రాజలక్ష్మి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ ( రాజలక్ష్మి )
♦ నగల కోసం మహిళ హత్య
♦ పోలీసుల అదుపులో నిందితుడు
చిత్తూరు అర్బన్ : అధిక వడ్డీలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో వివాహిత మంగళవారం హత్యకు గురైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన రాజలక్ష్మి (44) నికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో నగరంలోని శంకరయ్యగుంటకు చెందిన జయకుమార్ అనే వ్యక్తితో రాజలక్ష్మికి పరిచయమైంది. వ్యాపార నిమిత్తం జయకుమార్ ఐదేళ్ల క్రితం రూ.2 లక్షలను రాజలక్ష్మి వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను తన ఇల్లు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాడు. అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో రాజ్యలక్ష్మి చట్ట ప్రకారం జయకుమార్ ఇంటిని, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది.
సోమవారం రాత్రి రాజలక్ష్మి ఇంటికి వెళ్లిన జయకుమార్ ‘అధిక వడ్డీకి ఇంటిని స్వాధీనం చేసుకున్నావ్.. కనీసం నా భార్య నగలైనా ఇచ్చేయ్’ అని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. భార్యతో కలిసి ఓ వివాహానికి వెళ్లాలని, బంగారు నగలు ఓ సారి ఇస్తే మళ్లీ ఇచ్చేస్తానని చెప్పినా ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం అతను మళ్లీ ఆమె వద్దకు వెళ్లి రాజలక్ష్మితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న లారీ బోల్టులు తీసే రాడ్‌తో రాజలక్ష్మి తలపై కొట్టి చంపేశాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన జయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, టూటౌన్ సీఐ వెంకటప్ప వేలిముద్రల సేకరణ విభాగపు సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.