కూతురు పెళ్లికి పనికొస్తాయని, సొంత ఇంటిని నిర్మించుకోవచ్చని, కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని కొందరు మధ్యతరగతి ప్రజలు చీటీలు కడుతున్నారు. తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి నెల తిరిగే సరికి డబ్బు చెల్లిస్తున్నారు. చీటీల నిర్వాహకులు కొద్ది రోజులు బాగానే డబ్బులు ఇచ్చినా తర్వాత పెద్ద మొత్తంలో మోసం చేసి బిచానా ఎత్తేస్తున్నారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.
మూడు నెలల క్రితం కొర్లగుంటలో నివాసం ఉంటు న్న ఓ వ్యక్తి టాక్సీ డ్రైవర్ల వద్ద చీటీలు వేయించుకున్నాడు. వారికి డబ్బులు ఇవ్వకుండా సుమారు రూ.కోటి ఎగరగొట్టాడు. బాధితులంతా ఈస్ట్ పోలీ సులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు.
తిరుపతి నగరంలోని సుందరయ్యనగర్‌లో నివాసం ఉంటు న్న మునిరత్నమ్మ చీటీలు నిర్వహిస్తోంది. సుమారు 50 మందికి పైగా చీటీలు వేశారు. వారు డబ్బులు అడగడంతో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి వస్తుందని భావించి ఐపీ పిటిషన్ వేసింది. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నాలుగు నెలల క్రితం ఎస్టీవీనగర్‌లో 30 మందికి పైగా ఓ మహిళను నమ్మి చీటీలు వేశారు. ఆమె రూ.40 లక్షలు మేర కట్టలేక పరారైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, తిరుపతి క్రైం : చీటీల వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహించా లంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. నిర్వాహకుల ఆస్తులు, ఆదాయ వనరులు, మార్కెట్‌లో వాటి విలువ తదితర అంశాలను నమోదు చేయా లి. చీటీల నిర్వాహణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ని యమించాలి. వారు పూర్తిగా నిబంధనలు పాటించాలి. ఈ నిభందనలు ఎక్కడా పాటించడం లేదు.
మాటలే పెట్టుబడిగా...
కొందరు చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ నమ్మకం పొందుతున్నారు. తర్వాత చీటీలు వేస్తున్నారు. కొద్ది రోజులు బాగానే జరిపి పెద్ద మొత్తంలో చేతికి అందగానే రాత్రికి రాత్రికే బిచానా ఎత్తేస్తున్నారు. ఇలాంటి అనధికార చీటీల వ్యాపారంపై నిఘాలేకపోవడంతో మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.
ఐపీ ఆయుధం
చీటీ వేసే నిర్వాహకులకు అడ్డూ అదుపూ లేకుండా పోవడానికి కారణం ఐపీ ఆయుధం. దీన్ని ఆసరాగా తీసుకుని నిర్వహకులు అవసరాన్ని బట్టి చీటీలు ఎగ్గొట్టి స్థానిక పోలీసుల ద్వారా ఐపీ నోటీసులు పంపిస్తున్నారు. కొంతమంది పోలీసులు కూడా కాసులకు కక్కుర్తి పడి అలాంటి వారికే కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీ నోటీసు రాగానే నిర్వాహకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. దీంతో వారు కాలర్ ఎగురవేసుకుంటూ బయట దర్జాగా తిరుగుతున్నారు.
ప్రజల్లో మార్పు రావాలి
రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే చీటీల వల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. మొదట్లో నమ్మకంగా ప్రారంభించి అనంతరం పరారైపోతున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. కష్టపడి దాచుకున్న డబ్బులు పోతే చాలా బాధగా ఉంటుంది. మధ్యతరగతి, నిరుపేదలే ఎక్కువగా మోసపోతున్నారు. ఆర్‌బీఐ సూచనల మేరకు నమోదైన చీటీల çసంస్థలో సమస్య ఉంటే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అనధికారిక చీటీలు నడిపే వారిపై సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment