Business transactions
-
లాక్డౌన్ తర్వాత ఏపీలోనే వ్యాపార లావాదేవీలు అధికం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి మార్చి వరకు జరిగిన వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రల్లో క్షీణత నమోదయితే మన రాష్ట్రంలో ఏకంగా 8.83 శాతం వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జీఎస్టీ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 జూన్ నుంచి 2021 మార్చి వరకు మన రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు 8.83 శాతం వృద్ధితో రూ.22,407.46 కోట్ల నుంచి రూ.24,386.66 కోట్లకు చేరినట్లు ఈ గణాంకాల్లో పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో జీఎస్టీ ఫైలింగ్ ఎంత బాగా జరుగుతోందన్న విషయం కూడా తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ వ్యాపార లావాదేవీలు కేవలం ఆ రాష్ట్రంలో జరిగిన వ్యాపార లావాదేవీలను తెలియచేస్తాయి. అంతర్ రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) బదలాయింపుల తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చిన తుది జీఎస్టీ ఆదాయం లెక్కిస్తారు. ఆదుకున్న సంక్షేమం: ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వ్యాపార లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కర్ణాటకలో 0.18%, తెలంగాణలో 0.81%, కేరళలో 1.07%, తమిళనాడులో 3.78% వృద్ధి మాత్రమే నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికవ్యవస్థలో నగదు లభ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవడమే దీనికి కారణమని వాణిజ్యపన్నుల అధికారులు పేర్కొంటున్నారు. -
కారుపై పెట్రోలు పోసి.. ముగ్గురిపై హత్యాయత్నం
సాక్షి, అమరావతి బ్యూరో: స్నేహితుల మధ్య వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం.. ముగ్గురు వ్యక్తుల సజీవ దహన యత్నానికి కారణమైంది. సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్ సమీపంలోని భారతీనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డి స్నేహితులు. వీరంతా కలిసి వడ్డీ వ్యాపారంతోపాటు రియల్ఎస్టేట్, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో గంగాధర్, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్ రెడ్డి రూ.2.5 కోట్లు అప్పు ఇచ్చాడు. తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వేణుగోపాల్‌రెడ్డి వారిద్దరిపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగాధర్‌కు చెందిన స్థలాన్ని విక్రయించి సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒక రియల్ఎస్టేట్ వ్యాపారిని కలుద్దామని చెప్పి గంగాధర్, కృష్ణారెడ్డిలను సోమవారం సాయంత్రం నోవాటెల్ హోటల్ వద్దకు రప్పించాడు. వీరిద్దరితో పాటు గంగాధర్ భార్య నాగవల్లి కూడా కారులో వచ్చి నోవాటెల్ హోటల్ సమీపంలోని కెనరా బ్యాంక్ ముందు ఆపారు. వారితో కారులో కూర్చొని డబ్బు విషయంలో చర్చలు జరుపుతూనే హఠాత్తుగా బయటకొచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, తనతోపాటు తెచ్చుకున్నపెట్రోలును కారుపై పోసి నిప్పంటించి పారిపోయాడు. వేణుగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా నిప్పంటించడం చూసిన బాధితులు వెంటనే తేరుకొని కారు అద్దాలు పగలగొట్టి డోర్ తీసుకుని బయటకు వచ్చారు. వీరికి స్థానికులు కూడా సాయం అందించారు. కృష్ణారెడ్డికి తీవ్రంగా.. గంగాధర్, నాగవల్లిలకు స్వల్పంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా కాలిపోయింది. డీసీపీ హర్షవర్ధన్‌రాజు, ప్రమాదస్థలికి చేరుకుని ఘటనపై విచారించారు. ముగ్గురు బాధితులను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. -
కనీసం 30 సంవత్సరాల జైలు తప్పదట?
ఇటీవల కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసిన హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంఝూకు జైలు శిక్ష భారీగానే పడే అవకాశం ఉందట. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా అమెరికా వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఆమెకు గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. హువాయ్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫేకుమార్తె అయిన మెంగ్, సంస్థ అనుబంధ సంస్థ స్కై క్యామ్ ఇరాన్లో వ్యాపారం చేయడానికి అనుమతినిచ్చింది, తద్వారా అమెరికా ఆంక్షలు ఉల్లంఘించిందనీ టెక్‌క్రంచ్ నివేదించింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా , ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టేలా చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై హువావేకు అనేక హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కెనడా కోర్టు అనుమతితో అమెరికాకు తరలిస్తే ఈ కేసులో మెంగ్‌కు కనీసం 30సంవత్సరాల కారాగార శిక్ష తప్పదని వ్యాఖ్యానించింది. చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీన అరెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల చైనీస్ మంత్రిత్వ శాఖ మెంగ్ విడుదలకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
కెనడాలో హువావే సీఎఫ్‌వో అరెస్ట్
ఒటావా: చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా హువావే నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలియవచ్చింది. మెంగ్ వాంఝూను అప్పగించాల్సిందిగా అమెరికా కోరుతోందని, ఆమె బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుందని కెనడా న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా... ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే విధంగా చైనా వ్యవహరిస్తోందని, దీన్ని తాము చూస్తూ కూర్చోబోమని అమెరికా సెనేటర్ బెన్ సాసీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తద్వారా వాంఝూ అరెస్ట్ వెనుక ఇరాన్ కోణం ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. అటు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా చట్టాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని హువావే పేర్కొంది. ఈ మధ్యే వాణిజ్య యుద్ధాలపై తాత్కాలిక సంధి కుదుర్చుకున్న చైనా, అమెరికా మధ్య ఈ పరిణామంతో మరోసారి అగ్గి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరిన రోజు డిసెంబర్ 1వ తేదీ నాడే వాంఝూను కెనడాలో అరెస్ట్ చేశారు. మెంగ్‌ను తక్షణం విడుదల చేయాలంటూ కెనడాలోని చైనా దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. సంధి చర్యలు సత్వరం అమలుపై చైనా దృష్టి.. అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి చర్యలను సత్వరం అమలు చేయనున్నట్లు చైనా వెల్లడించింది. నిర్దేశిత 90 రోజుల్లోగా డీల్ కుదుర్చుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. సుంకాలపరమైన పోరుతో వాణిజ్య యుద్ధానికి దారి తీసిన వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు 90 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. సంధి ఒప్పందం ప్రకారం గడువు తీరేదాకా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచకుండా 10% స్థాయిలోనే అమెరికా కొనసాగించనుంది. అటు చైనా తన వంతుగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు మరి న్ని అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది. -
జగమంతా నా కుటుంబమే అనుకుంటారా..?
స్వదేశాన్ని మాతృభూమి అంటారు. అంటే దేశం జన్మనిచ్చిన తల్లితో సమానం. దేశపౌరులంతా కలసికట్టుగా ఉంటే ఎంతో బలం. ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయింది. ప్రపంచీకరణ పేరిట, దేశాలు ఇతర దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామంలో మాతృదేశాన్ని ఎలా గౌరవిస్తున్నామో అలానే ఇతర దేశాలపై వ్యతిరేక భావం ఏర్పరచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా! మీలో దేశభక్తితో పాటు విదేశాలపై ఎలాంటి భావన కలిగి ఉన్నారో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? 1. దేశభక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మాతృదేశాన్ని పూజ్యభావంతో చూస్తారు. ఎ. కాదు బి. అవును 2. దేశం నాకేమి ఇచ్చింది? అని ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఎ. కాదు బి. అవును 3. దేశ ఔన్నత్యాన్ని గురించి అందరితో చెప్తారు. ఎ. కాదు బి. అవును 4. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహనీయులను మరచిపోరు. వారి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 5. దేశసమగ్రతను కోరుకుంటారు. అందరూ సమానమేనన్న భావన పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 6. దేశ విశేషాలతోపాటు ప్రపంచంలో జరిగే విషయాలనూ తెలుసుకుంటారు. ఎ. కాదు బి. అవును 7. దేశాల మధ్య అసమానతలు రాకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ప్రపంచమంతా ఒకతాటిపై నడిస్తే బాగుంటుందనుకుంటారు. ఎ. కాదు బి. అవును 9. ఇతర దేశాలను సందర్శించాలంటే మీకు ఇష్టం. అలానే వాటి సంస్కృతిని కూడ తెలుసుకోవాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. ఇతర దేశాలపై కారణం లేకుండా వ్యతిరేకత పెంచుకోరు. ఎ. కాదు బి. అవును మొదటి ఐదు సమాధానాలు ‘బి’ లు వస్తే మీలో దేశభక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది. ‘బి’ లు ఎనిమిది దాటితే విదేశాలనీ ఇష్టపడతారు. ప్రపంచ విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు. ‘ఎ’ లు ఎక్కువ వస్తే దేశభక్తి మీలో తక్కువ ఉంటుంది. ప్రపంచం గురించి తెలుసుకోవాలనే కుతూహలం మీలో అంతగా ఉండదు. -
లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క హన్మకొండ: వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునేందుకే ఇరు రాష్ట్రాల సీఎంల కుమారులు లోకేశ్, కేటీఆర్‌లు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ విమలక్క ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బయట ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని, లోలోపల ఇద్దరు ఒక్కటేనన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అధికంగా రైతు ఆత్మహత్యలు జరిగితే...వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కి పెట్టారన్నారు. -
సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌కు పాన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆర్థిక అవకతవకలకూ వీలులేకుండా తగిన చర్యలు తీసుకునే దిశలో కేంద్రం మరో ముందడుగు వేసింది. సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌ను కోరుకునే ప్రైవేటు సంస్థలకు సంబంధిత యజమాని లేదా చట్టబద్ధమైన సంస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అప్లికెంట్ తన ఈ మెయిల్ అడ్రస్‌ను, మొబైల్ నంబర్‌ను కూడా అప్లికేషన్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా తమ ఆన్లైన్ అప్లికేషన్లలో ప్రభుత్వ శాఖలు పాన్‌ను తెలపనక్కర్లేదని ప్రకటన పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించిన ఎక్సైజ్ సుంకం చెల్లింపునకు సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనివల్ల అసెస్సీ ఆన్లైన్లో చెల్లింపులు జరిపే వీలుంటుంది. -
ఫేస్బుక్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ ఇలా..
ఆప్తులకు, స్నేహితులకు, ఇతర వ్యాపార లావాదేవీలు జరపడానికి బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా?.. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి సమయం మించిపోయిందా?.. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రాంచి కోడ్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర విషయాలపై మీకు అవగాహన లేదా? అయితే ఇలాంటి సందర్భాల్లో నగదును సులభంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఫేస్బుక్ దోహద పడుతుంది. ఇందుకు కొటక్ మహీంద్రా వారు అవకాశం కల్పిస్తున్నారు. - గాజులరామారం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా.... ►ఇందుకు మీరు https://www.kaypay.com ►వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి. ►ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్బుక్ ఆప్షన్ వస్తుంది. ►మీరు ఫేస్బుక్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. ►మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి ►కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ►మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ►ఇక్కడ అకౌంట్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబరుతోపాటు ఎంఎంఐడీ నెంబరు ఇవ్వాలి. ►ఇందుకు మీరు ఐడీని ఎస్ఎంఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది. నగదు ట్రాన్స్ఫర్ చేయండి ఇలా... ►మీ రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న మిత్రులకు మీరు నగదు ►బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది. ►మీరు నగదు పంపాల్సిన వ్యక్తిని ఎంచుకుని ►అతని అకౌంట్ నంబరును ఎంటర్చేయాలి. ►మీరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా ఇక్కడ పొందుపరచవచ్చు. ►ఇక మీరు ఒన్ టైమ్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ►ఇందుకు మీరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోగానే ఓటీపీ కోసం ► ఎస్ఎంఎస్ చేసే విధానాన్ని చూపిస్తుంది. ►దాన్ని అనుసరించి మీరు ఓటీపీ రూపొందించుకోవాలి. ►మీ మొబైల్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేస్తే నగదు బదిలీ అవుతుంది. ►మీరు నగదు పంపే వ్యక్తి కేపేలో రిజిస్టర్ లేకపోతే అతని ఫేస్బుక్ ►అకౌంట్‌కు సమాచారం వెళ్తుంది. ►సంబంధిత వ్యక్తి 48 గంటల్లో kaypayలో రిజిస్టర్ అవ్వాలి. ►ఒక వేళ కాని పక్షంలో తిరిగి మీ డబ్బులు మీ అకౌంట్‌కు చేరుతాయి. సూచనలు... ►ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం 28 బ్యాంకులకు మాత్రమే ఉంది. ►ఇది 24 గంటలూ పని చేస్తోంది. ►నగదు పంపేవారు రోజుకు రూ. 2,500, నెలకు రూ.25 వేల వరకు మాత్రమే నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ►ఈ విధానం ద్వారా నెల మొత్తంలో ఎప్పుడైనా రూ.25 వేలు అందుకోవచ్చు. ►24 గంటల్లో మీ నగదు బదిలీ పూర్తి అవుతుంది. ►మీ పేరు కాని, మీరు బదిలీ చేయాలనుకునే వారి పేరు కానీ, బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచ్ కోడ్ కాని అందించాల్సిన అవసరం లేదు. ►టువే సెక్యూర్డ్ పాస్వర్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సేఫ్. ►అన్ని లావాదేవీలు కొటక్ మహీంద్రా సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయి. ఉదాహరణకు.. ►మీది ఎస్బీఐ అకౌంట్ అయితే MMID SBI అని టైప్ చేసి 9223440000కు మెసేజ్ చేయాలి. ►బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో మీరు ఏ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నారో దాని నుంచే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ►mmid పొందాలంటే మీ ఫోన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్‌కు లింక్ అప్ అయి ఉండాలి. ►ఎంఎంఐడీ కోసం ప్రతి బ్యాంక్‌కు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఉంటుంది. సంబంధిత నంబర్ బ్యాంక్ పేరు ఎంచుకోగానే మీకు కనిపిస్తుంది. ►ఇప్పుడు మీ మొబైల్‌కు ఏడు అంకెలు గల mmid (mobile money identifier)-వస్తుంది. ►దీన్ని ఎంటర్ చేశాక తరువాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్‌ను ►సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. ► ఇక మీ అకౌంట్ రిజిష్ట్రర్ అయిపోయినట్లే.