లబోదిబోమంటున్న బాధితులు
ఒంగోలు క్రైం : దశరాజుపల్లికు చెందిన శేషయ్య అనే వ్యక్తి పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అనేక మందితో పరిచయాలు పెంచుకుని చిట్టీలు కట్టించాడు. ఏడాదిగా అతను చీటీ పాటల్లో సభ్యులుగా ఉన్నవారికి పాడిన సమయానికి సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. వడ్డీ వ్యాపారం పేరిట కూడా అనేక మందిని నిలువునా ముంచినట్లు తెలుస్తోంది. శుక్రవారం పెళ్లికి వెళ్లివస్తానని చెప్పి కుటుంబ సభ్యులతో సహా మాయమయ్యాడు. పదేళ్ల క్రితం అతను చిన్న చిన్న చీటీ పాటలతో మొదలుపెట్టిన వ్యాపారం ఒక్కసారిగా రూ.కోటి చీటీ వేసే స్థాయికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం రూ.కోటి వరకు చిట్టీలు రెండు, రూ.50 లక్షలవి ఆరు, రూ.25 లక్షలవి ఐదు చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కొంత మంది అతనికి కూడా బాకీ ఉన్నట్లు తేలింది. అయినా వ్యాపారాన్ని కొనసాగించడంలో భాగంగా రూ.10 వడ్డీకి కూడా అందినకాడికి అప్పు తీసుకున్నట్లు సమాచారం. తీరా కోట్లాది రూపాయలు వెనకేసుకుని తెచ్చిన అప్పులు, వడ్డీ కూడా ఇవ్వకుండా చిట్టీలు పాడిన వారికి డబ్బులు చెల్లించకుండా గ్రామం నుంచే ఉడాయించాడు. దీంతో అతని వద్ద చిట్టీలు వేసిన బాధితులు, వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు తలలు పట్టుకుంటున్నారు. అతని ఖాతాదారులందరూ ఒంగోలు నగరానికి చెందినవారు కావడమే విశేషం.
స్థానిక బీవీఎస్ హాలు సమీపంలో న్యూడిల్స్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తికే రూ.40 లక్షలు ఎగనామం పెట్టినట్లు సమాచారం. స్థానిక కమ్మపాలేనికి చెందిన బాధితులు 100 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇంట్లోనే ఇద్దరు సోదరులకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. బాధితులు దశరాజుపల్లికి వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు. ఇదిలా ఉండగా చిట్టీల నిర్వాహకుడు కొంత మందికి న్యాయవాది ద్వారా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసినట్లు కూడా సమాచారం. దీంతో బాధితులు బోరున విలపిస్తున్నారు.
చిట్టీల పేరుతో రూ.8 కోట్లకు టోపీ
Published Tue, Aug 26 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement
Advertisement