రదర్శించాలి. వడ్డీ వ్యాపారి ఏదేని అప్పునకు సంబంధించి అసలు మొత్తానికి మించి వడ్డీ రూపంలో వసూలు చేయరాదు. అసలు అప్పునకు సమానంగా లేదా దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్లయితే ఆ అప్పును తీర్చినట్లుగానే భావించాలి. ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ వ్యాపారి అప్పు తీసుకున్న వారికి తిరిగి చెల్లించాలి. వడ్డీ వ్యాపారి ఖాతా పుస్తకాలను నిర్వహించాలి. లైసెన్సింగ్ అధికారుల తనిఖీ నిమిత్తం వాటిని అందుబాటులో ఉంచాలి. ఖాతాలను సంవత్సరానికి కనీసం ఒకసారి ఆడిట్ చేయించాలి.
అధిక వడ్డీ వసూలు చేస్తే జైలు
నిర్ధారిత వడ్డీ రేట్లను కాకుండా వ్యాపారులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తే ఏడాది లేదా గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు లేదా వాటికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు వీలుగా న్యాయస్థానానికి ప్రత్యేక హోదా కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో అధిసూచన ద్వారా, తాము ఉచితమని భావించిన వడ్డీ వ్యాపారులకు షరతులకు లోబడి ఈ చట్టానికి చెందిన అన్ని లేదా ఏవైనా కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు.
డిపాజిట్ వివరాలు...
ఏడాదిలో లక్ష రూపాయలకు మించని మొత్తాన్ని అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. రూ.లక్షకు మించి రూ.5 లక్షల లోపు అప్పులిచ్చే పక్షంలో రూ.10 వేలు, రూ.5 లక్షలకు మించి రూ.10 లక్షల లోపు మొత్తమైతే రూ.50 వేలు డిపాజిట్ చేయాలి. ఏడాదిలో రూ.10 లక్షలకు మించి రూ.25 లక్షల లోపు అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.లక్ష, రూ.25 లక్షలకు మించి రూ.50 లక్షలకు లోపు మొత్తమైతే రూ.1.5 లక్షలు, రూ.50 లక్షలకు మించి అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి.
వడ్డీ వ్యాపారానికి లైసెన్సు తప్పనిసరి
Published Wed, Nov 15 2017 3:15 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment