రూ.7 కోట్లతో ఉడాయించిన టీడీపీ నేత | TDP Leader Fraud In The Name Of Chits | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్లతో ఉడాయించిన టీడీపీ నేత

Published Sun, Dec 5 2021 4:29 AM | Last Updated on Sun, Dec 5 2021 4:31 AM

TDP Leader Fraud In The Name Of Chits - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నిడదవోలు రూరల్‌: కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు.. సొంతిల్లు కట్టుకోవాలని ఇంకొందరు చిట్టీలు కడితే టీడీపీ నాయకుడు, ఉప సర్పంచ్‌ వారిని మోసం చేసి రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ ఉప సర్పంచ్‌ తిరుమళ్ల రంజిత్‌కుమార్‌ ఎన్నో ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు ప్రైవేటు ఫైనాన్స్‌ నడిపిస్తూ భారీగా నగదు వసూలు చేసినట్టు సమాచారం.

నిడదవోలుతో పాటు అట్లపాడు, సమిశ్రగూడెం పరిసర గ్రామాలకు చెందిన ఎంతోమంది అతడి వద్ద చిట్టీలు వేసేవారు. ప్రజల నుంచి వసూలు చేసిన రూ.7 కోట్లకు పైగా సొమ్ముతో రంజిత్‌కుమార్‌ ఉడాయించినట్టు బాధితులు చెబుతున్నారు. అతడికి ఫోన్‌ చేస్తే వారం రోజులుగా స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని, అతడి ఇంటికి వెళితే తాళం వేసి ఉందని బాధితులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి సమిశ్రగూడెం పోలీసులను ఆశ్రయించారు. షేక్‌ ఇమామ్, మరికొందరు బాధితుల ఫిర్యాదు మేరకు రంజిత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్‌ సుభానీ శనివారం తెలిపారు. 

గుంటూరు జిల్లాలోనూ చిట్టీల పేరుతో టోకరా
ఫిరంగిపురం(తాడికొండ): ఎన్నో ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తూ నమ్మకం మాటున తమను మోసం చేసి రూ.2 కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారయ్యిందని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వాసులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిడమానూరి భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు కిరాణ, బట్టల కొట్టు, మందుల షాపు  నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా చిట్టీపాటలు నిర్వహిస్తూ గ్రామంలో మంచి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు వివాహాలు కాగా అబ్బాయి శివప్రసాద్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట కరోనా ప్రభావంతో వర్క్‌ఫ్రం హోంలో భాగంగా శివప్రసాద్‌ ఇంటికి చేరాడు.  

గ్రామంలోని వారికి తన బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ను ఇచ్చి వారిచేత తన అకౌంట్‌లో చిట్టీల డబ్బు వేయిస్తూ వస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం వెళుతున్నామంటూ చెప్పి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ, కొడుకు శివప్రసాద్‌ ఫోన్లు, వాట్సాప్‌ నంబర్లతో సహా బ్లాక్‌లో పెట్టడంతో.. ఫోన్‌ చేసిన వారికి స్విచ్చాఫ్‌ అని వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భీమేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారయ్యారని భావించిన 48 మంది బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  నిందితులు రూ.2 కోట్ల 5 లక్షలతో పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేశారని,  మరికొందరు బాధితులున్నట్లు సమాచారం ఉందని ఎస్‌ఐ అజయ్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement