chits cheater
-
Hyd: చిట్టీల పేరుతో రూ.200 కోట్ల స్కామ్
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ ప్రాంతంలో చిట్టీల పేరుతో రూ.200 కోట్లు ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. సమతా మూర్తి చిట్ ఫండ్ ఫండ్ కంపెనీ పేరుతో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకుల చేతిలో మోసానికి గురైన వందలాది మంది బాధితులు రెండు నెలల క్రితమే మాదాపూర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదని తెలుస్తోంది. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. సీపీ ఆదేశాలతో కదిలిన మాదాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చిట్‌ఫండ్ కంపెనీతో సంబంధమున్న శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రాకేష్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గణేష్, జ్యోతిలు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదీచదవండి.. మియాపూర్ సస్పెన్షన్.. కారణమిదే -
30 ఏళ్లుగా మోసం.. రూ. 50 కోట్లతో రాత్రికి రాత్రే పరార్
మంగళగిరి: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు రూ. 50కోట్లతో ఓ వ్యాపారి రాత్రికి రాత్రే తన కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు శివకృష్ణ, శ్రీనివాస్ ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం పక్కన పెద్ద భవంతిలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు మంగళగిరి, తాడేపల్లికి చెందిన పలువురు వెంకటేశ్వరరావు వద్ద చిట్టీలు వేయడం, వడ్డీలకు డబ్బులు ఇచ్చి తీసుకునేవారు. ఈ క్రమంలో 30 ఏళ్లుగా వందలాది మంది వెంకటేశ్వరరావును నమ్మి కోట్లాది రూపాయలు ఇచ్చారు. వడ్డీలు నెలనెలా చెల్లించేవారు. చిట్టీలు సైతం రూ.20వేల నుంచి రూ.10లక్షల వరకు నిర్వహించే వారు. అయితే కొంతకాలంగా వడ్డీ చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో తమ డబ్బులను వెంటనే చెల్లించాలని వెంకటేశ్వరరావు కుటుంబంపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెంకటేశ్వరరావు కుటుంబం సెల్ఫోన్లు అన్నీ స్విచ్చాఫ్ చేసుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించారు. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించి.. ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు సుమారు రూ. 50 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉన్నట్లు బాధితులు పేర్కొన్నారు. -
రూ.7 కోట్లతో ఉడాయించిన టీడీపీ నేత
నిడదవోలు రూరల్: కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు.. సొంతిల్లు కట్టుకోవాలని ఇంకొందరు చిట్టీలు కడితే టీడీపీ నాయకుడు, ఉప సర్పంచ్ వారిని మోసం చేసి రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ ఉప సర్పంచ్ తిరుమళ్ల రంజిత్‌కుమార్ ఎన్నో ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు ప్రైవేటు ఫైనాన్స్ నడిపిస్తూ భారీగా నగదు వసూలు చేసినట్టు సమాచారం. నిడదవోలుతో పాటు అట్లపాడు, సమిశ్రగూడెం పరిసర గ్రామాలకు చెందిన ఎంతోమంది అతడి వద్ద చిట్టీలు వేసేవారు. ప్రజల నుంచి వసూలు చేసిన రూ.7 కోట్లకు పైగా సొమ్ముతో రంజిత్‌కుమార్ ఉడాయించినట్టు బాధితులు చెబుతున్నారు. అతడికి ఫోన్ చేస్తే వారం రోజులుగా స్విచ్ ఆఫ్ వస్తోందని, అతడి ఇంటికి వెళితే తాళం వేసి ఉందని బాధితులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి సమిశ్రగూడెం పోలీసులను ఆశ్రయించారు. షేక్ ఇమామ్, మరికొందరు బాధితుల ఫిర్యాదు మేరకు రంజిత్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ సుభానీ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోనూ చిట్టీల పేరుతో టోకరా ఫిరంగిపురం(తాడికొండ): ఎన్నో ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తూ నమ్మకం మాటున తమను మోసం చేసి రూ.2 కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారయ్యిందని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వాసులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిడమానూరి భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు కిరాణ, బట్టల కొట్టు, మందుల షాపు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా చిట్టీపాటలు నిర్వహిస్తూ గ్రామంలో మంచి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు వివాహాలు కాగా అబ్బాయి శివప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట కరోనా ప్రభావంతో వర్క్‌ఫ్రం హోంలో భాగంగా శివప్రసాద్ ఇంటికి చేరాడు. గ్రామంలోని వారికి తన బ్యాంకు అకౌంట్ నంబర్‌ను ఇచ్చి వారిచేత తన అకౌంట్లో చిట్టీల డబ్బు వేయిస్తూ వస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం వెళుతున్నామంటూ చెప్పి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ, కొడుకు శివప్రసాద్ ఫోన్లు, వాట్సాప్ నంబర్లతో సహా బ్లాక్‌లో పెట్టడంతో.. ఫోన్ చేసిన వారికి స్విచ్చాఫ్ అని వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భీమేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారయ్యారని భావించిన 48 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు రూ.2 కోట్ల 5 లక్షలతో పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేశారని, మరికొందరు బాధితులున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పోలీసుల అదుపులో చిట్టీల మోసగాడు!
నకిరేకల్ (నల్లగొండ): చిట్టీల పేరుతో కోటి రూపాయల మేర ప్రజల నుంచి వసూళ్లు చేసి పరారయిన వ్యక్తిని నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడి విచారిస్తున్నారు. నకిరేకల్ మూసీ రోడ్డులో ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్న రాచకొండ శ్రీనివాస్ రూ.కోటి చిట్టీల మోసం కేసులో పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో కొందరు బాధితులు ఆదివారం స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.