జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్టీలు, వడ్డీ వ్యాపారం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. దీంతో ఆయా వ్యాపారాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. శుక్రవారం జిల్లాలోని 31 మండలాలు, ప్రధాన పట్టణాల్లో పోలీస్‌లు, నిఘా విభాగం అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున నగదు, విలువైన డాక్యుమెంట్లు, ముందస్తు సంతకాలు చేసిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్థిరాస్తి డాక్యుమెంట్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు రెండు రోజులుగా దాడులు నిర్వహించి 51 మందిపై కేసులు నమోదు చేశారు. చెక్కులు, ఏటీఎంలు, ప్రామిసరీ నోట్లు, బాండ్‌పత్రాల్లో మొత్తం 51,203మంది బాధితుల జీవితాలు బంధీగా ఉన్నాయని ప్రాథమికంగా తేలినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.
నల్లగొండ క్రైం : నగదు వ్యాపారం చేస్తూ చిరు వ్యాపారులు, అత్యవసరానికి డబ్బు తీసుకున్న ఇతరులనుంచి అత్యధిక వడ్డీలను వసూలు చేస్తున్న వారి నడ్డిని పోలీసులు విరగ్గొడుతున్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా అమాయక ప్రజలను జలగల్లా పీడిస్తున్న వారి కోరలు పీకుతున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీవ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రధానంగా దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ లాంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో సాగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారంపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి.
నగదు దందా ఇలా..
చిరు వ్యాపారుల జీవన విధానాన్ని సొమ్ము చేసుకునేందుకు వడ్డీ వ్యాపారులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఆటోఫైనాన్స్‌లు నెల వారి చిట్టీలు, లక్కీ డ్రాలతో అనేకమంది ప్రజలను నట్టే ట ముంచుతున్నారు. డబ్బులు ఇవ్వడం ఆలస్యమైతే వారి కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా అవమానించడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఓ కిరాణవ్యాపారి కుటుంబం, మిర్యాలగూడలో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ముందస్తుగా బాండ్లు చెక్కులు....
వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా రుణం తీసుకునేవారి నుంచి సంతకంతో కూడిన ఖాళీ చెక్కులను తీసుకుంటారు. అదే విధంగా ప్రామిసరీ నోట్లు, స్థిరాస్తులకు సంబంధించిన బాండ్ పేపర్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో రుణం తీసుకున్నవారు వడ్డీ వ్యాపారస్తుల చేతులో కీలు బొమ్మగా మారుతున్నారు. వారికి సంపాదించి పెట్టే కూలీలవుతున్నారు. చివరికు వారి కుటుంబ పోషణను దీనంగా నెట్టుకొస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు..
వడ్డీ వ్యాపారాలపై వరుస ఫిర్యాదులతో జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో 51 మంది వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు. దేవరకొండ డివిజన్‌లో 18 మందిపై కేసు నమోదు చేయగా రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో 14 మందిపై, నల్లగొండ డివిజన్‌లో 19 మందిపై కేసు నమోదు చేశారు. మొత్తంగా 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
విలువైన పత్రాలు స్వాధీనం...
జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో 10 వేల ప్రామీసరీ నోట్లు, 3500 చెక్కులు, 1000 ఏటీఎం కార్డులు, 2,300 బాండు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అ«ధికార వర్గాల సమాచారం. మొత్తం స్వాధీనం చేసుకున్న పత్రాల్లో 50 వేల కుటుంబాలకు పైగా వడ్డీ వ్యాపారుల చేతుల్లో బంధీలుగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. భారీ ఎత్తున నివురుగప్పిన నిప్పులా సాగుతున్న ఆర్థిక వ్యాపారాన్ని పోలీసులు మిర్యాలగూడ, నల్లగొండ ఆత్మహత్య సంఘటనతో కూపీలాగి కట్టడి చేసేందుకు వ్యూహం పన్నారు.
మీటర్ కటింగ్ అంటే..
లక్ష రూపాయలు మీటర్ కటింగ్ (ఎంసీ) తీసుకున్న చిరు వ్యాపారి మూడు నెలల్లో (వంద రోజులు) రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం చెల్లించినా మొదట తీసుకున్న లక్షల రూపాయలు అలాగే ఉండటం వల్ల వాటిని ఒకేసారి చెల్లించాలి. అంటే లక్ష రూపాయలకు రోజు వడ్డీ వెయ్యి రూపాయలు వసూలు చేస్తారన్నమాట.
బారా కటింగ్ అంటే..
బారా కటింగ్ (బీసీ)కింద లక్ష రూపాయలు తీసుకున్న వ్యాపారి మూడు నెలల్లో (వంద రోజులు) రోజూ వెయ్యి చెల్లించాలి. దానికి సంబంధించి వడ్డీ మొదట్లోనే కట్ చేసుకుంటాడు. అంటే లక్ష రూపాయల బీసీ తీసుకుంటే 85 వేల రూపాయలు మాత్రమే ఇస్తారు. వంద రోజుల్లో చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తారు.
అక్రమ వడ్డీ వ్యాపారం సహిచం..
జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనం గడపని చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు ఆత్మహత్యల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు తమ భవిష్యత్ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలను దృష్టిలో పెట్టుకుని చిట్టీల వ్యాపారుల దాచి పెట్టుకుంటున్నారు. ఆర్థిక నేరగాళ్లు రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయడంతో దాచిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇక అవసరానికి డబ్బు తీసుకుంటే మందస్తుగా విలువైన పత్రాలు తీసుకుంటున్నారు. ఇక డబ్బు చెల్లించలేని పరిస్థితి వస్తే వ్యాపారుల తీరుతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్రమ వ్యాపారాలను కట్టడి చేస్తాం. స్వా«ధీనం చేసుకున్న డాక్యుమెంట్ ఆధారంగా 50 వేల కుటుంబాలు వడ్డీ వ్యాపారుల చేతుల్లో ఉన్నట్లు భావిస్తున్నాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్పీ రంగనాథ్
Comments
Please login to add a commentAdd a comment