నగరి(చిత్తూరు జిల్లా): మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇక్కట్లతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరి పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆనం లలితా లేఅవుట్‌లో నివసిస్తున్న గౌరీ యూనియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది. భర్త శివనాగభాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడే ఉంటోంది. వీరిద్దరూ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఆమె డ్యూటీకి రాకపోవడంతో ఇంటి వద్ద చూసిరావాలని సిబ్బందిని పంపగా ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ సమాచారం మేరకు డీఎస్పీ యశ్వంత్, సీఐ మద్దయ్య ఆచారి, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చదవండి: సర్‌ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి..
ఉద్యోగాల రీత్యా పెళ్లయిన ఆరు నెలల నుంచి కలిసి కాపురం చేయలేకపోతున్నామనే ఆవేదన, బదిలీకి ప్రయతి్నంచినా నాలుగేళ్లుగా సఫలీకృతం కాలేదనే బాధ, బిజీగా ఉంటే కష్టాలు మరచిపోవచ్చంటూ చిట్టీలు ప్రారంభిస్తే కోవిడ్ లాక్‌డౌన్‌తో రెట్టింపైన కష్టాలు.. బాకీలు తీర్చాలంటూ బకాయి పడ్డవారి బెదిరింపులు, బ్యాంకు రుణం మంజూరుచేసి రుణ విముక్తి కల్పించలేదంటూ బ్యాంకు అధికారులపై కోపం వెరసి దంపతులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
కడప జిల్లా ఎర్రగుంట్లలో కూలీల కుటుంబంలో పుట్టిన గౌరీ(25) కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సాధించింది. ఆమెకు కడప జిల్లా వీరప్పనాయనిరెడ్డి పాళెంకు చెందిన శివనాగభాస్కర్ రెడ్డి(32)తో వివాహమై ఐదేళ్లయింది. ఇతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వివాహమైన ఆరు నెలలకే గౌరీకి యూనియన్ బ్యాంక్(ఆంధ్రబ్యాంక్) నగరి బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇక్కడ ఉద్యోగంలో చేరి లలితా లేఅవుట్‌లో అద్దె ఇంట్లో ఉన్నారు. అప్పటి నుంచి భార్యా భర్తలు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉంటూ కాపురం నెట్టుకొచ్చారు. ఈ అంశం వారిద్దరినీ మానసికంగా ఆవేదనకు గురిచేసింది. నాలుగేళ్లుగా బదిలీ కోసం బ్యాంకు ఉన్నతాధి కారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో కృత్తిక(4), కుసుమంత్ రెడ్డి(1) అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కృత్తిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకోలేకపోతున్నామనే బాధ వారిని వేధించింది.
అప్పుల ఊబిలో..
ఈ కష్టాలు మరిచిపోవాలంటే బిజీగా ఉండాలని తలచిన శివనాగభాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. ఈ దశలో కోవిడ్ లాక్‌డౌన్ రావడంతో చిట్టీల నిర్వహణ అస్తవ్యస్తమై ఆర్థికపరమైన సమస్యల్లో కూరుకుపోయాడు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద భూముల దస్తావేజులు ఉంచి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం నగరికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. చిట్టీల్లో బకాయి ఉండడంతో వారంతా అతన్ని వెతుక్కుంటూ నగరికి రావడం మొదలుపెట్టారు. బ్యాంకుకు వెళ్లి గౌరీని కూడా బెదిరించారు. బ్యాంకులో రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల ఊబి నుంచి బయటపడదామనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పిల్లలను పది రోజుల క్రితమే కడప జిల్లా పర్వరాజపేటలోని మేనత్త ఇంటికి పంపించేశారు. చివరకు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరూ తనువు చాలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment