మంటల్లో దగ్ధమవుతున్న కారు
సాక్షి, అమరావతి బ్యూరో: స్నేహితుల మధ్య వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం.. ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి కారణమైంది. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డి స్నేహితులు. వీరంతా కలిసి వడ్డీ వ్యాపారంతోపాటు రియల్‌ఎస్టేట్, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహించేవారు.
ఈ నేపథ్యంలో గంగాధర్, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్ రెడ్డి రూ.2.5 కోట్లు అప్పు ఇచ్చాడు. తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వేణుగోపాల్‌రెడ్డి వారిద్దరిపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగాధర్‌కు చెందిన స్థలాన్ని విక్రయించి సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారిని కలుద్దామని చెప్పి గంగాధర్, కృష్ణారెడ్డిలను సోమవారం సాయంత్రం నోవాటెల్ హోటల్ వద్దకు రప్పించాడు. వీరిద్దరితో పాటు గంగాధర్ భార్య నాగవల్లి కూడా కారులో వచ్చి నోవాటెల్ హోటల్ సమీపంలోని కెనరా బ్యాంక్ ముందు ఆపారు. వారితో కారులో కూర్చొని డబ్బు విషయంలో చర్చలు జరుపుతూనే హఠాత్తుగా బయటకొచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, తనతోపాటు తెచ్చుకున్నపెట్రోలును కారుపై పోసి నిప్పంటించి పారిపోయాడు.
వేణుగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా నిప్పంటించడం చూసిన బాధితులు వెంటనే తేరుకొని కారు అద్దాలు పగలగొట్టి డోర్ తీసుకుని బయటకు వచ్చారు. వీరికి స్థానికులు కూడా సాయం అందించారు. కృష్ణారెడ్డికి తీవ్రంగా.. గంగాధర్, నాగవల్లిలకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా కాలిపోయింది. డీసీపీ హర్షవర్ధన్‌రాజు, ప్రమాదస్థలికి చేరుకుని ఘటనపై విచారించారు. ముగ్గురు బాధితులను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment