వేతనాలతో వడ్డీ వ్యాపారం | Salaries to make an Interest business | Sakshi
Sakshi News home page

వేతనాలతో వడ్డీ వ్యాపారం

Published Mon, Jun 22 2015 1:37 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

వేతనాలతో వడ్డీ వ్యాపారం - Sakshi

వేతనాలతో వడ్డీ వ్యాపారం

* ఏపీ సర్కారు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం
* రాష్ట్రంలో 4.30 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు
* ఇప్పటికి సీఎఫ్‌ఎంఎస్‌లో లెక్కకట్టింది ఐదుగురి వేతనాలే
* వరుసగా మూడో నెలా పెరిగిన వేతనాలు ఉద్యోగులకు రావు
* నెలకు రూ. 500 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.1500 కోట్లు ఆదా
* ఆ రూ.1500 కోట్లపై సర్కారుకు రూ.40 కోట్ల వడ్డీ

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెరిగిన వేతనాలు వరుసగా మూడో నెలకూడా రాని పరిస్థితి నెలకొంది. పదవ పీఆర్సీ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే ఆ చెల్లింపులను వీలైనన్ని నెలలు జాప్యం చేయడం ద్వారా ఆ వేతనాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అం దులో భాగంగానే పెరిగిన వేతనాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారానే లెక్క కట్టడం, చెల్లింపు చేయడం చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోలో మెలిక పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 4.30 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఇప్పటికి కేవలం ప్రణాళిక శాఖలోని ఐదుగురు ఉద్యోగుల వేతనాలను మాత్రం సీఎఫ్‌ఎంఎస్‌లో లెక్క కట్టగలిగారు. కానీ వేతనాల చెల్లింపు మాత్రం తిరిగి ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారానే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఏప్రిల్ నెలలో పెరిగిన వేతనాలు మే 1వ తేదీన ఉద్యోగులకు రావాల్సి ఉంది. అలాగే ఏప్రిల్‌లో రానందున ఆ నెలతోపాటు మే నెలకు సంబంధించి పెరిగిన వేతనాలు జూన్ 1వ తేదీన ఉద్యోగులకు రావాల్సి ఉంది. అయినప్పటికీ పెరిగిన వేతనాలు ఉద్యోగులకు అందలేదు. ఇందుకు ప్రధాన కారణం సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ పనిచేయకపోవడమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
  సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను ఇప్పటివరకు పరీక్షించలేదు. ఇటువంటి వ్యవస్థ పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఉంది. అయితే పరీక్షించని వ్యవస్ధ ద్వారా ప్రయోగం చేసి ఉద్యోగుల పెరిగిన వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం తగదనే భావనతో తెలంగాణ సర్కారు ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారానే ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను 2.65 లక్షల ఉద్యోగులకు చెల్లించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వీలైనన్ని నెలలు పెరిగిన వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్కో నెల పెరిగిన వేతనాలకు 500 కోట్ల రూపాయలను చెల్లిం చాల్సి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పెరిగిన వేతనాలను చెల్లించలేదు. ఇప్పుడు జూన్ నెల వేతనాలను కూడా వచ్చే నెల 1వ తేదీన చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాలో 1500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. తద్వారా 8 శాతం వడ్డీ వేసుకుంటే 40 కోట్ల రూపాయలు వస్తోందని, అందుకే మరిన్ని నెలలు జాప్యం చేయాలని సర్కారు చూస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖలో పనిచేసే 167 మంది ఉద్యోగుల వివరాలను, పెరిగిన వేతన వివరాలను సీఎఫ్‌ఎంస్‌లో నమోదు చేసినప్పటికీ తప్పులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే పెరిగిన ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని పట్టుపట్టడంతో జాప్యం తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ పెరిగిన వేతనాలను గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే భావన కలుగుతోందని విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement