పటేల్‌నగర్‌లోని అంజలి నివాసం
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పాతికేళ్లుగా చిట్టీల వ్యాపారం చేసే వ్యక్తి మోసం చేస్తారని ఎవరైనా ఊహించగలరా..? కానీ, ఓ కి‘లేడీ’నమ్మించి నట్టేట ముంచింది. చిట్టీలు ఎగ్గొట్టి చిక్క కుండా పోయింది. ఆ చిట్టీల విలువ ఎంతంటే.. అక్షరాలా రూ.15 కోట్లు. బాధితులు వందమంది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన బాబురావు, ఆయన భార్య అంజలి బండ్లగూడ పటేల్‌నగర్‌లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. 25 ఏళ్లుగా అంజలి చిట్టీల వ్యాపారం చేస్తోంది.
ఎవరెవరిని మోసం చేసిందంటే..
ఆమె వద్ద పలువురు స్థానికులు, చిరుద్యోగులు, ఉద్యోగులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వివిధ మొత్తాలకు చిట్టీలు వేశారు. అంజలి తనకు తెలిసిన వారి వద్ద 1 శాతం వడ్డీకి డబ్బులు తీసుకొని ఇతరులకు ఎక్కువ శాతానికి కూడా ఇచ్చేవారు. నాలుగు రోజుల నుంచి అంజలి ఇంటికి తాళం వేసి ఉండటంతోపాటు ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. ఈ విషయమై ఆ నోట ఈ నోట తెలియడంతో బాధితులు శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
అందరికీ కలిపి రూ.15 కోట్లకుపైగా చిట్టీల డబ్బులు చెల్లించాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్‌కు విన్నవించగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. స్థానిక బస్తీల ప్రజలే కాకుండా సీఆర్‌పీఎఫ్ క్యాంపస్ ఉద్యోగులు కూడా ఈమె వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. వారంతా బయటికి వస్తే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment