ఘరానా దొంగలు
సాక్షి, ముంబై : చోరీ సొత్తుతో జల్సాలు చేసే దొంగలను చూశాం.. ఇంకా ఎన్నో సంఘవిద్రోహక కార్యకలాపాలకు వినియోగించేవారి గురించి విన్నాం. కానీ ఈ దొంగలు మాత్రం అందుకు భిన్నం. ఇళ్లలోని విలువైన వస్తువులను లూటీ చేసి విక్రయించగా వచ్చిన సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తూ దర్జాగా నెలకు లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగర నేర విభాగం అధికారులు 20 కేసులకు పైబడి నమోదైన ఇద్దరు వ్యక్తులను ఇటీవలె అరెస్టు చేసింది.
ఈ క్రమంలో ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి...ఈ ఇద్దరు చోరులను ముంబ్రాకు చెందిన పరుశురాం శేండ్గే (30), వర్సోవాకు చెందిన దీపక్ పటాన్కర్‌గా పోలీసులు గుర్తించారు (20). ఈ ఇద్దరు నగరంలో చాలా ఇళ్లను కొళ్లగొట్టారు. చోరీ చేసిన సొమ్మును వడ్డీకి ఇస్తుంటారు. ఇలా నెలకు కనీసం రూ. లక్షల వడ్డీని సంపాదిస్తున్నారు. అన్ క్లైమ్డ్ మెయిల్ బాక్సులు, ఇంటి ముందు న్యూస్ పేపర్లు పడి ఉండడాన్ని గమనించి సదరు ఇళ్లలో చోరీలకు పాల్పడడంలో ఈ చోరులు దిట్ట. ఇంట్లో ఎవ్వరూ లేనిది చూసి ఇంట్లోకి చొరబడి కేవలం 10 నిమిషాలలో ఇళ్లను ఖాళీ చేస్తారు. వీరు చాలా చలాకీగా వ్యవహరించడమే కాకుండా చోరీలు చేయడంలో ఎంతో నేర్పరితనం కలిగిన వారుగా పోలీసులు పేర్కొన్నారు.
జైలు నండి విడుదలయ్యాక ముమ్మరం
పరుశురాం 2005లో నేరం చేసిన కేసులో అరెస్టు కాగా, 2006లో విడుదల అయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన కొన్ని రోజుల వరకు చోరీలు చేయడాన్ని మానేశాడు. కానీ త్వరలోనే తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. డీసెంట్ అయిన దుస్తులు వేసుకొని కేబుల్ ఆపరేటర్‌గా లేదా ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగిగా అందరిని నమ్మించేవాడు. ఇలా బిల్డింగ్‌లోపలికి వెళ్లి చోరీలు చేసేవాడని ముంబై క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. ప్రసన్న తెలిపారు.
ఇద్దరూ కలిసి ఒక్కసారి భవనాలలోకి ప్రవేశించారంటే తమ లక్ష్యం నెరవేరాల్సిందే. చాలా రోజుల నుంచి పడి ఉన్న న్యూస్ పేపర్లు, పూల మొక్కలను బాగా పరిశీలించేవారు. తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేరని గ్రహించి ఇనుప చువ్వలను ఉపయోగించి తాళాలను పగులగొట్టేవారు. తర్వాత ఇంట్లోకి ప్రవేశించి కొన్ని నిమిషాలలో విలువైన వస్తువులను కాజేసేవారు. 2011 నుంచి సాంతక్రూజ్, జూహూ, ఖార్, బాంద్రాలలో ఇలా 40 ఇళ్లను కొల్లగొట్టినట్లు దుండగులు తెలిపారు.
తాము ఇతర ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నామనీ, కానీ ఇప్పటి వరకు కేవలం 20 కేసులను మాత్రమే ఛేదించామని క్రైంబ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్ భోస్లే తెలిపారు. ఈ చోరులు కేవలం చోరీ చేయడమే కాకుండా దొంగిలించిన వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు, చోరీ చేసిన డబ్బును రెండు శాతం వడ్డీకి ఇతరులకు ఇస్తారని తెలిపారు. వీరు అరెస్టు అయిన సమయంలో రూ.50 లక్షలను చాలా మందికి రెండు శాతం వడ్డీ చొప్పున ఇచ్చారని తేలిందని ప్రఫుల్ భోస్లే తెలిపారు.