పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు
మంగళగిరి: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు రూ. 50కోట్లతో ఓ వ్యాపారి రాత్రికి రాత్రే తన కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు శివకృష్ణ, శ్రీనివాస్ ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం పక్కన పెద్ద భవంతిలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు మంగళగిరి, తాడేపల్లికి చెందిన పలువురు వెంకటేశ్వరరావు వద్ద చిట్టీలు వేయడం, వడ్డీలకు డబ్బులు ఇచ్చి తీసుకునేవారు.
ఈ క్రమంలో 30 ఏళ్లుగా వందలాది మంది వెంకటేశ్వరరావును నమ్మి కోట్లాది రూపాయలు ఇచ్చారు. వడ్డీలు నెలనెలా చెల్లించేవారు. చిట్టీలు సైతం రూ.20వేల నుంచి రూ.10లక్షల వరకు నిర్వహించే వారు. అయితే కొంతకాలంగా వడ్డీ చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో తమ డబ్బులను వెంటనే చెల్లించాలని వెంకటేశ్వరరావు కుటుంబంపై ఒత్తిడి పెంచారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెంకటేశ్వరరావు కుటుంబం సెల్‌ఫోన్లు అన్నీ స్విచ్చాఫ్ చేసుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించి.. ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు సుమారు రూ. 50 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉన్నట్లు బాధితులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment