Chitti Business
-
ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి..
నగరి(చిత్తూరు జిల్లా): మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇక్కట్లతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరి పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆనం లలితా లేఅవుట్లో నివసిస్తున్న గౌరీ యూనియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది. భర్త శివనాగభాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడే ఉంటోంది. వీరిద్దరూ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఆమె డ్యూటీకి రాకపోవడంతో ఇంటి వద్ద చూసిరావాలని సిబ్బందిని పంపగా ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ సమాచారం మేరకు డీఎస్పీ యశ్వంత్, సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. ఉద్యోగాల రీత్యా పెళ్లయిన ఆరు నెలల నుంచి కలిసి కాపురం చేయలేకపోతున్నామనే ఆవేదన, బదిలీకి ప్రయతి్నంచినా నాలుగేళ్లుగా సఫలీకృతం కాలేదనే బాధ, బిజీగా ఉంటే కష్టాలు మరచిపోవచ్చంటూ చిట్టీలు ప్రారంభిస్తే కోవిడ్ లాక్‌డౌన్‌తో రెట్టింపైన కష్టాలు.. బాకీలు తీర్చాలంటూ బకాయి పడ్డవారి బెదిరింపులు, బ్యాంకు రుణం మంజూరుచేసి రుణ విముక్తి కల్పించలేదంటూ బ్యాంకు అధికారులపై కోపం వెరసి దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో కూలీల కుటుంబంలో పుట్టిన గౌరీ(25) కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సాధించింది. ఆమెకు కడప జిల్లా వీరప్పనాయనిరెడ్డి పాళెంకు చెందిన శివనాగభాస్కర్ రెడ్డి(32)తో వివాహమై ఐదేళ్లయింది. ఇతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వివాహమైన ఆరు నెలలకే గౌరీకి యూనియన్ బ్యాంక్(ఆంధ్రబ్యాంక్) నగరి బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇక్కడ ఉద్యోగంలో చేరి లలితా లేఅవుట్లో అద్దె ఇంట్లో ఉన్నారు. అప్పటి నుంచి భార్యా భర్తలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉంటూ కాపురం నెట్టుకొచ్చారు. ఈ అంశం వారిద్దరినీ మానసికంగా ఆవేదనకు గురిచేసింది. నాలుగేళ్లుగా బదిలీ కోసం బ్యాంకు ఉన్నతాధి కారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో కృత్తిక(4), కుసుమంత్ రెడ్డి(1) అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కృత్తిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోలేకపోతున్నామనే బాధ వారిని వేధించింది. అప్పుల ఊబిలో.. ఈ కష్టాలు మరిచిపోవాలంటే బిజీగా ఉండాలని తలచిన శివనాగభాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఈ దశలో కోవిడ్ లాక్డౌన్ రావడంతో చిట్టీల నిర్వహణ అస్తవ్యస్తమై ఆర్థికపరమైన సమస్యల్లో కూరుకుపోయాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద భూముల దస్తావేజులు ఉంచి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం నగరికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. చిట్టీల్లో బకాయి ఉండడంతో వారంతా అతన్ని వెతుక్కుంటూ నగరికి రావడం మొదలుపెట్టారు. బ్యాంకుకు వెళ్లి గౌరీని కూడా బెదిరించారు. బ్యాంకులో రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల ఊబి నుంచి బయటపడదామనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పిల్లలను పది రోజుల క్రితమే కడప జిల్లా పర్వరాజపేటలోని మేనత్త ఇంటికి పంపించేశారు. చివరకు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరూ తనువు చాలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
15 కోట్ల చీటింగ్
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పాతికేళ్లుగా చిట్టీల వ్యాపారం చేసే వ్యక్తి మోసం చేస్తారని ఎవరైనా ఊహించగలరా..? కానీ, ఓ కి‘లేడీ’నమ్మించి నట్టేట ముంచింది. చిట్టీలు ఎగ్గొట్టి చిక్క కుండా పోయింది. ఆ చిట్టీల విలువ ఎంతంటే.. అక్షరాలా రూ.15 కోట్లు. బాధితులు వందమంది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన బాబురావు, ఆయన భార్య అంజలి బండ్లగూడ పటేల్‌నగర్‌లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. 25 ఏళ్లుగా అంజలి చిట్టీల వ్యాపారం చేస్తోంది. ఎవరెవరిని మోసం చేసిందంటే.. ఆమె వద్ద పలువురు స్థానికులు, చిరుద్యోగులు, ఉద్యోగులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వివిధ మొత్తాలకు చిట్టీలు వేశారు. అంజలి తనకు తెలిసిన వారి వద్ద 1 శాతం వడ్డీకి డబ్బులు తీసుకొని ఇతరులకు ఎక్కువ శాతానికి కూడా ఇచ్చేవారు. నాలుగు రోజుల నుంచి అంజలి ఇంటికి తాళం వేసి ఉండటంతోపాటు ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. ఈ విషయమై ఆ నోట ఈ నోట తెలియడంతో బాధితులు శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అందరికీ కలిపి రూ.15 కోట్లకుపైగా చిట్టీల డబ్బులు చెల్లించాల్సి ఉందని ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్‌కు విన్నవించగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. స్థానిక బస్తీల ప్రజలే కాకుండా సీఆర్పీఎఫ్ క్యాంపస్ ఉద్యోగులు కూడా ఈమె వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. వారంతా బయటికి వస్తే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
చీటింగ్ తహసీల్దార్
సాక్షి, సిటీబ్యూరో : చిట్టీల పేరుతో చీటింగ్ చేసినందుకు యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలోని తహసీల్దార్ లింగాల సుధను బుధవారం హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేశారు. ఈమె సమీప బంధువులు, స్నేహితులతో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతోపాటు రూ.2 కోట్లు స్వా హా చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. విధులకు సైతం హాజరుకాకుండా ఆరు నెలలుగా పరారీలో ఉన్న సుధను ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. అధికారం అండతో... లింగాల సుధ గతంలో నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. ఈమెతో పా టు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త మల్లేశం, ఆమె సోదరి డాక్టర్ శ్రావ్య, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీ సర్ మనోహర్‌రావు, హెడ్–మాస్టర్ విజయమ్మ తదితరులతో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా చిట్టీల దందా ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులై ఉండి నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ దందా నిర్వహించారు. వీరంతా ప్రభుత్వ ఉ ద్యోగులు, కీలక వ్యక్తులు కావడంతో ఆయా విభా గాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు వీరి వద్ద చిట్టీలు కట్టారు. ఖాతాదారులు చిట్టీ పాడుకున్నప్పటికీ నగదు వారికి ఇవ్వకుండా రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే ఉంచుకునేవారు. కాగా మనో హర్‌రావు, విజయమ్మ కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. చెక్కులు బౌన్స్ కావడంతో.. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు చిట్టీలు నిర్వహించారు. కొందరు ఖా తాదారులకు సుధ తదితరులు తమ పేర్లతో ఏర్పాటు చేసిన ఉమ్మడి బ్యాంకు ఖాతా ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు చేశారు. అత్యధికుల నుంచి మాత్రం అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు స్వీకరించారు. వీరి చిట్టీల దందా కొన్నాళ్ల పాటు సజావుగానే సాగినా... ఆపై కథ అడ్డం తిరిగింది. వీరిచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. దీనికి సంబంధించి నమోదైన రెండు కేసులను దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతంలో మనోహర్‌రావు, విజయమ్మలను అరెస్టు చేయగా... మల్లేశం, శ్రావ్య న్యాయస్థానం నుంచి ముం దస్తు బెయిల్ పొందారు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో తహసీల్దార్ సుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏడాదిగా విధులకు దూరం పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించిన తహశీల్దార్ సుధ విధులకు దూరంగా ఉన్నారు. గతేడాది జూలైలో ఆరు నెలల పాటు ప్రత్యేక సెలవు పెట్టారు. ఆపై సెలవులను పొడిగిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలు కావడంతో ఏసీపీ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం ఆమె కోసం వేట ముమ్మరం చేసింది. సు ధ కదలికలపై కీలక ఆధారాలు సేకరించి మంగళవారం అర్ధరాత్రి ఆమె షెల్టర్ తీసుకున్న ప్రాం తంపై దాడి చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌కు తరలించి విచారించగా, సుధ నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టు కు తరలించారు. చిట్టీల ద్వారా సంపాదించిన సొమ్ముతో నిందితులు తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు కూడ బెట్టుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. వీరి వలలో పడి సర్వం పోగొట్టుకున్న బాధితుల్లో అనేక మంది ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన వారు కావడం గమనార్హం. -
ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం
సంగారెడ్డి జిల్లా: చిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. వివరాలు..పటాన్చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్లో అనిత, వెంగళ హిమసుధలు పక్కపక్క నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరి భర్తలు కూడా బీడీఎల్ ఉద్యోగులే. వీరు ఈ నడుమ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ చిట్టీల విషయంలో వివాదం తలెత్తడంతో ఆవేశంలో హిమసుధ, అనిత గొంతు కోసి హత్యచేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాయపడిన మహిళను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై భానూరు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నమ్మితే మునిగినట్టే
కూతురు పెళ్లికి పనికొస్తాయని, సొంత ఇంటిని నిర్మించుకోవచ్చని, కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని కొందరు మధ్యతరగతి ప్రజలు చీటీలు కడుతున్నారు. తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి నెల తిరిగే సరికి డబ్బు చెల్లిస్తున్నారు. చీటీల నిర్వాహకులు కొద్ది రోజులు బాగానే డబ్బులు ఇచ్చినా తర్వాత పెద్ద మొత్తంలో మోసం చేసి బిచానా ఎత్తేస్తున్నారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. మూడు నెలల క్రితం కొర్లగుంటలో నివాసం ఉంటు న్న ఓ వ్యక్తి టాక్సీ డ్రైవర్ల వద్ద చీటీలు వేయించుకున్నాడు. వారికి డబ్బులు ఇవ్వకుండా సుమారు రూ.కోటి ఎగరగొట్టాడు. బాధితులంతా ఈస్ట్ పోలీ సులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు. తిరుపతి నగరంలోని సుందరయ్యనగర్‌లో నివాసం ఉంటు న్న మునిరత్నమ్మ చీటీలు నిర్వహిస్తోంది. సుమారు 50 మందికి పైగా చీటీలు వేశారు. వారు డబ్బులు అడగడంతో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి వస్తుందని భావించి ఐపీ పిటిషన్ వేసింది. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగు నెలల క్రితం ఎస్టీవీనగర్‌లో 30 మందికి పైగా ఓ మహిళను నమ్మి చీటీలు వేశారు. ఆమె రూ.40 లక్షలు మేర కట్టలేక పరారైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, తిరుపతి క్రైం : చీటీల వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహించా లంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. నిర్వాహకుల ఆస్తులు, ఆదాయ వనరులు, మార్కెట్లో వాటి విలువ తదితర అంశాలను నమోదు చేయా లి. చీటీల నిర్వాహణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ని యమించాలి. వారు పూర్తిగా నిబంధనలు పాటించాలి. ఈ నిభందనలు ఎక్కడా పాటించడం లేదు. మాటలే పెట్టుబడిగా... కొందరు చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ నమ్మకం పొందుతున్నారు. తర్వాత చీటీలు వేస్తున్నారు. కొద్ది రోజులు బాగానే జరిపి పెద్ద మొత్తంలో చేతికి అందగానే రాత్రికి రాత్రికే బిచానా ఎత్తేస్తున్నారు. ఇలాంటి అనధికార చీటీల వ్యాపారంపై నిఘాలేకపోవడంతో మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఐపీ ఆయుధం చీటీ వేసే నిర్వాహకులకు అడ్డూ అదుపూ లేకుండా పోవడానికి కారణం ఐపీ ఆయుధం. దీన్ని ఆసరాగా తీసుకుని నిర్వహకులు అవసరాన్ని బట్టి చీటీలు ఎగ్గొట్టి స్థానిక పోలీసుల ద్వారా ఐపీ నోటీసులు పంపిస్తున్నారు. కొంతమంది పోలీసులు కూడా కాసులకు కక్కుర్తి పడి అలాంటి వారికే కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీ నోటీసు రాగానే నిర్వాహకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. దీంతో వారు కాలర్ ఎగురవేసుకుంటూ బయట దర్జాగా తిరుగుతున్నారు. ప్రజల్లో మార్పు రావాలి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే చీటీల వల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. మొదట్లో నమ్మకంగా ప్రారంభించి అనంతరం పరారైపోతున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. కష్టపడి దాచుకున్న డబ్బులు పోతే చాలా బాధగా ఉంటుంది. మధ్యతరగతి, నిరుపేదలే ఎక్కువగా మోసపోతున్నారు. ఆర్బీఐ సూచనల మేరకు నమోదైన చీటీల çసంస్థలో సమస్య ఉంటే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అనధికారిక చీటీలు నడిపే వారిపై సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ -
చిట్టీల పేరుతో రూ.8 కోట్లకు టోపీ
లబోదిబోమంటున్న బాధితులు ఒంగోలు క్రైం : దశరాజుపల్లికు చెందిన శేషయ్య అనే వ్యక్తి పదేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అనేక మందితో పరిచయాలు పెంచుకుని చిట్టీలు కట్టించాడు. ఏడాదిగా అతను చీటీ పాటల్లో సభ్యులుగా ఉన్నవారికి పాడిన సమయానికి సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. వడ్డీ వ్యాపారం పేరిట కూడా అనేక మందిని నిలువునా ముంచినట్లు తెలుస్తోంది. శుక్రవారం పెళ్లికి వెళ్లివస్తానని చెప్పి కుటుంబ సభ్యులతో సహా మాయమయ్యాడు. పదేళ్ల క్రితం అతను చిన్న చిన్న చీటీ పాటలతో మొదలుపెట్టిన వ్యాపారం ఒక్కసారిగా రూ.కోటి చీటీ వేసే స్థాయికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం రూ.కోటి వరకు చిట్టీలు రెండు, రూ.50 లక్షలవి ఆరు, రూ.25 లక్షలవి ఐదు చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది అతనికి కూడా బాకీ ఉన్నట్లు తేలింది. అయినా వ్యాపారాన్ని కొనసాగించడంలో భాగంగా రూ.10 వడ్డీకి కూడా అందినకాడికి అప్పు తీసుకున్నట్లు సమాచారం. తీరా కోట్లాది రూపాయలు వెనకేసుకుని తెచ్చిన అప్పులు, వడ్డీ కూడా ఇవ్వకుండా చిట్టీలు పాడిన వారికి డబ్బులు చెల్లించకుండా గ్రామం నుంచే ఉడాయించాడు. దీంతో అతని వద్ద చిట్టీలు వేసిన బాధితులు, వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు తలలు పట్టుకుంటున్నారు. అతని ఖాతాదారులందరూ ఒంగోలు నగరానికి చెందినవారు కావడమే విశేషం. స్థానిక బీవీఎస్ హాలు సమీపంలో న్యూడిల్స్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తికే రూ.40 లక్షలు ఎగనామం పెట్టినట్లు సమాచారం. స్థానిక కమ్మపాలేనికి చెందిన బాధితులు 100 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇంట్లోనే ఇద్దరు సోదరులకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. బాధితులు దశరాజుపల్లికి వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు. ఇదిలా ఉండగా చిట్టీల నిర్వాహకుడు కొంత మందికి న్యాయవాది ద్వారా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసినట్లు కూడా సమాచారం. దీంతో బాధితులు బోరున విలపిస్తున్నారు.